సాక్షి, అమరావతి: అదేంటో!! చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోతే... రామోజీకి, ఆయన ‘ఈనాడు’ పత్రిక చూపులు భలే పదునెక్కిపోతాయి. అప్పటిదాకా మూసుకుపోయినా... ఒక్కసారిగా తెరుచుకుంటాయి. పాపం చూపు బాగయితే ఇబ్బందేమీ లేదు!. కానీ... అప్పుడు చూసినవన్నీ అంతకు ముందు లేవనుకోవటంతోనే చిక్కంతా!!. ‘అక్రమ లేఅవుట్లకు రాజకీయ అండ’ అని ఆదివారం నాడు మొదటి పేజీలో వండేసి అచ్చోసిన కథనం కూడా ఇలాంటిదే. పోనీ ఆ అంకెలైనా సరిగా వేశారా అంటే... అవీ తప్పులే. మన ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనుకునే దుర్మార్గపు రాతలకు పరాకాష్ట ఆ అంకెలు. ‘ఈనాడు’ మరీ దిగజారిపోయి రాసిన ఈ రాతల్లో ఏ కొంచెమైనా నిజముందా? అసలేది నిజం? ఒకసారి చూద్దాం.
చంద్రబాబు నాయుడి హయాంలో విచ్చలవిడిగా వెలసిన అక్రమ లే అవుట్లతో కలిపి... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనుమతుల్లేని లేఅవుట్ల సంఖ్య సాక్షాత్తూ 10,160. వీటిలో 3,551 వరకూ గ్రామాల్లో ఉండగా... మిగిలినవి అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం లే అవుట్లు 37,684 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని... వీటిలో దాదాపు 2.54 లక్షల ప్లాట్లున్నాయని ఇటీవల ప్రభుత్వాధికారులే ఓ నివేదికను తయారు చేశారు. అక్రమ లే అవుట్లకు మంచినీరు, కరెంటు వంటి సదుపాయాలుండవు కాబట్టి... అక్కడి ప్లాట్ల యజమానులకు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేస్తే బాగుంటుందనే అంశాన్ని ఇటీవల మంత్రుల బృందం సమగ్రంగా చర్చించింది. అధికారుల నివేదిక మొత్తాన్ని పరిశీలించింది.
మరి ఇదే నివేదికలోని అంశాలను ‘ఈనాడు’ తప్పులెందుకు రాసింది? మొత్తం లే అవుట్ల సంఖ్యను 10వేలకు బదులు 13,711గా... 37వేల ఎకరాలకు బదులు 47వేల ఎకరాలుగా ఎందుకు రాసింది? ఎందుకంటే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు కాబట్టి ఎంత బురదయినా చల్లొచ్చనేది దాని సిద్ధాంతం. ఇంకో చిత్రమేంటంటే... ఈ లే అవుట్లన్నీ ఇప్పుడే వెలసినట్లు... వాటన్నిటినీ అధికార పార్టీకి చెందిన నాయకులు కాపాడుతున్నట్లు ఇష్టం వచ్చినట్లు రాసి పారేసింది. ఈ అక్రమ లే అవుట్లపై కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారని, వీటివల్ల పంచాయితీలు, నగరాభివృద్ధి సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని కూడా శోకాలు పెట్టింది.
చంద్రబాబు నివేదికను ప్రస్తావించరేం?
నిజానికి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక అక్రమ లే అవుట్లు ఇష్టానుసారం వెలిశాయి. పెద్ద సంఖ్యలో నేతల అండతో అనుమతుల్లేని లే అవుట్లు పుట్టుకొచ్చాయి. దీనిపై 2015లో అప్పటి అధికారులు నాటి సీఎం చంద్రబాబునాయుడికి నివేదిక ఇస్తూ... రాష్ట్రంలో అప్పటికి 6,049 అక్రమ లే అవుట్లున్నాయని పేర్కొన్నారు. వాటిపై చర్యలు తీసుకోకుంటే కొనుగోలుదారులు నష్టపోతారని కూడా తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఆ తరవాతైనా అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట పడిందా అంటే... దాదాపు శూన్యం. దీంతో 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ సంఖ్య ఏకంగా 9.422 వరకూ చేరింది. పాపం రామోజీకి, ‘ఈనాడు’కు అప్పట్లో చూపు మందగించి ఇవేవీ కనిపించలేదు. వీటిపై వార్తలు వస్తే ఒట్టు!!.
మంత్రుల బృందం చర్యలు...
కొత్తగా వచ్చే లే అవుట్లకు రోడ్డు, కరెంటు, మంచినీరు వంటి వసతుల కల్పన అంశంలో గ్రామ పంచాయతీల నుంచి ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కొద్దినెలల క్రితం గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను జల్లెడపట్టే ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం గ్రామాల వారీగా ఆయా మండల ఈఓపీఆర్‌డీ, సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఓ జూనియర్ అసిస్టెంట్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లేఅవుట్లు అనుమతులు లేనివేనని పంచాయతీరాజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది.
ఈ అక్రమ లేఅవుట్లలో మొత్తం 2,54,854 ప్లాట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ప్లాట్లు చాలావరకూ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయన్నది అధికారుల మాట. ఈ 10,169 అక్రమ లే అవుట్లలో 4,179 లేఅవుట్లకు రోడ్డు వసతి ఉండగా, 362 లేఅవుట్లకే మంచినీటి సరఫరా వసతి ఉంది. 814 లేఅవుట్లకు మాత్రమే కరెంటు లైను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ లే అవుట్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలి? వీటిని నియంత్రించటంతో పాటు ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాన్ని పెద్దిరెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ చర్చించింది కూడా. త్వరలో వీరు సీఎంకు నివేదించాక తదుపరి చర్యలేంటన్నది తెలిసే అవకాశముంది.
కాకపోతే ‘ఈనాడు’ మాత్రం ఈ వాస్తవాలన్నిటికీ ముసుగేసి... ఇవన్నీ ఇప్పుడే వెలసినట్లు... అధికార పార్టీ అండదండలతో పెరిగిపోతున్నట్లు పాఠకులను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయటాన్ని ఏమనుకోవాలి? ఇది ఏ మార్కు జర్నలిజం
రామోజీ?
లేఅవుట్లపై ‘అక్రమ’ రాతలు!! ‘ఈనాడు’ మార్కు రాతలకు పరాకాష్ట
Published Mon, Jan 24 2022 3:24 AM | Last Updated on Mon, Jan 24 2022 4:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment