Rajahmundry Corporation
-
రాజమహేంద్రవరం ఇక మహానగరం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం మహానగరంగా రూపుదాల్చుతోంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న 21 గ్రామాల విలీనంతో 5,79,802 జనాభాకు చేరుకుంది. ఇప్పటి వరకూ 44.50 చదరపు కిలో మీటర్లు పరిధిగల ఈ నగరం నాలుగున్నర రెట్లు పెరిగి 217.80 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటి వరకూ 3,41,831 జనాభాతో 50 డివిజన్లకే పరిమితమైన ఈ నగరం 5,79,802 జనాభాతో 54 డివిజన్లకు చేరుకోనుంది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్ సిటీ; బొమ్మూరు, ధవళేశ్వరం, కాతేరు, వెంకటనగరం, కోలమూరు, రాజవోలు, తొర్రేడు, నిడిగట్ల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్‌చెరువు, నామవరం, వెలుగుబంద, గాడాల, మధురపూడి, బూరుగుపూడి, వేమగిరి గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీంతో పట్టణ ప్రణాళిక విభాగం పెరిగిన జనాభా నిష్పత్తిని అనుసరించి డివిజన్ల పునర్విభజన కార్యక్రమం చేపట్టి పూర్తి చేశారు. 4వేలలోపు జనాభా ఉండే డివిజన్ జనాభాను 8 వేల నుంచి 12 వేల వరకూ పెంచి అందుకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యనూ పెంచారు. రాజమహేంద్రవరం నగరంలో ఇప్పటి వరకూ ఉన్న 50 డివిజన్లను 30 డివిజన్లకు కుదించారు. మిగిలిన 24 డివిజన్లను చుట్టు పక్కల గ్రామాల జనాభాతో ఏర్పాటు చేశారు. ఒకటో డివిజన్‌గా లాలాచెరువుతో ప్రారంభమై 54వ డివిజన్ నిడిగట్లతో ముగియనుంది. 54 డివిజన్ల సరిహద్దుల విషయంలో ఏమైనా సలహాలుంటే వారం రోజుల లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని నగర కమిషనర్ అభిషిక్త్ కిశోర్ కోరారు. -
కౌన్సిల్లో ‘దేశం’ రచ్చ..రాజమండ్రికి మచ్చ..
నాలుగు మంచిపనులు చేస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. వారికి ఐదేళ్లపాటు బాధ్యతలను అప్పగిస్తారు. తీరా గద్దెనెక్కాక వారు వ్యవహరించే తీరును చూసి విస్తుపోవడం ప్రజల వంతవుతోంది. ఈ వారం రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు నగర చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయూరుు. ఓ వైపు పుష్కరాలు దగ్గర పడుతున్న తరుణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు దృష్టి సారించాల్సింది పోయి, కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలను తప్పించుకునేందుకు నాటకీయంగా వ్యవహరించడాన్ని నగరవాసులు ఈసడించుకుంటున్నారు. (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :రాజమండ్రి కార్పొరేషన్ పగ్గాలు నగర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలి. అభివృద్ధి పనులపై వస్తున్న అవినీతి, ఆరోపణలపై చర్చించి... లోటుపాట్లు సవరించాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఉంది. అయితే మెజార్టీ ఉందన్న అహంకారంతో ఏకపక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాజమండ్రి మున్సిపల్ చరిత్రలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చూసి మేధావులు, నగర ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. స్వయంగా అధికార పార్టీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ లేఖ రాయడం గమనార్హం. నగరంలో సెల్ టవర్లు, వాటి నిర్వహణ, జనన మరణ విభాగంలో అవినీతి, రిలయన్స్ 4జీ విషయంలో రోడ్ల తవ్వకాలకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరు, మేయర్ కార్లకు అయ్యే ఖర్చు, నగర పాలక సంస్థకు ఫర్నీచర్ కొనుగోలులో అవినీతి వంటి మొత్తం 23 అంశాలపై కమిషనర్‌కు ఆయన లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే కౌన్సిల్ చర్చలో ఈ అంశాలను పక్కదారి పట్టించేందుకు పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కార్పొరేటర్లు నాటకీయ పరిణామాలకు పురిగొల్పారు. తమ తప్పు దొరక్కుండా తప్పించుకున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే అధికార పక్షం అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ విషయాన్ని బయటకు తీసుకురాగలిగింది. ఎన్ని చేసినా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం సాధ్యం కాదని అధికారపార్టీ నేతలు గ్రహిస్తే మేలు. ‘పట్టిసీమ’పై చంద్రబాబు మొండిపట్టు కొంతకాలంగా వివాదాస్పదమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈ వారం మరోసారి చర్చకు వచ్చింది. ఈ పథకం వల్ల గోదావరి సీమ ఎడారిగా మారిపోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీలు ఎంత నిరసన తెలిపినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ అమలు చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు డెల్టా రైతుల పొట్టకొట్టే పట్టిసీమకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ నైజాన్ని బయట పెట్టుకున్నారు. రూ.16 వేల కోట్లతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా కనీసం నిరసన కూడా తెలపని చంద్రబాబు పట్టిసీమపై పట్టుదలగా ఉండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసి కూడా రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు మొండిగా ముందుకు వెళుతోంది. అంచనాలకు 20 శాతం ఎక్కువకు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా ఈ పథకం అసలు ఉద్దేశం సొమ్ములు చేసుకోవడమేనని తేటతెల్లం చేశారు. దీనిపై అమీతుమీ తేల్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. అమెరికా నుంచి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల కాకినాడలో సమావేశమై పట్టిసీమ పథకం నిలుపుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్‌తో ఉద్యమించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఎత్తిపోతల పథకంపై చేపట్టాల్సిన ఉద్యమంపై గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రు, ఆళ్ల నాని చర్చించారు. త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం రైతులకు ఊరటనిస్తోంది. రాజా వివాహ వేడుకకు హాజరైన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు వచ్చారు. దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. జక్కంపూడి కుటుంబంపై తమ కుటుంబానికి ఉన్న ఆప్యాయాతానురాగాలను మరోసారి చూపించారు. జక్కంపూడి ఇంట గంటకుపైగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో రెండు మూడువేల ఎకరాలు సరిపోతాయని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కుంటున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా తన వాణిని వినిపిస్తానని చెప్పారు. కాగా వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు రాజా, రాజీ దంపతులను ఆశీర్వదించారు. జన్మస్థలంలో ‘గానగంధర్వుడు’ గానగంధర్వుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆరేళ్ల తరువాత తన జన్మస్థలమైన శంకరగుప్తం రావడంతో ఆ గ్రామం ఉప్పొంగింది. గ్రామస్తులు చూపించిన ఆదరాభిమానాలకు మంత్రముగ్ధులయ్యారు. మైమరిచిపోయారు. ఆయనతోపాటు వచ్చిన కుమార్తెలు, కోడళ్లు, మనుమలు, మనుమలతో గ్రామంలో తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించి పులకించిపోయారు. గ్రామస్తులు ఆయనకు సత్కరించుకుని పాదపూజ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రబీలో నీటికి కటకట పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ఎడారిగా మారుతుందన్న రైతుల ఆందోళన ముందే నిజమయ్యేలా ఉంది రబీ పరిస్థితి చూస్తుంటే. గోదావరి డెల్టాలో నెలకొన్న నీటి ఎద్దడి ఆయకట్టు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జిల్లాలో డెల్టా కాలువల పరిధిలో సుమారు 3.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. చేలు పాలుపోసుకునే దశకు చేరుకున్న సమయంలో చేలల్లో నీటికి ఎక్కువగా ఉంచుతారు. సరిగ్గా ఇదే సమయంలో నీటి ఎద్దడి రైతులను కలవరపెడుతోంది. నీటి ఎద్దడిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న 4,500 క్యూసెక్కుల నీటికి అదనంగా గత ఆదివారం నుంచి వెయ్యి క్యూసెక్కులు, శుక్రవారం నుంచి మరో వెయ్యి క్యూసెక్కులు కలిపి విడుదలు చేస్తున్నారు. మొత్తానికి డెల్టాకు నీటి ఎద్దడి తప్పేటట్టు లేదు. గోదావరిలోని, మురుగునీటి కాలువల్లోని వృథా జలాలను పంట కాలువల్లోకి, చేలల్లోకి మళ్లించేందుకు రూ.పది కోట్లు అవసరమవుతాయని అధికారులు సాగు ఆరంభంలోనే ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం సకాలంలో అనుమతి ఇవ్వకపోడంతో ఇప్పుడు సీలేరు నుంచి అదనపు నీటిని తెప్పిస్తున్నా శివారుకు అందడం లేదు. రబీ సాగుకు ఈ 30 రోజులు కీలకమని తెలిసి కూడా అధికారులు ముందుగా మేల్కొనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడికి గురైతే ధాన్యం గింజలు తాలుతప్పలుగా మారిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పట్టిసీమ ఎత్తిపోతలు చేపడితే డెల్టా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. -
క్లారిటీ కావాలి
పుష్కరాలకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలన్న ప్రభుత్వం పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు ఆదేశం అవి ఏమూలకూ చాలవంటున్న అధికారులు కేంద్ర నిధులు కావడంతో ఇబ్బందులు వస్తాయేమోనని సందేహం వీటిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, రాజమండ్రి : పుష్కరాల నిధులపై అధికారుల్లో ఇప్పటికీ స్పష్టత రావడంలేదు. నిన్నటివరకూ పనులు మంజూరు కాలేదని మధనపడ్డ అధికారులు ఇప్పుడు, ఆ పనులకు నిధులెలా వస్తాయని మల్లగుల్లాలు పడుతున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో రూ.336 కోట్ల విలువైన పుష్కరాల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించాలంటూ జీఓ విడుదల చేసింది. అలాగే గ్రామాల్లో ఘాట్ల వద్ద చేపట్టే పనులకు కూడా ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఈ నిధులను పుష్కరాల పనులకు వినియోగిస్తే, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు పుష్కరాల పనులు చేపట్టేంత స్థాయిలో ఉండవు. ఉదాహరణకు ఒక్క రాజమండ్రిలోనే రూ.240 కోట్ల పుష్కరాల పనులు మంజూరవగా 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు కూడా లేవు. మిగిలిన నిధులు ఎక్కడనుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకమే అవుతోంది. గడచిన ఐదేళ్లలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకూ సుమారు రూ.80 కోట్లు, పంచాయతీలకు మరో రూ.120 కోట్ల వరకూ 13వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని అంచనా వేశారు. ఆ అంచనాల మేరకు ఇప్పటికే 50 శాతం నిధులను వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంఘం నిధులను పుష్కరాలకు ఎలా వినియోగించాలనేదానిపై అధికారులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన నిధులు కావడంతో.. రానున్న రోజుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. ఈ సందేహాలన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలని మంగళవారం రాజమండ్రిలో జరిగిన పుష్కరాల హైపవర్ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ను పలువురు అధికారులు కోరారు. పనులను మంజూరు చేసిన ప్రభుత్వమే అవసరమైన నిధులు కూడా ఇస్తుందని పుష్కరాల ప్రత్యేకాధికారి జె.మురళి అన్నారు. అయితే జీఓల్లో మిగిలిన నిధులను ప్రభుత్వం ఇస్తుందన్న విషయం ఎక్కడా లేకపోవడంతో మురళి వివరణ అధికారులకు నమ్మకాన్ని కలిగించలేదు. పుష్కరాల పనులకు టెండర్లు పిలవాలంటే నిధులను ఏ పద్దు కింద వినియోగించాలనే దానిపై స్పష్టత రావాల్సిందేనని వారంటున్నారు. తీరా పనులు పూర్తయ్యాక మిగిలిన నిధులు ఎవరిస్తారనేదానిపై కూడా ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
అల్లూరికి విప్లవబీజం పడిందిక్కడే
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 117వ జయంతి నేడే. ఆ సందర్భంగా జిల్లాతో ఆయన అనుబంధంపై కథనం... రాజమండ్రి కల్చరల్:దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు సాయుధపోరాటమే సాధనంగా ఎంచుకున్న విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకు రాజమండ్రితో విడదీయలేని అనుబంధం ఉంది. అల్లూరి సీతారామరాజు అక్షరాభ్యాసం, ప్రాథమిక విద్య, స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి పొందినది రాజమహేంద్రిలోనే కాగా ఆయన పోరాటాలకు జిల్లా వేదిక అయింది. అల్లూరి సీతారామరాజు 1897 జూలై7న ప్రస్తుత భీమిలి నియోజకవర్గంలోని పాడ్రంగి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వేంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వేంకటరామరాజుకు నేటి డీలక్స్ సెంటర్ వద్ద ఫొటో స్టూడియో ఉండేది. సీతారామరాజు ఉల్లితోట వీధిలోని బంగారయ్య ప్రాథమిక పాఠశాలలో ఒకటో తగరతినుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నారు. పాత బ్రిడ్జి సమీపంలో, పుష్కరాలరేవు ప్రాంతంలో సీతారామరాజు ఉభయ సంధ్యల్లో గోదావరి జలాల్లో స్నానం చేసేవాడు. తండ్రితో కలసి నిత్యం గోదావరి గట్టుపై వ్యాహ్యాళికి వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం వ్యాహ్యాళి సమయంలో ఒక బ్రిటిష్ అధికారి గుర్రంపై సీతారామరాజుకు ఎదురు వచ్చాడు. ఆ బ్రిటిష్ సైనికునికి సీతారామరాజు వందనం చేయగా తండ్రి మందలించారు. ఆంగ్లేయుల పాలన వలన మనదేశానికి కలుగుతున్న అనర్థాను ఆయన తనకుమారుడికి వివరించి చెప్పారు. తండ్రి మాటలే సీతారామరాజుకు స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లడానికి నాందిపలికాయి. 1908లో వేంకటరామరాజు మరణించడంతో సీతారామరాజుకు రాజమండ్రితో బంధం తెగిపోయింది. పోలీసుస్టేషనులపై దాడి సాయుధపోరాటంలో సీతారామరాజు కొయ్యూరు మండలం, కృష్ణాదేవిపేట వద్ద నడింపాలెం గ్రామంలో పోలీసు స్టేషనులపై దాడులకు వ్యూహరచన చేశారు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి, 23న కృష్ణాదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీసుస్టేషనులపై అల్లూరి తన అనుచరులతో కలసి దాడులు చేసి, ఆయుధాలను తీసుకువెళ్లారు. అక్టోబర్ 15న అడ్డతీగల పోలీసుస్టేషనుపై దాడి చేశారు. పట్టుబడిన సింహం 1924 మే 1 నుంచి ఆరో తేదీ వరకు రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో అల్లూరి అనుచరులకు, ఆంగ్లేయులకు భీకర పోరాటాలు కొనసాగాయి. ఆ పోరాటాలలో అల్లూరి కుడిభుజం అగ్గిదొర పట్టుబడ్డాడు. అల్లూరికి గాయాలు తగిలాయి. మే 7వ తేదీన కొయ్యూరు మండలం ముంపలో ఒక ఏరులో అల్లూరి గాయాలను కడుగుకుంటుండగా మేజర్ గుడాల్ అల్లూరిని బంధించాడు. నులకమంచానికి అల్లూరిని కట్టివేసి, రాజేంద్రపాలెం పుంతరోడ్డుకు తీసుకువెళ్లి చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. అధికారికంగా అల్లూరి జయంతి వేడుకలు కల్చరల్(కాకినాడ) : విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలను రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. కాకినాడ పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోటనరసింహం, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి పాల్గొంటారన్నారు. సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు స్థానిక నాగమల్లి తోట జంక్షన్ వద్దగల అల్లూరి విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వపోటీలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పుష్కరాల్లోగా గోదావరి గట్టుపై అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పాలి విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గోదావరిగట్టుపై ప్రతిష్ఠించేందుకు 2009 జూన్ 11న రాజమండ్రి నగరపాలకసంస్థ తీర్మానించింది. అయితే అది ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. పుష్కరాలలోగా గోదావరి గట్టుపై అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పాలి. - పడాల వీరభద్రరావు, అధ్యక్షుడు, రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం -
నేటి నుంచి జగన్ ‘జనభేరి’
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఆయన సోమవారం సాయంత్రం రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి క్వారీ మార్కెట్ సెంటర్లో జరిగే ‘వైఎస్సార్ జనభేరి’ సభలో పాల్గొంటారు. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని అన్ని డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తలపడుతున్నారు. ఇప్పటికే మండపేటలో ఒకరు, అమలాపురంలో మరొకరు వైఎస్సార్ సీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై విజయదుందుభి మోగించడంతో జిల్లా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని సుస్పష్టమవుతోంది. రాజమండ్రి సహా అన్ని చోట్లా గెలుపు బావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన అనంతరం ఇతర పార్టీల అగ్రనాయకుల కన్నా ముందుగా జగన్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రానుండడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మోముల్లో అప్పుడే విజయ దరహాసం చిగురిస్తోంది. మున్సిపోల్స్‌లో సాధించే విజయాల స్ఫూర్తితో ఆ వెంటనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ జయభేరి మోగిస్తామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గత నాలుగున్నరేళ్లుగా జగన్‌కు అండగా నిలిచిన జిల్లావాసులు ఈ కీలక సమయంలోనూ ఆయన వెంటే ఉంటారని, ప్రజాసమస్యలపై గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరు సాగిస్తున్న ఆయన నాయకత్వాన్నే కోరుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. ఆయన జిల్లాకు ఎప్పుడు వచ్చినా బ్రహ్మరథం పట్టడమే అందుకు తార్కాణమంటున్నారు. కాగా జిల్లాలో జగన్మోహన్రెడ్డి రోడ్ షోలు సాగే రూట్ మ్యాప్‌ను పార్టీ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదివారం అమలాపురంలో పరిశీలించారు. -
పురపాలనలో శాటి‘లైట్’
సాక్షి, రాజమండ్రి: ‘ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయి. వాటి విస్తీర్ణం ‘ఇంత’.. ఇదిగో ఇదీ నగరంలోని మురికివాడల దుస్థితి.. ఇక్కడ తిష్ట వేసిన సమస్యలు ఇవీ.. ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా మారాయి..’ వంటి వివరాలన్నీ ఇక నుంచి రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులు ‘ఆకాశనేత్రం’తో తెలుసుకోనున్నారు. వీటి వివరాలు వెబ్సైట్లో నిక్కచ్చిగా లభించబోతున్నాయి. ఇది పౌరులకు ‘జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం’(జీఐఎస్) అందిస్తున్న సౌలభ్యం. శాటిలైట్ సహాయంతో నగర రూపురేఖలను రూపొందించి వెబ్‌లో పొందు పరుస్తారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, వాటి వివరాలు, మురికివాడలు, వాటిలో సమస్యలు, రోడ్ల స్థితి వంటి వాటికి సంబంధించిన వివరాలు సచిత్రంగా వెబ్‌లో చోటు చేసుకుంటాయి. ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా అందే తాజా చిత్రాలు నగరంలో పరిస్థితిని కళ్లకు కట్టిస్తాయి. ఈ సమాచార సాంకేతిక విప్లవ ఫలితం మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తోంది. రాజమండ్రిలో ఇలా.. జీఐఎస్ విధానంలో రాజమండ్రి నగరాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు 2010లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయంలోని జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగం ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు ప్రారంభించి పూర్తి చేశారు. ఇందుకోసం కార్పొరేషన్ రూ.24 లక్షలు వెచ్చించింది. ఇప్పటికే 90 శాతానికి పైగా రూపకల్పన పూర్తవగా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో 2002-2004 మధ్యలోనే జీఐఎస్ ఆధారిత చిత్రాలు సేకరించినా అవి సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే అస్పష్టంగా ఉండి కేవలం నమూనాలుగా మిగిలిపోయాయి. పశ్చిమబెంగాల్లోని కళ్యాణి అనే మున్సిపాలిటీలో 2010లో అత్యాధునిక జీఐఎస్ వ్యవస్థ రూపొందించి సఫలమయ్యారు. కళ్యాణి దేశంలో అతివేగంగా జనాభా విస్తరించిన అర్బన్ ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు రాజమండ్రి మన రాష్ట్రంలో ఈ విధానం అమలులోకి తెస్తున్న తొలి నగర పాలక సంస్థ కానుంది. ఇక్కడ జనాభా 2001తో పోలిస్తే 22 శాతానికి పైగా పెరిగింది. ఈ కొత్త వ్యవస్థ నగరాభివృద్ధికి దోహద పడుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో సమతుల్యత జీఐఎస్ వ్యవస్థ అమలు చేయడం వల్ల పట్టణాభివృద్ధిలో సమతుల్యత సాధించగలుగుతాం. ఇప్పటికే ఈ వ్యవస్థ ఒక కొలిక్కి వచ్చింది. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది. - రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్, రాజమండ్రి జీఐఎస్ అంటే.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) అనేది శాటిలైట్ సహాయంతో తయారయ్యే సమగ్ర భౌగోళిక సమాచార వ్యవస్థ. పట్టణీకరణ దిశగా పరుగులు పెడుతున్న సమాజానికి కీలకమైన ఆవశ్యకత కూడా. నానాటికీ విస్తరిస్తున్న పట్టణాలు, నగరాలు, వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం కష్టసాధ్యమవుతోంది. జనావాసాల్లో మౌలిక సదుపాయాల స్థితిగతులపై సమగ్ర సమాచారం లేక పౌర సేవలు మెరుగు పడేందుకు ఆటంకం ఎదురవుతోంది. సిబ్బందితో ఈ సమాచార సేకరణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ వ్యవస్థను అందిపుచ్చుకుంటూ నగర ప్రణాళికలు రూపొందించడమే జీఐఎస్ పరమార్థం.