క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మాకవరపాలెం : గ్రామీణ క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కోరారు. జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో జోన్ గ్రిగ్ మీట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక్కో జిల్లాను పది జోన్‌లుగా విభజించి, ఆరు మండలాలకు ఒక జోన్‌గా ఈ గ్రిగ్‌మీట్‌లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థుల్లో కొందరికే క్రీడా దుస్తులుండడం బాధాకరమన్నారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఆటల్లో రాణిస్తున్న విద్యార్థుల దుస్తులు పంపిణీకి ముందుకు రావాలన్నారు. మండల కేంద్రంలో గరుకుల పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఇక్కడ గెలుపొందినవిద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం గొలుగొండ మండలం ఏఎల్ పురం, మాకవరపాలెం జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలను తిలకించారు.
మొక్కుబడిగా నిర్వహిస్తారా?
గ్రిగ్‌మీట్ నిర్వహణ మొక్కుబడిగా జరుగుతోందని మంత్రి అయ్యన్న మండిపడ్డారు. ఆరు మండలాల విద్యార్థులకు జరిగే ఈ పోటీలకు మంత్రి పాల్గొన్నా డీఈవో, క్రీడా అభివృద్ధి అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారులు పోటీలను పర్యవేక్షించాలన్నారు. గ్రిగ్‌మీట్ నిర్వహణకు రూ.5 వేలు సరిపోవని, ఈ నిధులు పెంచేలా తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ, జెడ్పీటీసీ కె.కుమారి, ఆర్డీవో సూర్యారావు, తహశీల్దార్ గంగాధరరావు, ఎంఈవో మూర్తి పాల్గొన్నారు.