‘నవరత్నాల’బడ్జెట్‌ నేడే | YS Jagan Government First Budget Will Be Present Today | Sakshi
Sakshi News home page

‘నవరత్నాల’బడ్జెట్‌ నేడే

Published Fri, Jul 12 2019 3:27 AM | Last Updated on Fri, Jul 12 2019 9:54 AM

YS Jagan Government First Budget Will Be Present Today - Sakshi

సాక్షి, అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని సమా చారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం..
టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క  వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. 

సంక్షేమానికి పెద్దపీట
సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన బడ్జెట్‌లో అన్ని సంక్షేమ కార్యక్రమాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తగిన విధంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధిపై దూరదృష్టితో ఆలోచించి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనతోపాటు పోలవరం, వంశధార, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా బడ్జెట్‌ రూపొందించారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన అన్ని కుటుంబాలకు యూనివర్శల్‌ హెల్త్‌ కేర్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలకు కొండంత ఆరోగ్య భరోసా కల్పించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. చేనేత, మత్య్సకారులు, ఆటో డ్రైవర్లుతోపాటు అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకునేలా కేటాయింపులు ఉంటాయని పేర్కొంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం పెళ్లి కానుక కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి.

అన్ని పథకాలకు తగిన విధంగా కేటాయింపులు..
ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు కేటాయింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రభుత్వం ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. ఆత్మహత్యకు పాల్పడటం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రూ. ఏడు లక్షల చొప్పున  పరిహారం చెల్లించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారు. సహకార రంగం పునరుద్ధణకు నిధులు కేటాయించనున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించనున్నారు. కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు కోసం కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో రూ.1,740 కోట్లను కేటాయించనున్నారు.

రూ.2.31 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌!
గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించి నూతన సర్కారుకు ఖాళీ ఖజానా అప్పగించినప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రూ. 2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేశారు. 

రూ.28 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌!
వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బదులుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి బొత్స సాగుకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. అనుబంధ రంగాలతో కలిపి రూ.28,866 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.12,510 కోట్లను కేటాయించనున్నారు. పశు సంవర్ధక శాఖకు రూ.1,240 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు రూ.3,212 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.5,000 కోట్లను కేటాయించనున్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను గత ఏడాది కన్నా 10 – 15 శాతం ఎక్కువ అంచనాలతో రూపొందించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్‌ అకాల మృతి చెందిన నేపథ్యంలో మంత్రులు బొత్స, మోపిదేవి అసెంబ్లీ, శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచించారు. 2013–14 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది. 

వ్యవసాయానికి గతంలో కేటాయింపులు(రూ. కోట్లలో)

నేడు ఉదయం బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ సమర్పిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టనున్నారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమవేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement