సర్కిల్ కార్యాలయంలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్న సీఐ ఇలియాజ్ మహ్మద్
విజయనగరం, సాలూరు: నేరస్తుల గుట్టురట్టు చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఒకప్పుడు ధనికులు జీవించే ప్రాంతాలు, గృహాల్లో మాత్రమే పరిమితంగా కనిపించేవి. అయితే ఇటీవల కాలంల నేరాలు ఎక్కువ కావడంతో నేడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే సాలూరు మున్సిపాలిటీలో దాదాపు మూడేళ్ల కిందటే నేరాల అదుపునకు పట్టణ పోలీసులు సీసీ కెమెరాలను పలుచోట్ల ఏర్పాటు చేశారు.
మొదట తహసీల్దార్ కార్యాలయం జంక్షన్‌లో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల 26వ నంబరు జాతీయ రహదారిపై ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపైనే కాకుండా పట్టణంలో తిరిగే వాహనాలు, పాదచారులపై కూడా నిఘా పెట్టారు. పట్టణంలో నిలిపివేసిన లారీని కొంతమంది దొంగిలించి ఛత్తీస్‌గఢ్‌కు తరలించిన కేసును సీసీ కెమెరాల సహాయంతోనే పోలీసులు అతి తక్కువ కాలంలోనే ఛేదించారు. దీంతో పోలీసులు మరో అడుగు ముందుకేసి మరిన్ని సీసీ కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీలక్స్ సెంటర్, వేంకటేశ్వరకాలనీ, తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతోనే మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిన్నింటినీ సర్కిల్ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో అక్కడ నుంచే పోలీసులు ఆయా ప్రాంతాలను కంప్యూటర్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇటీవల సెల్ షాపులో జరిగిన చోరీ కేసులో కూడా సీసీ పుటేజీలు కీలకంగా మారాయి.
మరో 68 సీసీ కెమేరాలు..
ప్రభుత్వం జాతీయ రహదారిపైనే కాకుండా ఇతర ప్రధాన రహదారులపై కూడా ప్రత్యేకంగా 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మేక్స్‌వెల్ సంస్థ సహకారంతో ఇక్కడ రికార్డయిన దృశ్యాలను నేరుగా అమరావతిలో మానటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వీటిసాయంతో రోడ్డు ప్రమాదాలకు బాధ్యులైన వారితో పాటు అక్రమ రవాణాలను కట్టడి చేయగలుగుతున్నారు.
దర్యాప్తు వేగవంతం..
సీసీ కెమెరాల సహాయంతో చోరులు, ప్రమాదాలు చేసిన వారిని తొందరగా గుర్తించే వీలుంటుంది. సీసీ పుటేజీ కారణంగా దర్యాప్తు వేగవంతం అవుతుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్‌లు, దోడీలకు పాల్పడేవారు సులువుగా దొరికిపోయే అవకాశం ఉంది. – ఇలియాజ్ మహమ్మద్, సీఐ, సాలూరు
Comments
Please login to add a commentAdd a comment