నర్సీపట్నం : పార్టీలతో ప్రమేయం లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో ఆదివారం మూడు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం తనకు సహకరించారని, వారి రుణం తీర్చుకునేలా పార్టీ ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు.
గత ఎన్నికల్లో తాను సాధించిన విజయంలో పార్టీ నాయకులతో పాటు ప్రత్యర్థుల ప్రమేయముందని, కష్ట సమయంలో వెన్నంటి ఉన్నవారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో తనకు సహకరించిన వారికి సైతం అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. రాష్ర్టంలో ఎక్కడాలేని విధంగా తన నియోజకవర్గానికి రూ. 40 కోట్ల మేర నిధుల్ని కేటాయించినట్టు ఆయన వివరించారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేందుకు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.
కొన్ని మండలాల్లో పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేలా వ్యవహరిస్తున్నారని, అవసరం లేని చోట పనులు చేపట్టి నిధుల వృధాకు పాల్పడుతున్నారని, ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి నియోజక అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవుపలికారు.
తనకు ఎన్నికల్లో సహకరించిన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, పార్టీ గొలుగొండ, మాకవరపాలెం మండలాల అధ్యక్షులుగా అడిగర్ల అప్పలనాయుడు, రుత్తల శేషుకుమార్‌లను నియమించారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు సీహెచ్ వివేకానంద, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామునాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీలతో ప్రమేయం లేకుండా అభివృద్ధి: మంత్రి అయ్యన్న
Published Mon, Apr 20 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement
Advertisement