సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు.
మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు
రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు.
ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు..
రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు.
ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు!
అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్‌ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.
పోలింగ్‌కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
Published Wed, Mar 24 2021 3:46 AM | Last Updated on Wed, Mar 24 2021 7:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment