సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి సర్కారు మాట మార్చింది. కేవలం కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకే అవకాశం కల్పించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా ఓ మెమోను జారీ చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి స్పష్టం చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం డిగ్రీలో ఉత్తీర్ణత మార్కుల శాతం అధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని, ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ కల్పిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 5,400 మంది నిరుద్యోగులు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు పరిశీలించి మెరిట్ జాబితా రూపకల్పనలో తలమునకలైన జిల్లా యంత్రాంగం గత వారం ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా విడుదల చేసింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 100 మంది కార్యదర్శులు ఎంపిక కాగా.. మరో 20 మంది కొత్తవాళ్లు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులు మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. అయితే సర్కారు తాజా ఉత్తర్వులతో పరిశీలన ప్రక్రియ తలకిందులైంది. పరిశీలన ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడింది.
తాజా ఉత్తర్వుల్లో...
ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో.. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారినే ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో కొత్తగా ఎంపికైన 20 మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కొత్త నిబంధనలతో వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. గత వారం విడుదల చేసిన ఎంపిక జాబితాలో వారి పేర్లు ఉండడంతో ఉద్యోగం గ్యారంటీ అని భావించిన వారికి.. తాజా ఉత్తర్వులు మెండిచెయ్యిని చూపినట్లైంది. ఇదిలా ఉండగా.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలనడంతో వేల మంది అభ్యర్థులు స్వతం ఖర్చులతో జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాట మార్చడంతో వారి జేబుకు చిల్లు పడడం తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది.