
జేబులు నింపినఎన్నికలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ‘కాసుల’ వర్షం కురిపించాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 584 ఎం పీటీసీ, 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల నిర్వహణకోసం ఒక్కో మండలానికి పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షలు విడుదల కాగా, ఇందులో నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాహన వినియోగానికి ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఇది కొందరు ఎంపీడీవోలకు వరంగా మారింది.
ఎన్నికల విధుల నిమిత్తం వచ్చిన అధికారులతో పాటు జిల్లాలోని కొందరి ఎంపీడీవోల కన్ను ఈ నిధులపై పడింది. ఇంకేముంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంజూరైన నిధులతో పాటు మండల పరిషత్ ఖజానాకు చిల్లు పెట్టారు. అటు ఎన్నికల నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి నెలకు రూ.24 వేల చొప్పున మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బిల్లులు లేపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాకు వచ్చిన ఎంపీడీవోల్లో కొందరితో పాటు జిల్లాలోనే పనిచేసే మరికొందరు రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా బయటపడిన అక్రమ బాగోతం పంచాయతీరాజ్ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 36 మండలాలుంటే, 1768 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 16 వేల నుంచి రూ.19 వేల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ లెక్కన ఒక్కో మండలానికి రూ.4.98 లక్షల నుంచి రూ.14.99 లక్షల వరకు నిధులు విడుదల కాగా, జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూ.2.92 కోట్ల వరకు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యల్పంగా కమ్మర్‌పల్లికి రూ.4,97,640 విడుదల కాగా, అత్యధికంగా రూ.14,99,180 ఎన్నికల నిర్వహణ నిధులు విడుదలయ్యాయి.
మొత్తంగా 36 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.2.92 కోట్లు మం జూరయ్యాయి. అయితే ఈ నిధుల నుంచి అత్యధికంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వాహన వినియోగంపై ఖర్చు చూపిన కొందరు ఎంపీడీవోలు మండల పరిషత్‌ల నిధుల నుంచి ఒక్కో మండలంలో రూ.65 వేల నుంచి రూ.72 వేల వరకు నిధులను వాహనాల పేరిట డ్రా చేశారు. ఈ వ్యవహారంపై ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బంది ద్వారానే బయటపడటం కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం విడుదలైన నిధులతో పాటు మండల పరిషత్ నిధుల నుంచి భారీగా స్వాహా చేసిన కొందరు ఎంపీడీల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది.
ఇంటలిజెన్స్ ఆరా..
వాహనాల వినియోగం పేరిట నిధుల స్వాహా కలకలం రేపుతుండగా.. ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగడం పంచాయతీరాజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం కమ్మర్‌పల్లి, నాగిరెడ్డిపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, జక్రాన్‌పల్లి మండలాలకు రూ.4.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు విడుదల కాగా, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, డిచ్‌పల్లి, నం ది పేట, నిజాంసాగర్‌లకు రూ.10 లక్షల నుంచి రూ.14.99 లక్షలు వచ్చాయి. మిగతా మండలాలకు రూ.5.50 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఎన్నికల నిధులు వచ్చాయి.
అయితే ఈ ఎన్నికల నిధులకు తోడు మండల పరిషత్ నిధులను కాజేసిన అధికారుల వివరాలను ఆరా తీసేందుకు తాజాగా ఇంటలిజెన్స్ రంగంలోకి దిగి కలకలం రేపుతోంది. మండల పరిషత్‌ల సాధారణ నిధి నుంచి వాహన వినియోగం కోసం డ్రా చేస్తే తప్పకుండా లాగ్‌బుక్ నిర్వహించాలి. ఏ వాహనాన్ని వినియోగించారు, ఏయే రోజు ఎక్కడికి, ఎంత దూరం వెళ్లారు, ఎంత చమురు ఖర్చయ్యిం ది, ఆ నెలలో ఖర్చయిన మొత్తం, ఆ వాహనానికి సంబంధించిన వివరా లు సమర్పించాల్సి ఉంది. అయితే కనీసం లాగ్ బుక్‌లు లేకుండా వాహన వినియోగం నిధులు భారీగా లాగించేసిన కొందరు అక్రమార్క ఎంపీడీవోలపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తుస్తోంది. త్వరలోనే నిందితుల బండారం బట్టబయలు కానుంది.