
రాజ మార్గం
జిల్లా నుంచి అమరావతికి ఎలాంటి వంపుల్లేకుండా గీత గీసినట్టు 4 లేదా 6 లేన్ల రహదారిని ....
► ఇక నేరుగా అమరావతికే!
► వంపులకు తావులేని రహదారి
► అడ్డొస్తే కొండను తొలచి రోడ్డు మార్గం
► లోయల మధ్య వంతెనల నిర్మాణం
► త్వరలో సర్వే పనులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా నుంచి అమరావతికి ఎలాంటి వంపుల్లేకుండా గీత గీసినట్టు 4 లేదా 6 లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇప్పటికే అమరావతికి రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అమరావతికి వేసే రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు వస్తే వాటిని తొలిచి రహదారి నిర్మించనున్నట్టు సమాచారం. అదేవిధంగా లోయలు వస్తే రెండింటి మధ్య వంతెన నిర్మాణం ద్వారా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ధ్రువీకరించారు.
ఇక సర్వే షురూ..
అనంతపురం నుంచి అమరావతికి వయా కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల మీదుగా 4 లేదా 6 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ రోడ్డు నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబ్ ఉత్తర్వులు కూడా వెలువరించారు. సర్వే పనులకు రూ.11.565 కోట్ల నిధుల విడుదలకు అంగీకారం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలో సర్వే పనుల కోసం ఏజెన్సీని ఎన్నుకునేందుకు టెండర్లను పిలవనున్నారు.
అనంతరం సర్వే పనులు మొదలవనున్నాయి. సర్వే అనంతరం.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సర్వే అనంతరమే రహదారి నిర్మాణం 4 లేన్లుగా ఉండనుందా? లేక 6 లేన్లుగా ఉండనుందా అనేది తేలనున్నట్టు సమాచారం.
చైనా స్ఫూర్తిగా...
దారి మధ్యలో ఎలాంటి వంపులు లేకుండా నేరుగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక.. చైనాలోని రహదారుల స్ఫూర్తి ఉందని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. చైనాలో గీత గీసినట్టు రోడ్లన్నీ నేరుగా ఎలాంటి వంకరలు లేకుండా ఉంటాయన్నారు. అదేవిధంగా అమరావతికి కూడా రహదారి నిర్మాణం ఉండనుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
అయితే, కర్నూలు నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో ప్రధాన అడ్డంకి అటవీ ప్రాంతం. అందువల్ల అటవీ ప్రాంతంలో ఏదైనా కొండవస్తే.. చుట్టూ వంపులు తిరుగుతూ రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ కొండలు వస్తే తొలిచి రహదారిని నిర్మించనుందన్నారు. తద్వారా రోడ్దు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పెద్ద పెద్ద లోయలు వస్తే రెండింటి మధ్య వంతెనను నిర్మిస్తారని.. ఈ వంతెన కూడా 4 లేదా 6 లేన్లుగా ఉండనుండటం విశేషమని ఆయన వివరించారు.