
పనుల్లో జాప్యం.. ప్రజలకు శాపం
పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నత్తనడకన పీఆర్ రోడ్లు, బ్రిడ్జి పనులు
- ఎంఆర్‌ఆర్, సీఆర్‌ఆర్ పనులు సైతం అదే దారిలో..
- దృష్టి సారించని ఉన్నతాధికారులు
- క్షేత్ర స్థాయిలో కానరాని పర్యవేక్షణ
- ఇబ్బందుల్లో పల్లె వాసులు
ఉమ్మడి జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణం : 43
పూర్తయినవి: 20
ఏడాదికాలంగా సాగుతున్నవి: 23
విడుదలైన నిధులు:రూ.35.16 కోట్లు
సాక్షి, మెదక్: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఊపందుకోవడంలేదు. ఫలితంగా సరైనా రవాణా సౌకర్యం లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లాతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగటంలేదు. సరైన రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు లేక గ్రామీణులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించటంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖదే ముఖ్యపాత్ర. నాబార్డు, ఎంఆర్‌ఆర్ (మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్), సీఆర్‌ఆర్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్), కల్వర్టు వర్క్(సీడీ వర్క్)తోపాటు వివిధ స్కీంల ద్వారా రహదారులు నిర్మాణం, మరమ్మతులు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారు. ఆయా స్కీంల ద్వారా మెదక్‌తోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరైనా పనులు మాత్రం సకాలంలో పూర్తి కావటంలేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్ ద్వారా 43 బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.35.16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 20 పనులు పూర్తి కాగా మిగతా 23 బ్రిడ్జిల నిర్మాణం పనులు ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. నాబార్డు (ఆర్‌ఐడీఎఫ్ 21) ద్వారా రూ.29.33 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో మొత్తం 37 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఒక్క బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. మిగతా 36 బ్రిడ్జిలనిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో పలుచోట్ల బ్రిడ్జిల నిర్మాణం పనులు ముందుకు సాగడంలేదు.
హవేళిఘనపూర్ మండలం గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. తిమ్మాయిపల్లి–అనంతసాగర్ బ్రిడ్జి, ర్యాలమడుగు–పేరూర్ బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలంలోని నస్కల్ నుంచి తుజాల్‌పూర్ వరకు చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలేదు. కౌడిపల్లి మండలంలోని సీలంపల్లి నుంచి గౌతాపూర్ లోలెవల్ కాజ్ వే పనులు ప్రారంభంకాలేదు. చిలప్‌చెడ్ మండలం సోమక్కపేట రాందాస్‌గూడ మధ్య బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. కొల్చారం మండలంలో లింగంపల్లి మధ్య కంచన్‌పల్లిలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
కొల్చారం మండలంలో కుబ్యాతండా– అంసాన్‌పల్లిలో బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించలేదు. నర్సాపూర్ మండలంలోని తుల్జాపూర్ నుంచి కాజీపేట మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. నర్సాపూర్ మండలంలోని మూసాపేట నుంచి దౌల్తాబాద్ మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రిడ్జిలు పూర్తి కాకపోవటంతో ఆయా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది.
ఎంఆర్‌ఆర్, సీఆర్‌ఆర్ పనుల్లోనూ..
రహదారులు, భవనాల నిర్మాణం పనుల్లో సైతం జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంఆర్‌ఆర్ ద్వారా రూ.213 కోట్ల అంచనా వ్యయంతో 507 పనులు మంజూరు కాగా 397 పనులు పూర్తయ్యాయి. ఇంకా 110 పనులు కొనసాగుతున్నాయి. సీఆర్‌ఆర్ కింద రూ.355 కోట్లతో 248 కొత్త పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 183 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 65 రహదారుల నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో మండల సమాఖ్య భవనాల నిర్మాణం కోసం రూ.3.98 కోట్ల మంజూరయ్యాయి. మొత్తం 14 భవనాలు నిర్మించాల్సి ఉండగా కేవలం ఐదు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా తొమ్మిది భవనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అలాగే అంగన్‌వాడీ భవనాల నిర్మాణం పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి.