పల్లెలకు పచ్చని శోభ | Greenery to the villages | Sakshi
Sakshi News home page

పల్లెలకు పచ్చని శోభ

Published Thu, Feb 28 2019 3:15 AM | Last Updated on Thu, Feb 28 2019 3:15 AM

Greenery to the villages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళికను విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన గ్రామసర్పంచ్‌లంతా సమగ్ర కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

సీఎం ఆదేశాలు.. 
గ్రామపంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్‌ కొన్ని ఆదేశాలిచ్చారు. వీటిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ, జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మెమో జారీచేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు చేపట్టడంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి ద్వారా రెగ్యులర్‌గా వీధులు, కాల్వలు శుభ్రం చేయడానికి పంచాయతీ కార్యదర్శి వెంటనే కార్యకలాపాల పట్టిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతో పాటు ఈఓపీఆర్‌డీ, ఎంపీడీవోలు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించింది. 

100 శాతం పన్నుల వసూలు.. 
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కల్పనకు 3 నెలల పాటు వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 100 శాతం పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రతి గ్రామసర్పంచ్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నెలకు కనీసం ఒకసారి శ్రమదానం నిర్వహించి, ఇందులో గ్రామస్తులు కొన్ని గంటల పాటు పాల్గొనేలా కార్యక్రమాలు చేపట్టాలి. 

చేపట్టాల్సిన కార్యక్రమాలు.. 
- ప్రతి గ్రామంలో కనీసం ఒక కంపోస్ట్‌ యార్డ్‌ ఏర్పాటు చేసి, చెత్తంతా తీసుకొచ్చి కంపోస్ట్‌గా మార్చాలి. 
-  గ్రామాల్లోని ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను విడివిడిగా పెట్టేందుకు వీలుగా గ్రామపంచాయతీ నిధులతో డబ్డాలు సరఫరా చేయాలి. 
-  ఉపయోగించని, పనికి రాకుండా పోయిన అన్ని బోర్‌వెల్స్‌ను, ఓపెన్‌ వెల్స్‌ మూసేయాలి. 
- ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం (శ్మశానం)ఏర్పాటు కోసం తగిన స్థలం ఎంపికచేయాలి. పంచాయతీ భూములను మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్‌ కేటాయిస్తారు. ఇవేమి అందుబాటులో లేనపుడు గరిష్టంగా రూ.5 లక్షల వరకు గ్రామపంచాయతీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధి, తదితరాల నుంచి కేటాయించవచ్చు. 
- ఉపాధి హామీ నిధులతో శ్మశానాల నిర్మా ణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి.  

పట్టణాల్లో మాదిరిగా కనీస సౌకర్యాలు.. 
నగరాలు, పట్టణాల్లో మాదిరిగా పంచాయతీల్లోనూ పారిశుధ్యం, వీధి దీపాలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ విధులు, బాధ్యతలు, అధికారాలు, చట్టంలో పొందుపరిచిన ఆయా అంశాల గురించి పూర్తిస్థాయి అవగాహన సాధించేందుకు జిల్లా స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement