ఇటు పరిశుభ్రం.. అటు రాబడి | Villages Development With Jagananna Swaccha Sankalpam | Sakshi
Sakshi News home page

ఇటు పరిశుభ్రం.. అటు రాబడి

Published Sun, Jun 12 2022 4:47 AM | Last Updated on Sun, Jun 12 2022 2:44 PM

Villages Development With Jagananna Swaccha Sankalpam - Sakshi

దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్‌ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు  చేసి 217 కిలోలు విక్రయించారు.

వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్‌ నేమ్‌తో మార్కెటింగ్‌ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో  తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది.

సాక్షి, అమరావతి: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్‌ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో  సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 

మార్కెటింగ్‌ వ్యూహాలపై అధికారుల కసరత్తు..
రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు కొన్ని మార్కెటింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్‌ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్‌ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు.

ప్రతివారం సమీక్ష 
ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు.

అక్టోబర్‌ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ..
అక్టోబర్‌ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్‌ బ్రాండ్‌ నేమ్‌ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. 
– కోన శశిధర్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement