రూటు మార్చెన్‌..! | Land Registration Revenue Department Khammam | Sakshi
Sakshi News home page

రూటు మార్చెన్‌..!

Published Wed, Jun 12 2019 8:07 AM | Last Updated on Wed, Jun 12 2019 8:07 AM

Land Registration Revenue Department Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనాపరంగా రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్న ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సదరు కార్యాలయాల నుంచి పొందాలంటే పడే ప్రయాస నుంచి విముక్తి కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చగా.. ప్రస్తుతం స్థిరాస్తి క్రయ విక్రయాలు పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ల కోసం దళారుల ప్రమేయం లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా కొనుగోలుదారుడికే ధ్రువపత్రాలు అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతి కొనుగోలుదారుడి మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వచ్చేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సదరు వ్యక్తులు తమకు సంబంధించిన సెల్‌ నంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటి ఆధారంగా ఓటీపీ(వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) నంబర్‌ వారికి పంపిస్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడి సెల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చూపిస్తే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే ఇచ్చేస్తారు. 

జిల్లాలో మొత్తం 9 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ చిట్స్‌ కార్యాలయం, ఎంవీ అండ్‌ ఆడిట్‌ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయ విక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు నిత్యం జరుగుతుంటాయి. అయితే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సంబంధిత వ్యక్తులకు స్కానింగ్‌ అనంతరం డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియలో కొనుగోలుదారులు డాక్యుమెంట్‌ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రవేశ పెట్టిన ఈ పద్ధతి ద్వారా నేరుగా కొనుగోలుదారుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. 

ఇబ్బందులు తొలగించేందుకే.. 
భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న అనంతరం డాక్యుమెంట్లు తీసుకోవడం ఇప్పటివరకు కొనుగోలుదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయితే వీటిని నివారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు ఇకపై తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్‌ రైటప్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు సిద్ధం కాగానే కొనుగోలుదారుడి సెల్‌కు వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నంబర్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌కు సంబంధిత వ్యక్తి చూపిస్తే డాక్యుమెంట్లను నేరుగా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం అందుబాటులో ఉన్నా.. ఎక్కువ శాతం మంది ఇప్పటికీ ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్‌ అనంతరం నాలుగు లేదా వారం రోజులకు కానీ స్కాన్‌ అయిన డాక్యుమెంట్లు తిరిగి రావడం లేదు. ఈలోగా సంబంధిత కొనుగోలుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉండేది. దీంతో మధ్యవర్తులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై ఆధారపడి కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే సదరు వ్యక్తుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. తాజాగా రిటర్న్‌ డాక్యుమెంట్‌ కోసం కూడా ఎస్‌ఎంఎస్‌ ఇస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలులోకి వచ్చింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కొనుగోలుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

పారదర్శకతకు పెద్దపీట.. 
రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పారదర్శకత ఉండేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసమే కొత్త చర్యలకు ఆ శాఖ శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం ద్వారా కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరం కానున్నది. తమ డాక్యుమెంట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. తమ సెల్‌కు డాక్యుమెంట్లు తీసుకోమని ఓటీపీ వచ్చినప్పుడు కార్యాలయానికి వెళ్లి నేరుగా డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను చూపించినట్లయితే.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఓటీపీని సరిచూపి డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఓటీపీ విధానం వల్ల రెండు విధాలుగా లాభం కూడా ఉంటుంది. గతంలో డాక్యుమెంట్లను డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా కొనుగోలుదారులు తీసుకునే వారు. దీనివల్ల సబ్‌ రిజిస్ట్రార్‌కు సంబంధిత డాక్యుమెంట్లు ఎవరు తీసుకెళ్లింది సమాచారం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ చేతుల మీదుగానే డాక్యుమెంట్లు అందజేస్తుండడంతో ఆయనకు కూడా డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు తెలిసి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా డాక్యుమెంట్లు అందజేసినట్లయితే కొన్ని డాక్యుమెంట్లు స్కాన్‌ కాకుండానే కొనుగోలుదారులకు అందజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓటీపీ విధానం వల్ల డాక్యుమెంట్‌ స్కాన్‌ చేసిన అనంతరం సంబంధిత కొనుగోలుదారుడికి ఓటీపీ వెళ్తుంది. దీనివల్ల ప్రతి డాక్యుమెంట్‌ స్కాన్‌ చేసినట్లుగా గుర్తించవచ్చు.

ఓటీపీ చూపితే చాలు..
స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో కొనుగోలుదారులు సులువుగా తమ డాక్యుమెంట్లను పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త చర్యలు ఇటీవలే ప్రారంభించింది. ఈ విధానంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ అనంతరం డాక్యుమెంట్లు సంబంధిత కొనుగోలుదారులు ఒకటి, రెండు రోజుల్లో తీసుకోవచ్చు. డాక్యుమెంట్లు స్కాన్‌ అయిన వెంటనే కొనుగోలుదారుడి సెల్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని సబ్‌ రిజిస్ట్రార్‌కు చూపించినట్లయితే డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ విధానంలో పారదర్శకత ఉన్నట్లు అవుతుంది.  – అడపా రవీందర్, సబ్‌ రిజిస్ట్రార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement