నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం:గంగూలీ
కోల్‌కతా: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ తాను పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం(డబ్ల్యూబీహెచ్‌ఆర్‌సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ధ్రువీకరించారు. వివాదం మరింత పెరగకుండా నివారించేందుకే పదవి నుంచి తప్పుకున్నానన్నారు. గవర్నర్ ఎంకే నారాయణన్‌కు సోమవారం అందించిన తన రాజీనామా లేఖను ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఫోన్‌లో చదివి వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారామని పేర్కొన్నారు. తనను హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని కేంద్రం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు అనాలోచితం, అసమంజసం అని ఆరోపించారు. ‘నా కుటుంబ సభ్యుల సుఖశాంతుల కోసం, నేను నిర్వహించిన ఉన్నత పదవులపై గౌరవంతో రాజీనామా చేశాను.
నన్ను విమర్శిస్తున్నవారిని ద్వేషించడం లేదు. వారి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గౌరవాభిమానాలతో పని చేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. కాగా, గంగూలీ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. గంగూలీ 2012 డిసెంబర్‌లో ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో తనను లైంగికంగా వేధించారని ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని ఆరోపించడం, ఆయనను సుప్రీం కోర్టు జడ్జీల విచారణ కమిటీ అభిశంసించడం తెలిసిందే.