AK Ganguly
-
తీవ్రమైన ఆ ఆరోపణలపై విచారణ జరగాలి
(ప్రవీణ్‌కుమార్ లెంకల) సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన విచారణ జరగాల్సి ఉందని, గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. ఆయన నిర్ణయానికి దీనిని వదిలిపెట్టాలని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రశ్న: మీరు న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం గురించి ఇటీవల మాట్లాడారు. అమరావతి భూ కుంభకోణంలో ఆరోపణలకు సంబంధించి తాజా పరిణామాలను మీరు ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి: న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యం. నేను ఈ వ్యవహారంపై నిన్న (మంగళవారం)నే ఒక టీవీ చానల్ చర్చలో మాట్లాడాను. నా అభిప్రాయం అదే. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే వ్యక్తి. రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కాగలిగిన సీనియర్ న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో కూడిన లేఖను చీఫ్ జస్టిస్‌కు రాశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ పాలనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి గల రాజకీయ విరోధులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రణాళికతో ఆ న్యాయమూర్తి వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ఇది తీవ్రమైన ఆరోపణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాంటి విచారణ ఉంటుందో, ఏ చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన మౌనంగా ఉండలేరు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలి. నాకు అర్థమైనంత వరకు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉన్నందున ఆరోపణలపై దర్యాప్తు జరగాలి. ప్రశ్న : ప్రభావవంతమైన వ్యక్తులపై ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు ఆపాలా? జస్టిస్ ఏకే గంగూలి : విచారణ ఎలా జరగాలి? ఎవరు జరపాలి? అన్న అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్మరించరని నా అభిప్రాయం. ప్రశ్న : హైకోర్టు మీడియాపై గాగ్ ఆర్డర్ జారీ చేయడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : గ్యాగ్ ఆర్డర్ జారీ చేయకూడదు. ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. న్యాయస్థానం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. సిట్టింగ్ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలకు తెలుసుకునే అవసరం ఉంది. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంలో సభ్యులు. ప్రశ్న : తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని, దానిని ప్రజల ముందు పెట్టడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : ఇలా ఆరోపణలు చేసిన సంఘటన ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. అదే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ప్రశ్న : భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని ఊహించలేను. ఈ దేశ పౌరుడిగా, మాజీ న్యాయమూర్తిగా నేను ఏం ఆశించగలనంటే.. చీఫ్ జస్టిస్ దీనిని పక్కన పెట్టేస్తారని అనుకోవడం లేదు. సాధారణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిచేలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రశ్న : రాజ్యాంగాన్ని అనుసరించి ఎలాంటి విచారణ ఉండాలి? అది ఏ స్థాయిలో ఉండాలి? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని చెప్పలేను. రాజ్యాంగ బద్ధంగా వ్యవస్థ నడిచేందుకు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు. విచారణ ఎలా ఉండాలని గానీ, ఉంటుందని గానీ నేను ఇండికేట్ చేయదలుచుకోలేదు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి విచక్షణ అది. ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి. ప్రశ్న : గతంలో ఇలాంటి æఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎలాంటి విచారణ జరిగింది? జస్టిస్ ఏకే గంగూలి : సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇలాంటి ఫిర్యాదులు రావడం నా దృష్టిలో లేదు. అయితే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. కానీ అది ఇలాంటి ఆరోపణ కాదు. -
శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందా?
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎన్జీటీ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేయాలంటూ ‘రాజధాని ఎంపిక కమిటీ’ సిఫార్సు చేసిందా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ప్రశ్నించింది. అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఎన్జీటీ శుక్రవారం విచారించింది. నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిందా? ఒకవేళ చేసి ఉంటే దానికి సంబంధించిన నివేదిక ఏది? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి నీటి వనరులు, భూమి, ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కమిటీ సూచించిందన్నారు. అమరావతి ప్రాంతం ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి అనువుగా ఉందని, నీటి లభ్యత కూడా ఉందన్నారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ స్పందిస్తూ... రాజధానిగా అమరావతిని ఎంపిక చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని ధర్మాసనం దృషికి తీసుకొచ్చారు. దీనిపై ఆధారాలు ఉంటే తమకు అందజేయాలని ఎన్జీటీ పేర్కొంది. ఆధారాలను సమర్పిస్తామని న్యాయవాది శ్రావణ్‌కుమార్ చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
ఆ సుప్రీం మాజీ జడ్జి స్వతంత్ర కుమార్
లైంగిక వేధింపుల ఉదంతంలో వెలుగులోకి.. న్యూఢిల్లీ: జస్టిస్ ఏకే గంగూలీ మాదిరే న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో సుప్రీం కోర్టు మాజీ జడ్జి పేరు బయటకొచ్చింది. ఆయన ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ స్వతంత్ర కుమార్ అని తేలింది. బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ శుక్రవారం ఈమేరకు వెల్లడించింది. జస్టిస్ గంగూలీపై వచ్చినట్లే మరో సుప్రీం కోర్టు మాజీ జడ్జిపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని ‘సాక్షి’లో ఇటీవల వార్త రావడం తెలిసిందే. -
నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం:గంగూలీ
కోల్‌కతా: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ తాను పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం(డబ్ల్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ధ్రువీకరించారు. వివాదం మరింత పెరగకుండా నివారించేందుకే పదవి నుంచి తప్పుకున్నానన్నారు. గవర్నర్ ఎంకే నారాయణన్‌కు సోమవారం అందించిన తన రాజీనామా లేఖను ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఫోన్లో చదివి వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారామని పేర్కొన్నారు. తనను హెచ్ఆర్సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అనాలోచితం, అసమంజసం అని ఆరోపించారు. ‘నా కుటుంబ సభ్యుల సుఖశాంతుల కోసం, నేను నిర్వహించిన ఉన్నత పదవులపై గౌరవంతో రాజీనామా చేశాను. నన్ను విమర్శిస్తున్నవారిని ద్వేషించడం లేదు. వారి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గౌరవాభిమానాలతో పని చేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. కాగా, గంగూలీ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. గంగూలీ 2012 డిసెంబర్లో ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో తనను లైంగికంగా వేధించారని ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని ఆరోపించడం, ఆయనను సుప్రీం కోర్టు జడ్జీల విచారణ కమిటీ అభిశంసించడం తెలిసిందే. -
గంగూలీపై ఫిర్యాదు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను లైంగికంగా వేధించాడంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే గంగూలీపై ఆరోపణలు చేసిన బాధితురాలు తమకు ఫిర్యా దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తామని న్యూఢిల్లీ ఎస్బీఎస్ త్యాగి తెలి పారు. ‘ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, తన వాంగ్మూలాన్ని రికార్డు చేయవలసిందిగా బాధితురాలికి ఈ-మెయిల్ పంపాం. ఆమె ముందుకొచ్చి ఫిర్యాదు చేసినట్లయితే చేపట్టవలసిన తదుపరి చర్యల విషయమై పరిశీలిస్తాం. ఈ విషయంలో న్యాయనిపుణుల నుంచి ఎలాంటి సహాయాన్ని కోరలేదు. వాంగ్మూలాన్ని నమోదుచేసుకోవడానికి ఎప్పుడు? ఎక్కడికి? రావాలో తెలపాల్సిందిగా మాత్రమే బాధితురాలిని మెయిల్లో కోరామ’ని త్యాగి చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చే యవలసిందిగా కోరుతూ ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విభాగం మాజీ ప్రొఫెసర్ ఇదివరకే తిలక్‌మార్గ్ స్టేషన్‌హౌజ్ ఆఫీసర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీ సులు ఆయన పిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ బాధితురాలు ముందుకొచ్చినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నారు. లా ఇంటర్న్‌గా పనిచేస్తున్న తనను గత సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని హోటల్ గదిలో ఏకే గంగూలీ లైంగికంగా వేధించారంటూ ఓ యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఆమె బ్లాగ్ ద్వారా వెల్లడించింది. కాగా గంగూలీ ఈ ఆరోపణలను ఖండించారు. గంగూలీ ఏడాది కిందట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడాయన పశ్చిమ బెంగాల్ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. యువతి ఆరోపణలను పరిశీలించడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో నియమించిన కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుపట్టింది. -
లైంగిక వేధింపుల కేసు.. జస్టిస్ గంగూలీపై ఆరోపణలు
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కున్న న్యాయమూర్తి ఏకే గంగూలీ అని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టులోని ఓ సీనియర్ న్యాయమూర్తి (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు) తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా న్యాయవాది గతంలో ఫిర్యాదు చేశారు. ఆ కేసును విచారించిన త్రిసభ్య కమిటీ.. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరును బయట పెట్టింది. కమిటీలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు ఆరుసార్లు సమావేశమైన తర్వాత తమ నివేదికను గురువారం సమర్పించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పేరు బయట పెట్టడం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి!! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివంకు నివేదిక సమర్పించారు. బాధిత న్యాయవాది వాంగ్మూలం, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏకే గంగూలీ వాంగ్మూలం కూడా ఈ నివేదికలో ఉన్నాయి.