పుష్కరాలకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలన్న ప్రభుత్వం
పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఆదేశం
అవి ఏమూలకూ చాలవంటున్న అధికారులు
కేంద్ర నిధులు కావడంతో ఇబ్బందులు వస్తాయేమోనని సందేహం
వీటిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
సాక్షి, రాజమండ్రి : పుష్కరాల నిధులపై అధికారుల్లో ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. నిన్నటివరకూ పనులు మంజూరు కాలేదని మధనపడ్డ అధికారులు ఇప్పుడు, ఆ పనులకు నిధులెలా వస్తాయని మల్లగుల్లాలు పడుతున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో రూ.336 కోట్ల విలువైన పుష్కరాల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలంటూ జీఓ విడుదల చేసింది. అలాగే గ్రామాల్లో ఘాట్‌ల వద్ద చేపట్టే పనులకు కూడా ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఈ నిధులను పుష్కరాల పనులకు వినియోగిస్తే, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు పుష్కరాల పనులు చేపట్టేంత స్థాయిలో ఉండవు.
ఉదాహరణకు ఒక్క రాజమండ్రిలోనే రూ.240 కోట్ల పుష్కరాల పనులు మంజూరవగా 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు కూడా లేవు. మిగిలిన నిధులు ఎక్కడనుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకమే అవుతోంది. గడచిన ఐదేళ్లలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకూ సుమారు రూ.80 కోట్లు, పంచాయతీలకు మరో రూ.120 కోట్ల వరకూ 13వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని అంచనా వేశారు. ఆ అంచనాల మేరకు ఇప్పటికే 50 శాతం నిధులను వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంఘం నిధులను పుష్కరాలకు ఎలా వినియోగించాలనేదానిపై అధికారులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన నిధులు కావడంతో.. రానున్న రోజుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న వారిని వేధిస్తోంది.
ఈ సందేహాలన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలని మంగళవారం రాజమండ్రిలో జరిగిన పుష్కరాల హైపవర్ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ను పలువురు అధికారులు కోరారు. పనులను మంజూరు చేసిన ప్రభుత్వమే అవసరమైన నిధులు కూడా ఇస్తుందని పుష్కరాల ప్రత్యేకాధికారి జె.మురళి అన్నారు. అయితే జీఓల్లో మిగిలిన నిధులను ప్రభుత్వం ఇస్తుందన్న విషయం ఎక్కడా లేకపోవడంతో మురళి వివరణ అధికారులకు నమ్మకాన్ని కలిగించలేదు. పుష్కరాల పనులకు టెండర్లు పిలవాలంటే నిధులను ఏ పద్దు కింద వినియోగించాలనే దానిపై స్పష్టత రావాల్సిందేనని వారంటున్నారు. తీరా పనులు పూర్తయ్యాక మిగిలిన నిధులు ఎవరిస్తారనేదానిపై కూడా ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
క్లారిటీ కావాలి
Published Wed, Jan 28 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM
Advertisement
Advertisement