Construction of bridges
-
పనుల్లో జాప్యం.. ప్రజలకు శాపం
నత్తనడకన పీఆర్ రోడ్లు, బ్రిడ్జి పనులు - ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ పనులు సైతం అదే దారిలో.. - దృష్టి సారించని ఉన్నతాధికారులు - క్షేత్ర స్థాయిలో కానరాని పర్యవేక్షణ - ఇబ్బందుల్లో పల్లె వాసులు ఉమ్మడి జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణం : 43 పూర్తయినవి: 20 ఏడాదికాలంగా సాగుతున్నవి: 23 విడుదలైన నిధులు:రూ.35.16 కోట్లు సాక్షి, మెదక్: పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఊపందుకోవడంలేదు. ఫలితంగా సరైనా రవాణా సౌకర్యం లేక గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లాతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో సాగటంలేదు. సరైన రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు లేక గ్రామీణులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించటంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖదే ముఖ్యపాత్ర. నాబార్డు, ఎంఆర్ఆర్ (మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్), సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్), కల్వర్టు వర్క్(సీడీ వర్క్)తోపాటు వివిధ స్కీంల ద్వారా రహదారులు నిర్మాణం, మరమ్మతులు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారు. ఆయా స్కీంల ద్వారా మెదక్‌తోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరైనా పనులు మాత్రం సకాలంలో పూర్తి కావటంలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నాబార్డు ఆర్ఐడీఎఫ్ ద్వారా 43 బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.35.16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 20 పనులు పూర్తి కాగా మిగతా 23 బ్రిడ్జిల నిర్మాణం పనులు ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. నాబార్డు (ఆర్ఐడీఎఫ్ 21) ద్వారా రూ.29.33 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో మొత్తం 37 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఒక్క బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. మిగతా 36 బ్రిడ్జిలనిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో పలుచోట్ల బ్రిడ్జిల నిర్మాణం పనులు ముందుకు సాగడంలేదు. హవేళిఘనపూర్ మండలం గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. తిమ్మాయిపల్లి–అనంతసాగర్ బ్రిడ్జి, ర్యాలమడుగు–పేరూర్ బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలంలోని నస్కల్ నుంచి తుజాల్పూర్ వరకు చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలేదు. కౌడిపల్లి మండలంలోని సీలంపల్లి నుంచి గౌతాపూర్ లోలెవల్ కాజ్ వే పనులు ప్రారంభంకాలేదు. చిలప్‌చెడ్ మండలం సోమక్కపేట రాందాస్‌గూడ మధ్య బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. కొల్చారం మండలంలో లింగంపల్లి మధ్య కంచన్‌పల్లిలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొల్చారం మండలంలో కుబ్యాతండా– అంసాన్‌పల్లిలో బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించలేదు. నర్సాపూర్ మండలంలోని తుల్జాపూర్ నుంచి కాజీపేట మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. నర్సాపూర్ మండలంలోని మూసాపేట నుంచి దౌల్తాబాద్ మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రిడ్జిలు పూర్తి కాకపోవటంతో ఆయా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ పనుల్లోనూ.. రహదారులు, భవనాల నిర్మాణం పనుల్లో సైతం జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంఆర్ఆర్ ద్వారా రూ.213 కోట్ల అంచనా వ్యయంతో 507 పనులు మంజూరు కాగా 397 పనులు పూర్తయ్యాయి. ఇంకా 110 పనులు కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ కింద రూ.355 కోట్లతో 248 కొత్త పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 183 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 65 రహదారుల నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో మండల సమాఖ్య భవనాల నిర్మాణం కోసం రూ.3.98 కోట్ల మంజూరయ్యాయి. మొత్తం 14 భవనాలు నిర్మించాల్సి ఉండగా కేవలం ఐదు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా తొమ్మిది భవనాల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణం పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. -
రాజ మార్గం
► ఇక నేరుగా అమరావతికే! ► వంపులకు తావులేని రహదారి ► అడ్డొస్తే కొండను తొలచి రోడ్డు మార్గం ► లోయల మధ్య వంతెనల నిర్మాణం ► త్వరలో సర్వే పనులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా నుంచి అమరావతికి ఎలాంటి వంపుల్లేకుండా గీత గీసినట్టు 4 లేదా 6 లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇప్పటికే అమరావతికి రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అమరావతికి వేసే రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు వస్తే వాటిని తొలిచి రహదారి నిర్మించనున్నట్టు సమాచారం. అదేవిధంగా లోయలు వస్తే రెండింటి మధ్య వంతెన నిర్మాణం ద్వారా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ధ్రువీకరించారు. ఇక సర్వే షురూ.. అనంతపురం నుంచి అమరావతికి వయా కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల మీదుగా 4 లేదా 6 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ రోడ్డు నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబ్ ఉత్తర్వులు కూడా వెలువరించారు. సర్వే పనులకు రూ.11.565 కోట్ల నిధుల విడుదలకు అంగీకారం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలో సర్వే పనుల కోసం ఏజెన్సీని ఎన్నుకునేందుకు టెండర్లను పిలవనున్నారు. అనంతరం సర్వే పనులు మొదలవనున్నాయి. సర్వే అనంతరం.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సర్వే అనంతరమే రహదారి నిర్మాణం 4 లేన్లుగా ఉండనుందా? లేక 6 లేన్లుగా ఉండనుందా అనేది తేలనున్నట్టు సమాచారం. చైనా స్ఫూర్తిగా... దారి మధ్యలో ఎలాంటి వంపులు లేకుండా నేరుగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక.. చైనాలోని రహదారుల స్ఫూర్తి ఉందని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. చైనాలో గీత గీసినట్టు రోడ్లన్నీ నేరుగా ఎలాంటి వంకరలు లేకుండా ఉంటాయన్నారు. అదేవిధంగా అమరావతికి కూడా రహదారి నిర్మాణం ఉండనుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే, కర్నూలు నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో ప్రధాన అడ్డంకి అటవీ ప్రాంతం. అందువల్ల అటవీ ప్రాంతంలో ఏదైనా కొండవస్తే.. చుట్టూ వంపులు తిరుగుతూ రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ కొండలు వస్తే తొలిచి రహదారిని నిర్మించనుందన్నారు. తద్వారా రోడ్దు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పెద్ద పెద్ద లోయలు వస్తే రెండింటి మధ్య వంతెనను నిర్మిస్తారని.. ఈ వంతెన కూడా 4 లేదా 6 లేన్లుగా ఉండనుండటం విశేషమని ఆయన వివరించారు. -
3,500 కి.మీ. మేర డబుల్ రోడ్లు
రాష్ట్రంలో భారీ ఎత్తున రోడ్లు, వంతెనల నిర్మాణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్న ప్రభుత్వం అందుకు అడ్డంకిగా ఉన్న రహదారుల అనుసంధానంపై దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో దాదాపు రూ.11 వేల కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణతోపాటు శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం... 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,600 కోట్లతో పనులు నిర్వహించనుంది. ఇందుకోసం రోడ్లు, భవనాలశాఖ తాజాగా ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణలో ఒకే ఏడాది ఇన్ని పనులు ప్రారంభించటం ఇదే తొలిసారి కావడం విశేషం. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లకు.. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, నియోజకవర్గాల మీదుగా రెండు వరసల రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,500 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఇందులో 2,500 కిలోమీటర్ల మేర పనులను 2016 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రోడ్లు సరిగా లేనందున ఈ పనుల్లో ఆ రెండు జిల్లాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 744 కిలోమీటర్ల మేర, ఆదిలాబాద్‌లో 690 కిలోమీటర్ల మేర వీటిని నిర్మిస్తున్నారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్లు మెరుగ్గా ఉన్నందున వాటి పరిధిలో 380 కి.మీ., 390 కి.మీ. మేర పనులు చేపట్టనున్నారు. పాత రోడ్లకు కొత్త రూపు... రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తారు రోడ్లున్నప్పటికీ వాహనాలు సరిగా ప్రయాణించలేని దుస్థితికి చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల పాత రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 వేల కిలోమీటర్ల రోడ్లను గుర్తించింది. ఇందుకు రూ. 1,200 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త రోడ్ల నిర్మాణం కంటే వీటిని తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో ఇప్పటికే రోడ్లు భవనాలశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. కొన్ని మార్గాల్లో సింగిల్ టెండర్లు దాఖలు కావటంతో వాటిని రద్దు చేసి మిగతా వాటి పనులు ప్రారంభిస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు దారితీసే రోడ్ల పనులను కూడా ఇందులో చేర్చారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 35 పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 238 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏడాదిలో 60 వంతెనలు... రాష్ట్రంలో రోడ్లపై చిన్న వంతెనలు మొదలు గోదావరి, కృష్ణా నదులపై ఉన్న పెద్ద నదుల వరకు చాలా నిర్మాణాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 383 వంతెల నిర్మాణం అవసరమని తేల్చిన సర్కారు... ఈ సంవత్సరం వాటిలో 60 వంతెలను నిర్మించనుంది. చిన్నాచితకా వాగులపై ఉన్న వంతెనలతోపాటు కృష్ణానదిపై రెండు కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన, గోదావరిపై రెండు, మానేరుపై రెండు... వెరసి ఐదు భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ఇందుకు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ల అనుసంధానంగా మహబూబ్‌నగర్- కర్నూలు మధ్య కృష్ణానదిపై రెండు కిలోమీటర్ల పొడవుతో భారీ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీని అంచనా వ్యయం రూ. 190 కోట్లు. ఇందులో కొంత ఖర్చు భరించాల్సిందిగా ఏపీని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు మంథని-ఓదెల మార్గంలో ఓదెల వద్ద మానేరుపై 600 మీటర్ల వంతెన, కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో మానేరు మీద నీర్కుల వద్ద మరో భారీ వంతెన, గోదావరి నదిపై కరీంనగర్ జిల్లా రాయికల్ సమీపంలో బోర్నపల్లి వద్ద భారీ వంతెన, ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరిపై దాదాపు 800 మీటర్ల మేర విశాలమైన వంతెన నిర్మించనున్నారు. వీటికి సంబంధించి అంచనాలను సిద్ధం చేసి మరికొద్ది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్‌లోనే అన్ని పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ల గడువును వారానికి కుదించిన నేపథ్యంలో ఆ ప్రక్రియలో జాప్యం ఉండదని చెబుతున్నారు.