
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్‌లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది. సాగునీటి శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రాధాన్యం కల్పించింది. 2018–19 బడ్జెట్‌లో ఈ శాఖకు ఏకంగా రూ.15,562.84 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.12,776 కోట్లను ప్రగతి పద్దుగా, రూ.2,786.78 కోట్లను నిర్వహణ పద్దుగా పేర్కొన్నారు. ఈ మేరకు భారీ నిధులతో ప్రగతి పద్దును గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం కేటాయించింది.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు కూడా చేయనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవికాక ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల పేర్కొన్నారు.
ఆసరాకు రూ.5,388.89 కోట్లు
ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉదారంగా వ్యవహరిస్తోంది. గత బడ్జెట్‌లో కొత్తగా ఒంటరి మహిళలకు పింఛన్‌ను ప్రకటించి.. ప్రస్తుతం అమలు చేస్తోంది. తాజాగా బడ్జెట్‌లో బోదకాలు వ్యాధి బాధితులకు ప్రతి నెల రూ.వెయ్యి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సీఎం ఇటీవల ప్రకటించిన ప్రకారం బోదకాలు వ్యాధి బాధితులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. అలాగే వికలాంగులకు నెలకు రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 41,78,291 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకు ఏటా సగటున రూ.5,300 కోట్లను ఖర్చు చేస్తోంది. ఆసరాకు ఈ ఏడాది రూ.5,388.89 కోట్లు కేటాయించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు
ఏడాది కేటాయింపులు
2014–15 13,761
2015–16 13,896
2016–17 14,262
2017–18 14,775
2018–19 15,562
‘భగీరథ’కు రూ.1,803 కోట్లు
రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 15 పట్టణాలకు, 2,900 గ్రామాలు, 5,752 ఆవాసాలకు లబ్ధి చేకూరింది. ఈ ఏడాది భగీరథ పథకానికి రూ.1,803.35 కోట్లను కేటాయించారు.
రాష్ట్రంలోని ప్రాంతాలను 26 సెగ్మెంట్లుగా విభజించి పనులు చేపడుతున్నారు. 67 ఇన్‌టెక్ వెల్స్, 153 వాటర్ ఫిల్టర్స్, 1,69,705 కిలోమీటర్ల పైపులైన్లు, 35,514 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు 80 శాతం రుణాల రూపంలోనే నిధులు సమకూరుతున్నాయి. మిగిలిన 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తోంది. గత బడ్జెట్‌లో ప్రభు త్వం ఈ పథకానికి రూ.3 వేల కోట్లను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment