జేసీ–2 నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు (ఇన్‌సెట్లో) జేసీ–2 నాగేశ్వరరావు
ఆయనో ఉన్నతాధికారి. ఆయనకు ఉద్యోగులంటే ఎంతో అభిమానం. అందరితో నూ సౌమ్యంగా మెలిగేవారు. పరిపాలనా పరంగా మంచి అధికారిగానే గుర్తింపు ఉంది. వృత్తి రీత్యా ఎంతో అనుభవం కలిగి ఉండటం అదనపు ప్రత్యేకత. ఇదీ ఇప్పటివరకూ జిల్లా జేసీ–2 నాగేశ్వరరావుపై జిల్లా యంత్రాంగానికి ఉన్న అభిప్రాయం. కానీ బుధవారం ఏసీబీ తనిఖీలతో వారంతా విస్తుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కోవడంతో అంతా కలవరపడ్డారు. శాఖలో ఎక్కడా దీనిపైనే చర్చ. ఈ సంఘటన మిగిలిన అధికారుల్లోనూ గుబులు రేగేలా చేసింది.
విజయనగరం గంటస్తంభం : జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో మంచి అధికారిగా గుర్తింపు పొందినా తాజాగా వెలుగు చూసిన కొత్త కోణం ఆయన ప్రతిష్ట దిగజారడానికి కారణమయింందని చెప్పక తప్పదు. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లా అధికారుల్లో గుబులురేగుతోంది. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు కనుగొన్నా... మార్కెట్‌లో వాటి విలువ రూ. 20కోట్లకు పైగానే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి జిల్లా కలెక్టర్, జేసీ తర్వాత మూడోస్థానం జేసీ–2దే. అభివృద్ధి, సంక్షేమ పథకాల జేసీగా గుర్తింపు పొందిన ఈ పోస్టులోకి కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు. అంతకుముందు పని చేసిన యు.జి.సి నాగేశ్వరరావు బదిలీ కావడంతో విధుల్లోకి చేరిన తక్కువ కాలంలోనే ఈయన మంచి అధికారిగా గుర్తింపు పొందారు. పోస్టు పరంగా అధిక శాఖల కార్యకలాపాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఐదారుశాఖలు మినహా అన్నిశాఖలు ఫైళ్లు తప్పనిసరిగా ఈయన వద్దకే వెళ్లాలి. జిల్లాలో జేసీ–2గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు.
కలెక్టర్ దృష్టిని ఆకర్షించిన పనితీరు
జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ, సమీక్షలు చేస్తుండటంతో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు అత్యంత నమ్మకమైన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో సంయుక్త కలెక్టర్‌గా ఉన్న శ్రీకేష్ లఠ్కర్ పాలనాపరంగా కొంత అంటీ ముట్టనట్టు ఉండటం, తన పరిధిలో పనిపై మాత్రమే ఆయన దృష్టిసారించడంతో అంతగా గుర్తింపు పొందలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కలెక్టర్ తాను స్వయంగా చూడలేని పనులు, చేయలేని సమీక్షలు జేసీ–2 నాగేశ్వరరావు ద్వారా చేయించుకునే వారు. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడంతో ఇతర అధికారుల వద్ద, ప్రజల్లో గుర్తింపు, గౌరవం పొందారు. మరోవైపు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. కోపం వస్తే మాటలు విసిరినా పాలనపరంగా అధికారులు, సిబ్బందికి హాని చేయకపోవడం, కష్టసుఖాలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో మంచి అధికారిగానే అన్ని వర్గాల్లో గుర్తింపు పొందారు.
ఆరోపణలు మరోకోణం
జిల్లాలో ఆయన బాధ్యతలు స్వీకరించి కేవలం 10నెలలు కావడంతో ఆయనపై పెద్దగా విమర్శలు, అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇళ్లల్లో సోదాలు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి రావడంతో ఆయనలో అవినీతి కోణంపై చర్చ మొదలైంది. ఆయన అవినీతి జిల్లాలో ఏ మేరకు ఉంది? ఇతర జిల్లాలో పని చేసినపుడు పరిస్థితేమిటన్న ఆరా అందరూ తీస్తున్నారు. వాస్తవానికి మంచి అధికారిగా గుర్తింపు ఉన్నా అవినీతిపరంగా మరోకోణం ఉందనే చెప్పాలి. జిల్లాలో బహిరంగంగా ఆరోపణలు వచ్చినంత అవినీతి చేయకపోయినా పని చేసి డబ్బులు తీసుకుంటారన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఏసీబీ దాడులు నేపథ్యంలో ఇది నిజమే కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈయన పని చేసిన చోట కూడా ఆయనపై ఆరోపణలున్నాయన్న చర్చ జరుగుతోంది.
అధికారుల్లో గుబులు
కలెక్టర్ తర్వాత స్థానంలో ఉన్న అధికారి ఏసీబీ కేసులోఓ్ల చిక్కడంతో జిల్లా అధికారుల్లో గుబులు మొదలైంది. అధికారులు పెద్ద తలకాయలను టార్గెట్ చేయడంతో అవినీతికి పాల్పడే అధికారుల్లో ఆందోళన మొదలైంది. మరో ముగ్గురు జిల్లా అధికారులు ఏసీబీ లిస్టులో ఉన్నారన్న ప్రచారం ఉండడంతో వారెవరన్న చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా జేసీ–2 బంగ్లాలో ఏసీబీ సోదాలు జరగడంతో ఇతర అధికారులు చాలా మంది కార్యాలయాలకు రాలేదు. కలెక్టరేట్‌లో దాదాపు సగం మంది అధికారులు బుధవారం ఉదయం కార్యాలయంలో లేకపోవడం విశేషం.
డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ...
ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. తహసీల్దారుగా మేరుడుబిల్లి, పెద్దాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాకినాడలో పనిచేశారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు. మే నెలలో పదవీవిరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు.
గుర్తించిన ఆస్తులివే...
రాష్ట్రంలోని పదిచోట్ల బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరంలో ఏసీబీ డీఎస్పీ షకీలాభాను ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇళ్లు, బ్యాంకు లాకర్లలో 705 గ్రాముల బంగారం, 5567.50 గ్రాముల వెండి వస్తువులు, రూ.19,91,186ల బ్యాంకు బ్యాలెన్సు, రూ.12,75,000ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు,
రూ.10,72,250ల విలువైన గృహోపకరణాలు గుర్తించారు.
విశాఖ పెదవాల్తేరులో రామకృష్ణరాజు పేరుమీద విజయనగర ప్యాలెస్ లేఅవుట్‌లో ఫ్లాట్, రమణమూర్తిరాజు పేరుతో 514ఫ్లాట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎఫ్‌డబ్లూడీ బీఎస్‌ఐవీ మోటార్ కారు, విశాఖలోని ఆనందపురంలో 774.5 గజాల ఖాళీ స్ధలం, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల ఇంటి స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో 10.32ఎకరాల వ్యవసాయ భూమి, మరోచోట 52 సెంట్లు, 15 సెంట్లు, 56 సెంట్ల వ్యవసాయ భూమి గుర్తించారు.- పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 14 సెంట్లకుపైగా ఖాళీ స్థలం, విశాఖలోని రేసపువానిపాలెంలో కుమారుడు కాకర్ల రాజేష్ చంద్ర పేరుతో కృష్ణసాయి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్, కాకినాడలోని సూర్యాపేట, శశికాంత్ నగర్‌లో 1250 చదరపు అడుగుల స్లాబ్ ఇల్లు, విశాఖలోని ఎండాడలో ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి లేఅవుట్‌లో తల్లి కాకర్ల ధనలక్ష్మి పేరుతో 633 చదరపు గజాల స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి, విశాఖ మధురవాడలో 389 చదరపు గజాల ఖాళీ స్ధలం, అక్కడకు సమీపంలో 231 చదరపు గజాల స్ధలం, పశ్చిమగోదావరి జిల్లా అమలాపురంలో 484 చదరపు గజాల ఇంటిని గుర్తించారు.
విశాఖలోనూ...
విశాఖ క్రైం : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయనగరం జాయింట్ కలెక్టర్ – 2 నాగేశ్వరరావు బంధువులకు చెందిన విశాఖలోని ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదా లు నిర్వహించారు. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖలో ఆరుచోట్ల, బెంగుళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది పెదవాల్తే రు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు.
పదవీ విరమణకు నెల రోజుల ముందే...
నాగేశ్వరరావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అతని తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగరం జిల్లా ఎస్.కోటలో స్థిరపడ్డారు. 1990లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ప్రస్తుతం విజ యనగరం జేసీ–2గా చేస్తున్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment