సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు శనివారం కొలు వుదీరనున్నాయి. పల్లెపోరు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికైన పంచాయతీ ప్రజా ప్రతినిధుల ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త గ్రామ పంచాయతీల తొలి సమావేశాలతో గ్రామాలు కళకళలాడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా దాదాపు నెల రోజుల పాటు సాగిన ఎన్నికలు పూర్తయ్యాక పదవీ స్వీకారాలతో పల్లెలు కొత్త సవాళ్లకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీ కాలం శనివారం (ఫిబ్రవరి 2) నుంచి మొదలవుతుందని పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ రోజు నుంచే పంచాయతీల కొత్త పాలకవర్గాల పదవీకాలం మొదలవుతోంది. అన్ని గ్రామపంచాయతీల్లోనూ కొత్త పాలకవర్గాల ప్రమాణ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలు మినహా శనివారం పదవీ స్వీకారం చేసిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లపాటు కొనసాగనుంది. ఎన్నికలు జరగని పంచాయతీలు, గడువు ముగియని పంచాయతీలకు పంచాయతీరాజ్ శాఖ విడిగా అపాయింటెడ్ డేను ప్రకటించనుంది. గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టంతో సహా గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న హరితహారం తదితర కార్యక్రమాల గురించి సమగ్రఅవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు.
త్వరలోనే శిక్షణ
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఈ నెల 11 నుంచి విస్తృతస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావించినా ఈ కార్యక్రమం కొన్ని రోజులు వాయిదా పడింది. సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే అధికారుల శిక్షణ కార్యక్రమం ఈ నెల 4 నుంచి మొదలుకానుంది. 15 జిల్లాలకు చెందిన అధికారులకు ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మిగతా 15 జిల్లాల అధికారులకు ఆ తర్వాత మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇస్తారు. పంచాయతీ చట్టంపై అవగాహనతో పాటు, శిక్షణ కార్యక్రమాల్లో తగిన అనుభవమున్న 10 మంది అధికారులకు ఒక్కో జిల్లా నుంచి (ఒక ఎంపీడీవో, ఒక ఈవోపీఆర్‌డీ, ఒక పంచాయతీ సెక్రటరీతో పాటు ఏడుగురు విశ్రాంత ఉద్యోగులు) శిక్షణ ఇస్తారు. రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) కింద ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం తప్పనిసరి కాబట్టి ఈ శిక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శిక్షకులకు శిక్షణ ముగిశాక ఒక్కో జిల్లాలో కొత్త సర్పంచ్‌లకు రెండు బ్యాచ్‌ల (వంద మంది) చొప్పున పంచాయతీ చట్టాలు, విధులు, అధికారాలు, తదితర ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు.
పల్లెల్లో కొత్త పాలన
Published Sat, Feb 2 2019 1:50 AM | Last Updated on Sat, Feb 2 2019 1:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment