శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందా?
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎన్జీటీ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేయాలంటూ ‘రాజధాని ఎంపిక కమిటీ’ సిఫార్సు చేసిందా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ప్రశ్నించింది. అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఎన్జీటీ శుక్రవారం విచారించింది. నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందా? ఒకవేళ చేసి ఉంటే దానికి సంబంధించిన నివేదిక ఏది? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి నీటి వనరులు, భూమి, ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కమిటీ సూచించిందన్నారు.
అమరావతి ప్రాంతం ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి అనువుగా ఉందని, నీటి లభ్యత కూడా ఉందన్నారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ స్పందిస్తూ... రాజధానిగా అమరావతిని ఎంపిక చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని ధర్మాసనం దృషికి తీసుకొచ్చారు. దీనిపై ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని ఎన్జీటీ పేర్కొంది. ఆధారాలను సమర్పిస్తామని న్యాయవాది శ్రావణ్‌కుమార్ చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.