ప్యూర్టోరీకోను సముద్రంలో కదిలే చెత్తకుప్పలా అభివర్ణించిన స్టాండప్ కమేడియన్ టోనీ
ట్రంప్ ప్రచారవేదికగా లాటిన్ అమెరికన్లపై విద్వేష వ్యాఖ్యలు
వెల్లువెత్తుతున్న విమర్శలు
పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ఫలితాలు మారే చాన్స్ !?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.
దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.
అసలేం జరిగింది?
ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్‌తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ.
కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?
ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
స్వింగ్‌యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ?
ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్‌లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి.
గతంలో జాత్యహంకార వ్యాఖ్యలు
ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment