సాక్షి, రాజమండ్రి:
‘ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయి. వాటి విస్తీర్ణం ‘ఇంత’.. ఇదిగో ఇదీ నగరంలోని మురికివాడల దుస్థితి.. ఇక్కడ తిష్ట వేసిన సమస్యలు ఇవీ.. ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా మారాయి..’ వంటి వివరాలన్నీ ఇక నుంచి రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులు ‘ఆకాశనేత్రం’తో తెలుసుకోనున్నారు. వీటి వివరాలు వెబ్‌సైట్‌లో నిక్కచ్చిగా లభించబోతున్నాయి. ఇది పౌరులకు ‘జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం’(జీఐఎస్) అందిస్తున్న సౌలభ్యం. శాటిలైట్ సహాయంతో నగర రూపురేఖలను రూపొందించి వెబ్‌లో పొందు పరుస్తారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, వాటి వివరాలు, మురికివాడలు, వాటిలో సమస్యలు, రోడ్ల స్థితి వంటి వాటికి సంబంధించిన వివరాలు సచిత్రంగా వెబ్‌లో చోటు చేసుకుంటాయి. ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా అందే తాజా చిత్రాలు నగరంలో పరిస్థితిని కళ్లకు కట్టిస్తాయి. ఈ సమాచార సాంకేతిక విప్లవ ఫలితం మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తోంది.
రాజమండ్రిలో ఇలా..
జీఐఎస్ విధానంలో రాజమండ్రి నగరాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు 2010లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వ విద్యాలయంలోని జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగం ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు ప్రారంభించి పూర్తి చేశారు. ఇందుకోసం కార్పొరేషన్ రూ.24 లక్షలు వెచ్చించింది. ఇప్పటికే 90 శాతానికి పైగా రూపకల్పన పూర్తవగా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో 2002-2004 మధ్యలోనే జీఐఎస్ ఆధారిత చిత్రాలు సేకరించినా అవి సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే అస్పష్టంగా ఉండి కేవలం నమూనాలుగా మిగిలిపోయాయి. పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణి అనే మున్సిపాలిటీలో 2010లో అత్యాధునిక జీఐఎస్ వ్యవస్థ రూపొందించి సఫలమయ్యారు. కళ్యాణి దేశంలో అతివేగంగా జనాభా విస్తరించిన అర్బన్ ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు రాజమండ్రి మన రాష్ట్రంలో ఈ విధానం అమలులోకి తెస్తున్న తొలి నగర పాలక సంస్థ కానుంది. ఇక్కడ జనాభా 2001తో పోలిస్తే 22 శాతానికి పైగా పెరిగింది. ఈ కొత్త వ్యవస్థ నగరాభివృద్ధికి దోహద పడుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో సమతుల్యత
జీఐఎస్ వ్యవస్థ అమలు చేయడం వల్ల పట్టణాభివృద్ధిలో సమతుల్యత సాధించగలుగుతాం. ఇప్పటికే ఈ వ్యవస్థ ఒక కొలిక్కి వచ్చింది. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది.
- రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్, రాజమండ్రి
జీఐఎస్ అంటే..
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) అనేది శాటిలైట్ సహాయంతో తయారయ్యే సమగ్ర భౌగోళిక సమాచార వ్యవస్థ. పట్టణీకరణ దిశగా పరుగులు పెడుతున్న సమాజానికి కీలకమైన ఆవశ్యకత కూడా. నానాటికీ విస్తరిస్తున్న పట్టణాలు, నగరాలు, వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం కష్టసాధ్యమవుతోంది. జనావాసాల్లో మౌలిక సదుపాయాల స్థితిగతులపై సమగ్ర సమాచారం లేక పౌర సేవలు మెరుగు పడేందుకు ఆటంకం ఎదురవుతోంది. సిబ్బందితో ఈ సమాచార సేకరణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ వ్యవస్థను అందిపుచ్చుకుంటూ నగర ప్రణాళికలు రూపొందించడమే జీఐఎస్ పరమార్థం.
పురపాలనలో శాటి‘లైట్’
Published Sat, Jan 25 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement