సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, ఫిర్యాదుల పర్యవేక్షణ ప్రక్రియను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014కి ముందు గ్రామ పంచాయ తీల పర్యవేక్షణలో ఉన్న వీధి దీపాల నిర్వహణను టీడీపీ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. గ్రామాల్లో చాలా వీధి దీపాలు రేయింబవళ్లు వెలుగుతుండడం, మరికొన్ని రాత్రివేళ వెలగకపోవడంపై పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎనర్జీ అసిస్టెంట్‌కు బాధ్యతలు..
► ఇక నుంచి వీధి దీపాల మరమ్మతులు, నిర్వహణను గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24–48 గంటల లోపే సమస్య పరిష్కరిస్తారు.
► రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాలు లేని 2,000 గ్రామాల్లో కొత్తగా నాలుగు లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఇక నుంచి జగనన్న పల్లె వెలుగుగా పేరు మార్చారు.
ఇళ్ల పట్టాల లేఔట్ల వద్ద భారీగా మొక్కల పంపిణీ
జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటాలని సమావేశంలో నిర్ణయించారు. 25,814 కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాది ఉపాధి హామీ పథకం కూలీలకు 25 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.
మంగంపేట బైరటీస్ విస్తరణ వేగవంతం చేయాలి
మంగంపేట బైరటీస్ విస్తరణ, ఉత్పత్తి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సులియేరి, మదన్‌పూర్ బొగ్గు బ్లాకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగారు. బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.
వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు
Published Wed, Jul 1 2020 4:09 AM | Last Updated on Wed, Jul 1 2020 4:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment