నాలుగు మంచిపనులు చేస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. వారికి ఐదేళ్లపాటు బాధ్యతలను అప్పగిస్తారు. తీరా గద్దెనెక్కాక వారు వ్యవహరించే తీరును చూసి విస్తుపోవడం ప్రజల వంతవుతోంది. ఈ వారం రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు నగర చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయూరుు. ఓ వైపు పుష్కరాలు దగ్గర పడుతున్న తరుణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు దృష్టి సారించాల్సింది పోయి, కార్పొరేషన్‌లో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలను తప్పించుకునేందుకు నాటకీయంగా వ్యవహరించడాన్ని నగరవాసులు ఈసడించుకుంటున్నారు.
(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :రాజమండ్రి కార్పొరేషన్ పగ్గాలు నగర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలి. అభివృద్ధి పనులపై వస్తున్న అవినీతి, ఆరోపణలపై చర్చించి... లోటుపాట్లు సవరించాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఉంది. అయితే మెజార్టీ ఉందన్న అహంకారంతో ఏకపక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాజమండ్రి మున్సిపల్ చరిత్రలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చూసి మేధావులు, నగర ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. స్వయంగా అధికార పార్టీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ లేఖ రాయడం గమనార్హం. నగరంలో సెల్ టవర్లు,
వాటి నిర్వహణ, జనన మరణ విభాగంలో అవినీతి, రిలయన్స్ 4జీ విషయంలో రోడ్ల తవ్వకాలకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరు, మేయర్ కార్లకు అయ్యే ఖర్చు, నగర పాలక సంస్థకు ఫర్నీచర్ కొనుగోలులో అవినీతి వంటి మొత్తం 23 అంశాలపై కమిషనర్‌కు ఆయన లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే కౌన్సిల్ చర్చలో ఈ అంశాలను పక్కదారి పట్టించేందుకు పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కార్పొరేటర్లు నాటకీయ పరిణామాలకు పురిగొల్పారు. తమ తప్పు దొరక్కుండా తప్పించుకున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే అధికార పక్షం అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ విషయాన్ని బయటకు తీసుకురాగలిగింది. ఎన్ని చేసినా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం సాధ్యం కాదని అధికారపార్టీ నేతలు గ్రహిస్తే మేలు.
‘పట్టిసీమ’పై చంద్రబాబు మొండిపట్టు
కొంతకాలంగా వివాదాస్పదమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈ వారం మరోసారి చర్చకు వచ్చింది. ఈ పథకం వల్ల గోదావరి సీమ ఎడారిగా మారిపోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీలు ఎంత నిరసన తెలిపినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ అమలు చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు డెల్టా రైతుల పొట్టకొట్టే పట్టిసీమకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ నైజాన్ని బయట పెట్టుకున్నారు. రూ.16 వేల కోట్లతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినా కనీసం నిరసన కూడా తెలపని చంద్రబాబు పట్టిసీమపై పట్టుదలగా ఉండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసి కూడా రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు మొండిగా ముందుకు వెళుతోంది.
అంచనాలకు 20 శాతం ఎక్కువకు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా ఈ పథకం అసలు ఉద్దేశం సొమ్ములు చేసుకోవడమేనని తేటతెల్లం చేశారు. దీనిపై అమీతుమీ తేల్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. అమెరికా నుంచి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల కాకినాడలో సమావేశమై పట్టిసీమ పథకం నిలుపుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్‌తో ఉద్యమించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎత్తిపోతల పథకంపై చేపట్టాల్సిన ఉద్యమంపై గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రు, ఆళ్ల నాని చర్చించారు. త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం రైతులకు ఊరటనిస్తోంది.
రాజా వివాహ వేడుకకు హాజరైన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు వచ్చారు. దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. జక్కంపూడి కుటుంబంపై తమ కుటుంబానికి ఉన్న ఆప్యాయాతానురాగాలను మరోసారి చూపించారు. జక్కంపూడి ఇంట గంటకుపైగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో రెండు మూడువేల ఎకరాలు సరిపోతాయని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కుంటున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా తన వాణిని వినిపిస్తానని చెప్పారు. కాగా వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు రాజా, రాజీ దంపతులను ఆశీర్వదించారు.
జన్మస్థలంలో ‘గానగంధర్వుడు’
గానగంధర్వుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆరేళ్ల తరువాత తన జన్మస్థలమైన శంకరగుప్తం రావడంతో ఆ గ్రామం ఉప్పొంగింది. గ్రామస్తులు చూపించిన ఆదరాభిమానాలకు మంత్రముగ్ధులయ్యారు. మైమరిచిపోయారు. ఆయనతోపాటు వచ్చిన కుమార్తెలు, కోడళ్లు, మనుమలు, మనుమలతో గ్రామంలో తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించి పులకించిపోయారు. గ్రామస్తులు ఆయనకు సత్కరించుకుని పాదపూజ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రబీలో నీటికి కటకట
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ఎడారిగా మారుతుందన్న రైతుల ఆందోళన ముందే నిజమయ్యేలా ఉంది రబీ పరిస్థితి చూస్తుంటే. గోదావరి డెల్టాలో నెలకొన్న నీటి ఎద్దడి ఆయకట్టు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జిల్లాలో డెల్టా కాలువల పరిధిలో సుమారు 3.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. చేలు పాలుపోసుకునే దశకు చేరుకున్న సమయంలో చేలల్లో నీటికి ఎక్కువగా ఉంచుతారు. సరిగ్గా ఇదే సమయంలో నీటి ఎద్దడి రైతులను కలవరపెడుతోంది. నీటి ఎద్దడిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న 4,500 క్యూసెక్కుల నీటికి అదనంగా గత ఆదివారం నుంచి వెయ్యి క్యూసెక్కులు, శుక్రవారం నుంచి మరో వెయ్యి క్యూసెక్కులు కలిపి విడుదలు చేస్తున్నారు.
మొత్తానికి డెల్టాకు నీటి ఎద్దడి తప్పేటట్టు లేదు. గోదావరిలోని, మురుగునీటి కాలువల్లోని వృథా జలాలను పంట కాలువల్లోకి, చేలల్లోకి మళ్లించేందుకు రూ.పది కోట్లు అవసరమవుతాయని అధికారులు సాగు ఆరంభంలోనే ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం సకాలంలో అనుమతి ఇవ్వకపోడంతో ఇప్పుడు సీలేరు నుంచి అదనపు నీటిని తెప్పిస్తున్నా శివారుకు అందడం లేదు. రబీ సాగుకు ఈ 30 రోజులు కీలకమని తెలిసి కూడా అధికారులు ముందుగా మేల్కొనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడికి గురైతే ధాన్యం గింజలు తాలుతప్పలుగా మారిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పట్టిసీమ ఎత్తిపోతలు చేపడితే డెల్టా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
కౌన్సిల్‌లో ‘దేశం’ రచ్చ..రాజమండ్రికి మచ్చ..
Published Sun, Mar 8 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement