గంజాయి స్మగ్లర్ల దగ్గర్నుంచి ఇసుకాసురుల వరకూ... మద్యం సిండికేట్ల నుంచి రాళ్ల వ్యాపారుల వరకూ... ఒకటా రెండా ఆ లాఠీ లీలలు కోకొల్లలు. పశువుల సంతలనూ వదలని ఈయనగారి అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు జిల్లాలో సంచలనమవుతుంటే అవినీతి భాగోతాలు ఇంకా ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచే ఆరోపణలు ఎదుర్కొంటూ విజయనగరం వచ్చినా అదే పంథా కొనసాగిస్తున్న ఆ అధికారి ‘మూర్తీ’భవించిన అవినీతిగా మార్కులు కొట్టేస్తున్నారు. అతని సిబ్బందితో పాటు, మామూళ్లు సమర్పించుకున్న వారు సైతం ‘సాక్షి’కి తమ వాంగ్మూలాన్ని అందించారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: విశాఖ జిల్లా ముంచింగ్‌పుట్టు ప్రాంతం కేంద్రంగా అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా పేరుపొందిన ఓ నేరస్తుడితో సత్సంధాలు నెరపిన ఎస్‌కోట సర్కిల్‌లోని పోలీస్ అధికారి అతని వద్ద కాసులు దండుకున్నారు. తర్వాత తన పరిధిలోదికానప్పటికీ విశాఖ జిల్లా హుకుంపేట వద్ద పట్టుబడ్డ గంజాయి కేసును డీల్ చేసి అతనిని నేరస్తుడిగా చూపించారు. దీనికి ప్రధాన కారణం 75 కేజీల గంజాయి నర్శీపట్నంలో పోలీసులకు పట్టుబడగా దానిని తరలించిన వ్యక్తి ఆ అధికారికి సన్నిహితుడు కావడంతో అతనిని తప్పించేందుకు ఈ విధంగా చేశారని చెబుతున్నారు.
ఆయన రూటే సెప‘రేటు’
తన పరిధిలోని క్వారీల నుంచి నెలవారీ మామూ ళ్లు నిర్ణయించుకున్న అధికారి లారీకి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. క్రషర్‌కు, లారీకి, క్వారీకి వేరు వేరుగా రేట్లు నిర్ణయిం చారట. ఇసుక వ్యాపారుల నుంచి కూడా ఇదే వి ధంగా కాసులు రాబట్టారని, ట్రాక్టరుకు రూ.2500 నుంచి రూ.5వేల చొప్పున చెల్లించామని పలు వురు వెల్లడించారు. మద్యం సిండికేట్లు ఒక్కోషా పు నుంచి నెలకు రూ.5వేల చొప్పున సమర్పిస్తున్నట్లు సమాచారం. పశువుల సంతలపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారి తర్వాత వారితో బేరం కుదుర్చుకున్నారట. ఇక ఆ తర్వాత అక్రమంగా మూగజీవాలను తరలించుకుపోతు న్నా అడ్డుచెప్పడం లేదని ఆ వర్గం వాళ్లే అంటున్నారు.
తప్పించుకునేందుకు యత్నాలు
అవినీతి భాగోతాలను ‘సాక్షి’ వరుసగా బయటపెట్టడంతో బెంబేలెత్తిపోతున్న ఆ అధికారి తనను తాను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధులను కలిసి సాక్షి కథనాలపై వివరణ ఇచ్చుకుని... తనను రక్షించాల్సిందిగా వారిని వేడుకున్నట్లు సమాచారం. ఆయనకు అభయమిచ్చిన ఆ పెద్దలు విశాఖ జిల్లాకు చెందిన మరో పెద్దమనిషి ద్వారా రాష్ట్ర హోం మంత్రిని కలిసి వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు టీడీపీ ప్రజాప్రతినిధులు అండగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మందలించాల్సింది పోయి రక్షణ కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో ఆ అధికారితో వారి సంబంధాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment