సాక్షి, అమరావతి: దేశమంతా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసమే కొత్తగా వలంటీర్ల వ్యవస్థను తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. విజయవాడలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వలంటీర్లు హాజరు కాగా మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద దీన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3,648 కి.మీల దూరం సాగిన తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయని వారు కూడా ఐదేళ్లలో తాము చేసే మంచి పనులను చూసి వచ్చే దఫా తమకే ఓటు వేసేలా వారి మనసు కరగాలన్నది తమ లక్ష్యమన్నారు.
ఈ ఏడాదే 80 శాతం హామీల అమలు...
నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు. ప్రతి వలంటీర్ వద్ద మేనిఫెస్టో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని 80 శాతం పైచిలుకు హామీలను ఈ సంవత్సరమే అమలులోకి తెస్తామని, వచ్చే ఏడాది మిగిలిన 20% అమలులోకి తెస్తామని జగన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే...
వలంటీర్లంటే ...
‘‘వలంటీరు అంటే మూడు పదాల్లో.. లబ్ధిదారుల గుర్తింపు, డోర్ డెలివరీ, 50 ఇళ్లకు తోడుగా ఉండడం. వలంటీర్లు చేయాల్సిన బాధ్యతలన్నీ ఈ మూడు పదాలలోనే కలసి పోతాయి. ఈ ప్రక్రియలో వలంటీర్లు గ్రామ సచివాలయం, కలెక్టర్లతో అనుసంధానం అవుతారు. ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడం, లబ్ధిదారులను గుర్తించడం రెండు కళ్లు లాంటివి అయితే మూడోది 50 ఇళ్లకు లీడర్‌షిప్ తీసుకోవడం. ఆ 50 ఇళ్లకు ఏ పనైనా వలంటీర్లే దరఖాస్తు చేయించాలి. వచ్చేలా చేయాలి. ఆ తర్వాత కార్డు కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి. అప్పుడే వలంటీరుగా తన బాధ్యత నెరవేర్చినట్లు అవుతుంది. వలంటీర్ల వ్యవస్థలో అవినీతి అనేది ఉండకూడదు. పనిచేసే వారికి ఆ ఆలోచన, ఆ తలంపు కూడా రాకూడదనే ప్రతి ఒక్కరికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నాం. తమకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించే వలంటీర్లను లీడర్లుగా చేస్తాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా పారదర్శకత, చిరునవ్వుతో అందరికీ సహాయం చేస్తే 50 ఇళ్లకు మీరు చేసే మంచితో వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు.
3 నెలల్లో లక్షల ఉద్యోగాలిచ్చిన చరిత్ర..
అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా తిరగక మునుపే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా లేదు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ద్వారా దాదాపు 1.40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 2.80 లక్షల మందిని వలంటీర్లుగా నియమించాం. దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చాం.
ప్రతి నెలా కచ్చితంగా ఒక కార్యక్రమం..
చాలా పథకాల అమలుకు వలంటీర్ల నియామకం కోసం వేచి చూస్తున్నాం. ఇక మీరొచ్చారు కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. గ్రామ సచివాలయాలు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరం మనం చేయబోయే పెద్ద కార్యక్రమాలు రైతు భరోసా, అమ్మ ఒడి. మరొకటి రాబోయే ఉగాది నాటికల్లా రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదవాడు ఎవరూ ఉండకూడదు. పింఛన్‌ను మేం వచ్చిన వెంటనే రూ.2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళుతున్నాం. అన్నీ బాగుంటే సెప్టెంబరు నుంచే అటో డ్రైవర్లు, సొంతంగా టాక్సీ కలిగిన వారికి సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా మొదలవుతుంది. నవంబరు నాటికి మరికొన్ని పథకాలున్నాయి. చేనేతలకు సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తామని చెప్పాం. షాపులున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.పది వేల చొప్పున సాయం చేస్తామని చెప్పాం. ఈ లబ్ధిదారులను గుర్తించే బాధ్యత వలంటీర్లదే. ఇలా నెలకొక కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి..
వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుంది. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి అందచేస్తాం. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్నిస్తే ఓపిగ్గా సమాధానం చెప్పాలి..
ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే వలంటీర్లకు అన్ని కార్యక్రమాలపై అవగాహన ఉండాలి. ఏ పథకంపై ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఆ అవగాహన రావాలంటే నేను ఏం మాట్లాడుతున్నానో వింటూ ఉండాలి. మనం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే కొంచెం ఓపిగ్గా సమాధానం చెప్పాలి. మనం ప్రతి పథకాన్ని ప్రారంభిస్తూనే ఉన్నాం. వలంటీర్లకు ఎదురయ్యే ప్రశ్నలను గుర్తించి సావధానంగా ఎలా వివరించాలో తెలియచేసేందుకు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం’’
‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’
‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’
‘రాష్ట్ర ప్రజలందరికీ భరోసా నింపేందుకు నా దగ్గర మొదలైన ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అన్న స్వరం మీది (వలంటీర్లు) కూడా కావాలి’ – వలంటీర్ల వ్యవస్థ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్
ఏ ముఖ్యమంత్రీ చేయలేరు: మంత్రి పెద్దిరెడ్డి
వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన దేశ చరిత్రలోనే అద్వితీయ ఘట్టమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మరే రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదని, మళ్లీ అలాంటిది జరిగితే జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా మరే సీఎం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరన్నారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు, గిరిజా శంకర్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు వలంటీర్ల కరదీపికను సీఎం ఆవిష్కరించారు. కొందరు వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు.
ప్రతి ఇంట్లో సీఎం ఫొటో...
అందరికీ మేలు చేయాలన్న తలంపుతో పనిచేస్తున్న యువ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ప్రతి కుటుంబం తమ ఇంట్లో, మనసులో భద్రంగా దాచుకుంటుంది. –ఆరేపల్లి ప్రతాప్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment