Revenue Departments Staff
-
చెవి కొరికి..చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు
సాక్షి, కర్నూలు రూరల్: గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ నమోదు చేసే బాధ్యతను తహసీల్దార్ తిరుపతి సాయి అప్పగించారు. తహసీల్దార్ డిజిటల్ కీని సైతం జూలై నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్లో పేర్లు మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. ప్రతీ ఆన్లైన్ మార్పు, చేర్పునకు ఆ గ్రామంలో భూమికి ఉన్న ధరను బట్టి ఎకరానికి రేటు నిర్ణయించి తీసుకునేవాడని రైతులు చెబుతున్నారు. జొహరాపురానికి చెందిన మహేశ్వరయ్య పేరు ఆన్లైన్లో మహేశ్వరమ్మ అని పడింది. అలాడే అదే గ్రామానికి చెందిన పాండురంగస్వామి ఇంటి పేరు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఈ రెండింటిని మార్చాలని జొహరాపురం వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు ఫైల్ పెట్టాడు. రెండు వారాలైనా పనికాకపోవడంతో ఆదివారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డిని శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా నిలదీశాడు. మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. దీంతో చెవి నుంచి విపరీతంగా రక్త్రస్తావమైంది. ఇద్దరూ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో వెంటనే తహసీల్దార్ తిరుపతి సాయి కలుగజేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో రాజీ కుదిర్చడానికి ప్రయత్నించాడు. మరోసారి ఇద్దరు వీఆర్వోలు రెచ్చిపోయి సాక్షాత్తూ తహసీల్దార్ ముందే ఒకరినొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. మరో సారి వేణుగోపాల్‌రెడ్డికి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు.. రైతుల నుంచి ఆన్లైన్ ఎక్కించడానికి రూ.లక్షలు తీసుకున్నాడని, తనకు చిల్లిగవ్వ ఇవ్వడంలేదన్న భావన వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి నుంచి వ్యక్తం అయింది. ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్ – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు వీఆర్వోలపై జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వేటు వేశారు. జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయులు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. కార్యాలయాల బయట, లోపల ప్రజలకు అనుకువగా ఉండి గౌరవ మర్యాదలను పొందాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉండాల్సింది పోయి గొడవలు పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో మరెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసుతో రెవెన్యూ యంత్రాంగంపై అందరి దృష్టి పడింది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోతానేమోనన్న భయంతోనే విజయారెడ్డిని హత్యచేసినట్టు సురేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా పనులు చేయకుండా రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. (చదవండి : అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం) లంచం లేనిదే రెవెన్యూశాఖలో ఫైలు కదలదన్న తీరుగా పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండేళ్లలో 207 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కితే వారిలో 50 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఇక ఎవరికీ దొరకని అవినీతి అధికారులు నేటికీ దొరలుగానే చలామణి అవుతున్నారు..! (చదవండి : విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి) అవినీతి రెవెన్యూ అధికారుల్లో కొందరు.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య , వీఆర్వో అనంతయ్య రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ రవిరాజా కుమార్‌రావు,వీఆర్ఏ రామకృష్ణ రూ. లక్షా 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ జిల్లా మద్దివంచ వీఆర్వో సీరం శివరావు రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్దీఓ చంద్రా రెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మంచిర్యాల ఆర్డీవో గూడెం మనోహర్‌రావు రూ.42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా సుద్దాల వీఆర్వో శ్రీనివాస్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిజామాబాద్ ఆర్మూర్ ఆర్దీఓ శ్రీనివాస్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతిజిల్లా సర్వేయర్ రవి కుమార్ అవినీతి అధికారుల చిట్టా కోసం క్లిక్ చేయడం : -
తహసీల్దార్లు కావలెను
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రెవెన్యూ సిబ్బందిపై పనిభారం పెరగగా...పనులు సకాలంలో జరగక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి తహసీల్దార్లను జిల్లాకు ఎప్పుడు కేటాయింపు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. పరిపాలనాధికారి పోస్టులే ఖాళీ ప్రస్తుతం జిల్లాలోని 17 తహసీల్దార్లు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా.. అందులో నాలుగు డివిజన్లలో పరిపాలనాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టరేట్లో రెండు విభాగాలకు సంబంధించి సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్ పోస్టుల ఖాళీలు ఇలా... రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో డివిజన్ పరిపాలనాధికారులుగా (డీఏఓ) తహసీల్దార్లు ఉంటారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ మినహా అనంతపురం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కలెక్టరేట్లో విభాగాల సూపరింటెండెంట్లుగా తహసీల్దార్లు ఉంటారు. హెచ్–సెక్షన్ , ఈ–సెక్షన్లకు సూపరింటెండెంట్లు లేరు. దీంతో ఈ స్థానాల్లో డిప్యూటీ తహసీల్దార్లను నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. మండలాల విషయానికి పెద్దపప్పూరు, వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, బ్రహ్మసముద్రం, ఆడమడగూరు, నల్లచెరువు, నల్లమాడ, తలపుల, తాడిపత్రి, ఓడీచెరువు తదితర 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలాల్లో ఇన్చార్జిల పాలన ప్రభుత్వపరంగా అమలయ్యే కార్యక్రమాల్లో చాలా వరకు రెవెన్యూశాఖ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన శాఖలో తహసీల్దార్ల కొరత కారణంగా కొన్ని మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆయా మండలాల్లో సమర్థవంతమైన పాలన సాగడం లేదనే అభిప్రాయాలు రెవెన్యూ శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రెవెన్యూకు సంబంధించిన పనులు కూడా సకాలంలో జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దారు స్థానాల ఖాళీలు ఇలా... ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టుల ఖాళీలు - 4 కలెక్టరేట్లో సూపరింటెండెంట్ పోస్టుల ఖాళీలు - 2 మండలాల్లో తహసీల్దారు పోస్టుల ఖాళీలు - 11 -
రెవెన్యూ ప్రక్షాళన!
భూ రికార్డుల ప్రక్షాళన నుంచి రెవెన్యూ సేవలు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. పట్టా మార్పిడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్రమంగా ఇతరులకు పట్టాలు చేయడం, కబ్జాదారులకు సిబ్బంది పరోక్షంగా సహకరిస్తుండడం, తప్పుడు సర్వే నంబర్లు నమోదు తదితర ఆరోపణలు కోకొల్లలు. పైగా తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, సాధారణ ప్రజలు నిత్యం పనులు మానుకొని తహసీల్దార్ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. పాస్‌పుస్తకాల కోసం తిప్పించుకోవడం, రికార్డుల్లో తప్పులు సరిదిద్దడంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు, అధికారులు ఆమ్యామ్యాలు సమర్పించుకున్నా పనుల్లో పురోగతి లేదు. ఓపిక నశించిన కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలూ జిల్లాలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా చాలా మంది అధికారులపై డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణించిన యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన వారిని బదిలీ చేస్తోంది. ఈ చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు జిల్లా రెవెన్యూశాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణలు, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు పడుతోంది. కేడర్ వారీగా ఉద్యోగులకు స్థాన చలనం కల్పిస్తున్నారు. మూడురోజుల కిందట గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ)ను మూకుమ్మడిగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లను మార్చింది. 13 మందిని బదిలీ చేసి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. భూ వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందిన కాడికి వెనకేసుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అర్హులకు పదోన్నతులు.. ఒక పక్క బదిలీలు చేస్తున్న యంత్రాంగం.. మరోపక్క అర్హులకు పదోన్నతులు కల్పిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన 32 మంది వీఆర్ఓలకు నాయబ్ తహసీల్దార్ కేడరైన సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది. అలాగే మరో 14 మంది సీనియర్ అసిస్టెంట్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులను నాయబ్ తహసీల్దార్ కేడర్‌గా పరిగణిస్తారు. అయితే, ఒక్కో అధికారి సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా రెండేళ్ల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాయబ్ తహసీల్దార్ కేడర్‌లో నాలుగేళ్ల పాటు పనిచేసిన వారికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు! వీఆర్ఓ నుంచి డిప్యూటీ తహసీల్దార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి. ఇక మిగిలింది తహసీల్దార్లు, ఆపై స్థాయి అధికారులే. వీరికి కూడా త్వరలో స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 12 మంది తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాల మేరకు వీరికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌కు ఎనిమిది మంది, సంగారెడ్డి జిల్లాకు ముగ్గురు, నల్లగొండకు ఒకరు బదిలీ అయ్యారు. ఒకే ప్రాంతంల్లో మూడేళ్ల పాటు పనిచేయడంతోపాటు మాతృ జిల్లాలకు చెందిన తహసీల్దార్లకు బదిలీ వర్తించింది. ఎన్నికలు ముగియడంతో వారు తిరిగి మన జిల్లాకు బదిలీపై వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీడీఓలు కూడా శాసనసభ ఎన్నికల సమయంలో ఎంపీడీఓలు బదిలీపై వెళ్లారు. మూడేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన 19 మందికి స్థాన చలనం కలిగింది. వీరు కూడా త్వరలో జిల్లాకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంటున్నాయి. -
రూటు మార్చెన్..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనాపరంగా రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్న ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సదరు కార్యాలయాల నుంచి పొందాలంటే పడే ప్రయాస నుంచి విముక్తి కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చగా.. ప్రస్తుతం స్థిరాస్తి క్రయ విక్రయాలు పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ల కోసం దళారుల ప్రమేయం లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా కొనుగోలుదారుడికే ధ్రువపత్రాలు అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి కొనుగోలుదారుడి మొబైల్ నంబర్‌కు ఓటీపీ వచ్చేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో సదరు వ్యక్తులు తమకు సంబంధించిన సెల్ నంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటి ఆధారంగా ఓటీపీ(వన్‌టైమ్ పాస్వర్డ్) నంబర్ వారికి పంపిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడి సెల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే ఇచ్చేస్తారు. జిల్లాలో మొత్తం 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయ విక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు నిత్యం జరుగుతుంటాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంబంధిత వ్యక్తులకు స్కానింగ్ అనంతరం డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియలో కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రవేశ పెట్టిన ఈ పద్ధతి ద్వారా నేరుగా కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇబ్బందులు తొలగించేందుకే.. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం డాక్యుమెంట్లు తీసుకోవడం ఇప్పటివరకు కొనుగోలుదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయితే వీటిని నివారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇకపై తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటప్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు సిద్ధం కాగానే కొనుగోలుదారుడి సెల్‌కు వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నంబర్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌కు సంబంధిత వ్యక్తి చూపిస్తే డాక్యుమెంట్లను నేరుగా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆన్లైన్లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అందుబాటులో ఉన్నా.. ఎక్కువ శాతం మంది ఇప్పటికీ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ అనంతరం నాలుగు లేదా వారం రోజులకు కానీ స్కాన్ అయిన డాక్యుమెంట్లు తిరిగి రావడం లేదు. ఈలోగా సంబంధిత కొనుగోలుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉండేది. దీంతో మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఆధారపడి కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే సదరు వ్యక్తుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తాజాగా రిటర్న్ డాక్యుమెంట్ కోసం కూడా ఎస్ఎంఎస్ ఇస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి వచ్చింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొనుగోలుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. పారదర్శకతకు పెద్దపీట.. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పారదర్శకత ఉండేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసమే కొత్త చర్యలకు ఆ శాఖ శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం ద్వారా కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరం కానున్నది. తమ డాక్యుమెంట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. తమ సెల్‌కు డాక్యుమెంట్లు తీసుకోమని ఓటీపీ వచ్చినప్పుడు కార్యాలయానికి వెళ్లి నేరుగా డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను చూపించినట్లయితే.. సబ్ రిజిస్ట్రార్ ఓటీపీని సరిచూపి డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఓటీపీ విధానం వల్ల రెండు విధాలుగా లాభం కూడా ఉంటుంది. గతంలో డాక్యుమెంట్లను డాక్యుమెంట్ రైటర్ ద్వారా కొనుగోలుదారులు తీసుకునే వారు. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్‌కు సంబంధిత డాక్యుమెంట్లు ఎవరు తీసుకెళ్లింది సమాచారం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం నేరుగా సబ్ రిజిస్ట్రార్ చేతుల మీదుగానే డాక్యుమెంట్లు అందజేస్తుండడంతో ఆయనకు కూడా డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు తెలిసి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డాక్యుమెంట్లు అందజేసినట్లయితే కొన్ని డాక్యుమెంట్లు స్కాన్ కాకుండానే కొనుగోలుదారులకు అందజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓటీపీ విధానం వల్ల డాక్యుమెంట్ స్కాన్ చేసిన అనంతరం సంబంధిత కొనుగోలుదారుడికి ఓటీపీ వెళ్తుంది. దీనివల్ల ప్రతి డాక్యుమెంట్ స్కాన్ చేసినట్లుగా గుర్తించవచ్చు. ఓటీపీ చూపితే చాలు.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో కొనుగోలుదారులు సులువుగా తమ డాక్యుమెంట్లను పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త చర్యలు ఇటీవలే ప్రారంభించింది. ఈ విధానంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లు సంబంధిత కొనుగోలుదారులు ఒకటి, రెండు రోజుల్లో తీసుకోవచ్చు. డాక్యుమెంట్లు స్కాన్ అయిన వెంటనే కొనుగోలుదారుడి సెల్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని సబ్ రిజిస్ట్రార్‌కు చూపించినట్లయితే డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఉన్నట్లు అవుతుంది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
పైసా మే పట్వారీ!
ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ గ్రామంలో వీఆర్ఓ అవినీతి, అక్రమాల వల్ల 200 మంది రైతులకు చెందిన భూములు కొత్త పట్టా పుస్తకాలలోకి ఎంట్రీ కాలేదు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లనే నమోదు చేశారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వీఆర్ఓ బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మండల కేంద్రంలోని ముస్తాబాద్ వీఆర్ఓ హరికిషోర్ను బదిలీ చేశారు. నామాపూర్, మొర్రాయిపల్లి వీఆర్ఓలను సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సస్పెండ్ చేశారు. ముస్తాబాద్ తహసీల్దార్‌ను కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గుడి రాజిరెడ్డికి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి కుమారులు. వీరిలో రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి గతంలో మరణించారు. వారి పేరున ఉన్న వ్యవసాయ భూమి వారసులు గుడి మల్లారెడ్డి, గుడి దేవేంద్రల పేరిట విరాసత్ చేయాల్సి ఉంది. దేవేంద్ర కుమారుడు గుడి మనోజ్ తన తాతకు సంబంధించిన భూమి విరాసత్ చేయాలని యల్ఆర్యూపీఎస్లో దరఖాస్తు చేసుకున్నాడు. జనార్దన్ తడగొండ వీఆర్వోగా ఉన్న సమయంలో 30 గుంటల భూమి విరాసత్ చేయకుండా ఆపాడు. దీంతో ఆ యువకుడు 30 గుంటల భూమిని తన తల్లి పేరున ఆన్లైన్ చేయాలని వీఆర్వోను కోరాడు. రూ.5వేలు ఇస్తే ఆన్లైన్ చేస్తానని వీఆర్వో చెప్పగా.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 2018 మే 2న ఏసీబీ అధికారులు దాడి చేసి మనోజ్ నుంచి రూ.ఐదు వేలు తీసుకున్న వీఆర్వో జనార్దన్‌ను పట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వీఆర్వోల లీలలు కేవలం ముస్తాబాద్, బోయినపల్లి మండలాలకే పరిమితం కాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అదే పరిస్థితి నెలకొంది. ముస్తాబాద్ మండలంలో వీఆర్ఓల అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామరెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. కానీ మిగతా జిల్లాల్లో ఏళ్లకేళ్లుగా గ్రామాల్లో రైతులను శాసిస్తూ, పట్టా పాసు పుస్తకాలు, పహానీలకు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వీఆర్వో నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేరనే అహంతో అవినీతి, అక్రమాలతో కోట్లు వెనుకేసుకుంటున్న వీఆర్ఓలు కూడా కరీంనగర్ పూర్వ జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన వీఆర్వోలకు కాసుల వర్షం కురిపించే కామధేనువుగా మారింది. అదే సమయంలో భూమి హక్కులు గల యజమానులకు అన్యాయం జరిగింది. కాసుల గలగలతో మారిన రాతలు గ్రామాల్లో ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పుకు సర్టిఫై చేసే పని నుంచి ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన వారికి పట్టా చేసేంత వరకు వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించి మరీ లక్షల్లో వసూలు చేసిన సంఘటనలు ఎన్నో. రైతు తన పని కావాలని డబ్బులిస్తే, ఇతర భూములు, సర్కారు భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులకు అండగా నిలిచి, వారికి ‘రాసిచ్చినందుకు’ లక్షల్లో పోగేసుకున్నారు. భూములను ఇష్టానుసారంగా విరాసత్ చేయడం, మ్యుటేషన్లతోపాటు సంబంధం లేని సాకులు చూపి పాసుపుస్తకాల్లో పేర్లు ఎంట్రీ చేయకపోవడం వంటి అంశాలన్నీ వీఆర్వోలకు కాసులు కురిపించేవిగానే తయారయ్యాయి. దూరప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ కరీంనగర్లో విలాసవంతమైన జీవితాలు గడిపే వీఆర్ఓలు ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. కాగా వీఆర్ఓగా కేవలం ఆదాయం వచ్చే రెవెన్యూ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ అందిన కాడికి దండుకోవడంతోపాటు కొందరు తహసీల్దార్లకు కూడా వాటాలు ఇచ్చే సంస్కృతికి బీజం వేశారు. వీఆర్ఓల మీద ఆరోపణలు వస్తున్నా, తమకు అందుతున్న తాయిలాలతో తహసీల్దార్లు సైతం మిన్నకుండి పోతున్నారు. ఇసుక, ఇటుక, మట్టి... అన్నీ ఆదాయ మార్గాలే! కరీంనగర్ పూర్వ జిల్లాలోని మానేరు వాగులు, గోదావరి, దాని అనుబంధ నదుల్లో లభించే ఇసుకకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో జిల్లాల్లో ఉన్న ప్రైవేటు, టీఎస్ఎండీసీ ఆధీనంలోని ఇసుక రీచ్‌లను మూసేశారు. ప్రభుత్వ పనులకైనా, ప్రైవేటు పనులకైనా కాళేశ్వరం నుంచే ఇసుకను తీసుకోవాలనే నిబంధనలు విధించారు. నిర్ధేశించిన మొత్తానికి చలానా చెల్లించి ఇసుకను తెప్పించుకోవడం కష్టమవుతుండడంతో గ్రామాల్లోని ట్రాక్టరు యజమానులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.2000 నుంచి 2,500 వరకు పలుకుతుండడంతో ట్రాక్టర్ యజమానులు రోజుకు పది ట్రిప్పుల వరకు ఇసుకను తోడేస్తున్నారు. దీనికి సహకరించినందుకు వీఆర్వోలకు రోజు వారీ మొత్తాలను సమర్పిస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. కరీంనగర్ శివార్లలోని ఇరుకుల్ల వాగులో రాత్రి వేళల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నాయి. ఇసుక తవ్వడం కోసం ప్లొక్లెయినర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది రోడ్డున పోయే వారికి కనిపిస్తున్నా, స్థానిక వీఆర్వోలకు కాసులు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఘోరం ఏంటంటే ఇసుకను నింపుకున్న ట్రాక్టర్లు రాజీవ్ రహదారి మీద రాంగ్ రూట్లలో వస్తుండడం. కాగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన ఇటుక బట్టీలకు మట్టిని సమకూర్చే దందాల్లో కూడా వీఆర్వోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్డగోలు దందాలకు అండగా ఉంటున్నారు. మరికొందరు వీఆర్ఓల లీలలు రామగిరి మండలం బుధవారం పేట(రామయ్య పల్లి)కు చెందిన దండ శ్రీనివాస్‌రెడ్డి, కొండపర్తి రాజమ్మలకు కలిపి ఆదివారంపేట శివారు సర్వే నెంబర్ 178లో 3.35 ఎకరాల భూమి ఉంది. కానీ వీరికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంలో వీఆర్ఓల కిరికిరితో రైతుబంధు లబ్ధి రావడం లేదు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతిచెందారు. ఇప్పటికీ వీఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ కనికరించలేదు. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామస్తుడు పాలెపు బాలయ్య అనే రైతుకు పెగ్గెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 4.15 ఎకరాల భూమి ఉంది. పాసుబుక్కుల్లో మాత్రం 1.04 ఎకరాలు అని ఉంది. తన భూమిని కొత్త పాసుబుక్కుల్లో ఎక్కించాలని ఏడాదిగా తిరుగుతున్న పట్టించుకునేవారు లేరని వాపోయారు. గ్రామంలోని అధికారులను అడిగితే సరిగా స్పందించలేదని, మండల కార్యాలయాలకు వెళ్లిన లాభం లేకుండా పోయిందన్నారు. అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయా. భూమి సమస్యలు ఎప్పుడు పరిష్కారిస్తారో నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు. ఏసీబీకి పట్టుబడిన ఇల్లందకుంట తహసీల్దార్ జమ్మికుంట పట్టణానికి చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి ఇల్లందకుంట మండల కేంద్రంలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. సాదాబైనామా చేసేందుకు తహసీల్దార్ రవిరాజాకుమార్రావ్ రూ.2లక్షలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 8న వీఆర్ఏ రామకృష్ణతోపాటు తహసీల్దార్‌ను పట్టుకున్నారు. 2015లో ఉమ్మడి జమ్మికుంట అప్పటి తహసీల్దార్ రజిని, వీఆర్ఓ శ్రీనివాస్ దాదాపు 25 మంది రైతుల నుంచి రూ.కోటి పైగా డబ్బులు వసూలు చేశారని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అప్పటి ఏసీబీ సుదర్శన్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. విరాసత్‌లు, పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యూటేషన్లు చేయడానికి కనగర్తి, మాచనపల్లి, జగ్గయ్యపల్లి, గడ్డివానిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి వీఆర్ఓ శ్రీనివాస్‌తో కలిసి తహసీల్దార్ రజని డబ్బులు తీసుకున్నారు. 2015 మే 31న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు చేయగా నేరం అంగీకరించారు. రెండేళ్లపాటు శిక్ష అనుభవించడంతోపాటు విధుల నుంచి తొలగించారు. ఏడాదిగా తిరుగుతున్నా.. వేములవాడ రూరల్: నా పాస్‌బుక్‌పై నా ఫొటోకు బదులు మా అన్న ఫొటో వచ్చింది. దీనిని మార్చాలని గత సంవత్సరంగా తిరుగుతున్నా. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్నా కనికరించడం లేదు. నాలాంటి వారు ప్రతిరోజు చాలా మంది వస్తున్నారు. – ఎడపెల్లి పర్శరాం, రైతు, గ్రామం: చెక్కపల్లి, మం: వేములవాడ -
రెవెన్యూలో కలకలం
ఆయనో ఉన్నతాధికారి. ఆయనకు ఉద్యోగులంటే ఎంతో అభిమానం. అందరితో నూ సౌమ్యంగా మెలిగేవారు. పరిపాలనా పరంగా మంచి అధికారిగానే గుర్తింపు ఉంది. వృత్తి రీత్యా ఎంతో అనుభవం కలిగి ఉండటం అదనపు ప్రత్యేకత. ఇదీ ఇప్పటివరకూ జిల్లా జేసీ–2 నాగేశ్వరరావుపై జిల్లా యంత్రాంగానికి ఉన్న అభిప్రాయం. కానీ బుధవారం ఏసీబీ తనిఖీలతో వారంతా విస్తుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కోవడంతో అంతా కలవరపడ్డారు. శాఖలో ఎక్కడా దీనిపైనే చర్చ. ఈ సంఘటన మిగిలిన అధికారుల్లోనూ గుబులు రేగేలా చేసింది. విజయనగరం గంటస్తంభం : జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో మంచి అధికారిగా గుర్తింపు పొందినా తాజాగా వెలుగు చూసిన కొత్త కోణం ఆయన ప్రతిష్ట దిగజారడానికి కారణమయింందని చెప్పక తప్పదు. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లా అధికారుల్లో గుబులురేగుతోంది. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు కనుగొన్నా... మార్కెట్లో వాటి విలువ రూ. 20కోట్లకు పైగానే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి జిల్లా కలెక్టర్, జేసీ తర్వాత మూడోస్థానం జేసీ–2దే. అభివృద్ధి, సంక్షేమ పథకాల జేసీగా గుర్తింపు పొందిన ఈ పోస్టులోకి కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు. అంతకుముందు పని చేసిన యు.జి.సి నాగేశ్వరరావు బదిలీ కావడంతో విధుల్లోకి చేరిన తక్కువ కాలంలోనే ఈయన మంచి అధికారిగా గుర్తింపు పొందారు. పోస్టు పరంగా అధిక శాఖల కార్యకలాపాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. ఐదారుశాఖలు మినహా అన్నిశాఖలు ఫైళ్లు తప్పనిసరిగా ఈయన వద్దకే వెళ్లాలి. జిల్లాలో జేసీ–2గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. కలెక్టర్ దృష్టిని ఆకర్షించిన పనితీరు జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ, సమీక్షలు చేస్తుండటంతో కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు అత్యంత నమ్మకమైన అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో సంయుక్త కలెక్టర్‌గా ఉన్న శ్రీకేష్ లఠ్కర్ పాలనాపరంగా కొంత అంటీ ముట్టనట్టు ఉండటం, తన పరిధిలో పనిపై మాత్రమే ఆయన దృష్టిసారించడంతో అంతగా గుర్తింపు పొందలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కలెక్టర్ తాను స్వయంగా చూడలేని పనులు, చేయలేని సమీక్షలు జేసీ–2 నాగేశ్వరరావు ద్వారా చేయించుకునే వారు. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడంతో ఇతర అధికారుల వద్ద, ప్రజల్లో గుర్తింపు, గౌరవం పొందారు. మరోవైపు ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. కోపం వస్తే మాటలు విసిరినా పాలనపరంగా అధికారులు, సిబ్బందికి హాని చేయకపోవడం, కష్టసుఖాలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో మంచి అధికారిగానే అన్ని వర్గాల్లో గుర్తింపు పొందారు. ఆరోపణలు మరోకోణం జిల్లాలో ఆయన బాధ్యతలు స్వీకరించి కేవలం 10నెలలు కావడంతో ఆయనపై పెద్దగా విమర్శలు, అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇళ్లల్లో సోదాలు చేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి రావడంతో ఆయనలో అవినీతి కోణంపై చర్చ మొదలైంది. ఆయన అవినీతి జిల్లాలో ఏ మేరకు ఉంది? ఇతర జిల్లాలో పని చేసినపుడు పరిస్థితేమిటన్న ఆరా అందరూ తీస్తున్నారు. వాస్తవానికి మంచి అధికారిగా గుర్తింపు ఉన్నా అవినీతిపరంగా మరోకోణం ఉందనే చెప్పాలి. జిల్లాలో బహిరంగంగా ఆరోపణలు వచ్చినంత అవినీతి చేయకపోయినా పని చేసి డబ్బులు తీసుకుంటారన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఏసీబీ దాడులు నేపథ్యంలో ఇది నిజమే కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈయన పని చేసిన చోట కూడా ఆయనపై ఆరోపణలున్నాయన్న చర్చ జరుగుతోంది. అధికారుల్లో గుబులు కలెక్టర్ తర్వాత స్థానంలో ఉన్న అధికారి ఏసీబీ కేసులోఓ్ల చిక్కడంతో జిల్లా అధికారుల్లో గుబులు మొదలైంది. అధికారులు పెద్ద తలకాయలను టార్గెట్ చేయడంతో అవినీతికి పాల్పడే అధికారుల్లో ఆందోళన మొదలైంది. మరో ముగ్గురు జిల్లా అధికారులు ఏసీబీ లిస్టులో ఉన్నారన్న ప్రచారం ఉండడంతో వారెవరన్న చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా జేసీ–2 బంగ్లాలో ఏసీబీ సోదాలు జరగడంతో ఇతర అధికారులు చాలా మంది కార్యాలయాలకు రాలేదు. కలెక్టరేట్లో దాదాపు సగం మంది అధికారులు బుధవారం ఉదయం కార్యాలయంలో లేకపోవడం విశేషం. డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ... ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. తహసీల్దారుగా మేరుడుబిల్లి, పెద్దాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాకినాడలో పనిచేశారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు. మే నెలలో పదవీవిరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. గుర్తించిన ఆస్తులివే... రాష్ట్రంలోని పదిచోట్ల బుధవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరంలో ఏసీబీ డీఎస్పీ షకీలాభాను ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లు, బ్యాంకు లాకర్లలో 705 గ్రాముల బంగారం, 5567.50 గ్రాముల వెండి వస్తువులు, రూ.19,91,186ల బ్యాంకు బ్యాలెన్సు, రూ.12,75,000ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.10,72,250ల విలువైన గృహోపకరణాలు గుర్తించారు. విశాఖ పెదవాల్తేరులో రామకృష్ణరాజు పేరుమీద విజయనగర ప్యాలెస్ లేఅవుట్లో ఫ్లాట్, రమణమూర్తిరాజు పేరుతో 514ఫ్లాట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎఫ్డబ్లూడీ బీఎస్ఐవీ మోటార్ కారు, విశాఖలోని ఆనందపురంలో 774.5 గజాల ఖాళీ స్ధలం, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల ఇంటి స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో 10.32ఎకరాల వ్యవసాయ భూమి, మరోచోట 52 సెంట్లు, 15 సెంట్లు, 56 సెంట్ల వ్యవసాయ భూమి గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 14 సెంట్లకుపైగా ఖాళీ స్థలం, విశాఖలోని రేసపువానిపాలెంలో కుమారుడు కాకర్ల రాజేష్ చంద్ర పేరుతో కృష్ణసాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్, కాకినాడలోని సూర్యాపేట, శశికాంత్ నగర్లో 1250 చదరపు అడుగుల స్లాబ్ ఇల్లు, విశాఖలోని ఎండాడలో ఎన్ఎస్ఎన్ రెడ్డి లేఅవుట్లో తల్లి కాకర్ల ధనలక్ష్మి పేరుతో 633 చదరపు గజాల స్థలం, గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి, విశాఖ మధురవాడలో 389 చదరపు గజాల ఖాళీ స్ధలం, అక్కడకు సమీపంలో 231 చదరపు గజాల స్ధలం, పశ్చిమగోదావరి జిల్లా అమలాపురంలో 484 చదరపు గజాల ఇంటిని గుర్తించారు. విశాఖలోనూ... విశాఖ క్రైం : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజయనగరం జాయింట్ కలెక్టర్ – 2 నాగేశ్వరరావు బంధువులకు చెందిన విశాఖలోని ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదా లు నిర్వహించారు. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖలో ఆరుచోట్ల, బెంగుళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది పెదవాల్తే రు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు. పదవీ విరమణకు నెల రోజుల ముందే... నాగేశ్వరరావు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. అతని తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగరం జిల్లా ఎస్.కోటలో స్థిరపడ్డారు. 1990లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ప్రస్తుతం విజ యనగరం జేసీ–2గా చేస్తున్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. -
‘రాజధాని’కి ఏమైంది?
► ముందుకు సాగని చెక్కుల పంపిణీ, గ్రామ కంఠాల గుర్తింపు,పొలాల చదును ► జరీబు భూముల గుర్తింపుపై రైతుల నుంచి అభ్యంతరాలు ► ఆయా గ్రామాల్లో నేటికీ పూర్తికాని రుణమాఫీపైనా సందేహాలు ► పూర్తి స్థాయిలో హాజరుకాని సీఆర్డీఏ, సర్వే, రెవెన్యూ సిబ్బంది ► మంత్రులు వస్తేనే పనులు,లేదంటే ఏసీ గదుల్లో అధికారులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : మంత్రులు వచ్చినప్పుడే రాజధాని గ్రామాల్లో హడావుడి ఉంటోంది. మిగిలిన రోజుల్లో స్తబ్దత నెలకొంటుంది. సీఆర్డీఏ, సర్వే, రెవెన్యూ శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరుకాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రైతులకు చెక్కుల పంపిణీ, గ్రామ కంఠాల గుర్తింపు, పంట పొలాల చదును వంటి కార్యక్రమాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 33,400 ఎకరాలను 23 వేల మంది రైతుల నుంచి సమీకరించింది. ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం కౌలు చెక్కుల పంపిణీ కార్యక్రమం నెల కిందటే ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కలసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో మంత్రులు కొన్ని రోజులు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరుకాలేదు. దాంతో ఈ కార్యక్రమం మంద కొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 4,500 ఎకరాలకు సంబంధించి రూ.2.08 కోట్ల మొత్తాల చెక్కులను పంపిణీ చేశారు. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతుల్లో కొందరు కౌలు చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రావడం లేదు. ఇళ్లు ఉంటాయా... పోతాయా ? గ్రామ కంఠాల విషయంలో ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. నివాస గృహాలు ఉంటాయా? ప్రభుత్వం కూల్చివేస్తుందా? అనే సందేహాలతో రైతులు కొట్టుమి ట్టాడుతున్నారు. వీరి సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పిన మంత్రులు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తం 29 గ్రామాలకు చెందిన గ్రామ కంఠాల్లో అనంతవరం, నెక్కల్లు గ్రామాలను మంత్రి నారాయణ పరిశీలించారే తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించలేదు. రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తరువాతే మిగిలిన భూముల్లో పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ముందుగా వ్యవసాయ భూములను చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్టర్లతో పచ్చని పంట పొలాల సరిహద్దులను తొలగించారు. వారం రోజులపాటు జరిగిన ఈ తంతులో 8,600 ఎకరాలను చదును చేశామని మంత్రులు ప్రకటించినా, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు సందేహ పడుతున్నారు. అసలు రాజధాని నిర్మాణం జరుగుతుందా? అనే అనుమానం కూడా లేకపోలేదు. మరోవైపు 5,982 ఎకరాల జరీబు భూముల గుర్తిం పుపైనా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. వీటిపైనా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. రాజధాని గ్రామాల్లోని రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించిన తేదీలు అనేకసార్లు మారడంతో దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మంత్రులు ఉన్నప్పుడు ఉన్నతాధికారులు రాజధాని గ్రామాల్లో కనపడుతున్నారు. మిగిలిన రోజుల్లో సమీక్షల పేరుతో ఏసీ గదులను వదలడం లేదు.