రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం మహానగరంగా రూపుదాల్చుతోంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న 21 గ్రామాల విలీనంతో 5,79,802 జనాభాకు చేరుకుంది. ఇప్పటి వరకూ 44.50 చదరపు కిలో మీటర్లు పరిధిగల ఈ నగరం నాలుగున్నర రెట్లు పెరిగి 217.80 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటి వరకూ 3,41,831 జనాభాతో 50 డివిజన్లకే పరిమితమైన ఈ నగరం 5,79,802 జనాభాతో 54 డివిజన్లకు చేరుకోనుంది. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్ సిటీ; బొమ్మూరు, ధవళేశ్వరం, కాతేరు, వెంకటనగరం, కోలమూరు, రాజవోలు, తొర్రేడు, నిడిగట్ల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్‌చెరువు, నామవరం, వెలుగుబంద, గాడాల, మధురపూడి, బూరుగుపూడి, వేమగిరి గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు.
దీంతో పట్టణ ప్రణాళిక విభాగం పెరిగిన జనాభా నిష్పత్తిని అనుసరించి డివిజన్ల పునర్విభజన కార్యక్రమం చేపట్టి పూర్తి చేశారు. 4వేలలోపు జనాభా ఉండే డివిజన్ జనాభాను 8 వేల నుంచి 12 వేల వరకూ పెంచి అందుకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యనూ పెంచారు. రాజమహేంద్రవరం నగరంలో ఇప్పటి వరకూ ఉన్న 50 డివిజన్లను 30 డివిజన్లకు కుదించారు. మిగిలిన 24 డివిజన్లను చుట్టు పక్కల గ్రామాల జనాభాతో ఏర్పాటు చేశారు. ఒకటో డివిజన్‌గా లాలాచెరువుతో ప్రారంభమై 54వ డివిజన్ నిడిగట్లతో ముగియనుంది. 54 డివిజన్‌ల సరిహద్దుల విషయంలో ఏమైనా సలహాలుంటే వారం రోజుల లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని నగర కమిషనర్ అభిషిక్త్ కిశోర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment