పంచాయతీరాజ్‌శాఖలో ఏళ్ల తరబడి కమీషన్‌ల దందా కొనసాగుతోంది. ఈ శాఖ ద్వారా ఏ పని మంజూరు అవ్వాలన్నా,
విజయనగరంఫోర్ట్: పంచాయతీరాజ్‌శాఖలో ఏళ్ల తరబడి కమీషన్‌ల దందా కొనసాగుతోంది. ఈ శాఖ ద్వారా ఏ పని మంజూరు అవ్వాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా చేయి తడపాల్సిందే. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటే 10శాతం కమీషన్ ఇస్తేగానీ పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బిల్లులు చెల్లించరు. కాంట్రాక్టర్ల వద్ద అదేతీరు, ప్రజాప్రతినిధుల వద్ద అదేతీరు. కమీషన్ ఇవ్వకపోతే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అయినా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు బిల్లులు చెల్లించరు. ఎస్‌ఈలు దగ్గరనుంచి ఏఈల వరకు ఒకటే తీరు. కమీషన్ల దందా ఏళ్ల తరబడి కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరూ దొరకకపోవడంతో దొరల్లా చలామణి అయ్యారు.
పంచాయతీరాజ్‌శాఖలో ఏళ్లతరబడి జరుగుతున్న అవినీతి ఎట్టకేలకు బయట పడడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ఏసీబీ అధికారులు పంచాయతీరాజ్ శాఖ డీఈ లక్ష్మణరావును జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పట్టుకుని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి తీసుకు రావడంతో ఈఈ కార్యాలయం సిబ్బంది ఎక్కడి ఫైళ్లు అక్కడే వదిలేసి చెల్లాచెదురైపోయారు. ఏసీబీ అధికారులు ఉన్నంత సేపు ఆ ఛాయలకు సిబ్బంది ఎవరూ రాలేదు. మరి ఇకనైనా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అవినీతికి దూరంగా ఉంటారా? లేదంటే కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి.
వరుస ఏసీబీ దాడులు..వదలని అవినీతి జాడ్యం
ఒక వైపు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతున్నా..మరో వైపు లంచావతారులు మాత్రం తమ పని తాము చేసుకు పోతున్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో 12 కేసుల్లో అవినీతి అధికారులు పట్టుబడ్డారు.