వాటాల కిరికిరి | Rs. 27.73 crore with 34 package of tasks | Sakshi
Sakshi News home page

వాటాల కిరికిరి

Published Tue, Feb 10 2015 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

వాటాల కిరికిరి

వాటాల కిరికిరి

పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని మట్టి రోడ్లను బీటీ (బ్లాక్‌టాప్) చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

పంచాయతీ రోడ్లకు గ్రహణం
- ముందుకురాని కాంట్రాక్టర్లు
- కమీషన్‌ల కోసం ప్రజాప్రతినిధుల ఒత్తిడి
- మట్టి రోడ్లను  బీటీగా మార్చేందుకు..
- రూ. 27.73 కోట్లతో 34 ప్యాకేజీల పనులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని మట్టి రోడ్లను బీటీ (బ్లాక్‌టాప్) చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మూడు నెలల వ్యవధిలో రూ.27.73 కోట్ల విలువ చేసే 36 ప్యాకేజీల కింద 378 పనులకు మూడు సార్లు టెండర్లు పిలవగా రెండు పనులకే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఆ రెండు పనులను కమీషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) ఆమోదించి నెల రోజులు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లు పనుల అగ్రిమెంట్ చేయించుకోవడం లేదు. దీంతో మట్టిరోడ్లను బీటీ చేయాలన్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఈ వ్యవహారంపై ఆరా తీస్తే.. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల నుంచి కొందరు ప్రజాప్రతినిధులు వాటా లు డిమాండ్ చేస్తుండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బీటీ రోడ్ల నిర్మాణాలకు కొందరు ప్రజాప్రతిని ధుల పర్సంటేజీల పర్వం అడ్డంకిగా మారింది. దీంతో జిల్లాలోని మట్టిరోడ్లను బీటీ చేసే ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. మూడు నెలలుగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలువగా ఏ ఒక్క టెండర్‌దారుడు ముందుకు రావడం లేదు.

జిల్లాలో ఎంఆర్‌ఆర్ స్కీం కింద 36 ప్యాకేజీల కింద ఆయా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి అనుమతి లభించింది. పంచాయతీరాజ్ అధికారులు రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూనుకున్నారు. ఇందులో భాగంగా 2014,  నవంబర్ 19న 36 మండలాల్లో ఈ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లను పిలిచారు. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. భీమ్‌గల్, జక్రాన్‌పల్లి ప్యాకేజీల అగ్రిమెంట్‌కు సీవోటీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినా.. ఇంకా అగ్రిమెంట్ కాలేదు. ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం బెదిరిస్తుండటంతో కాంట్రాక్టర్లు టెండర్లయినా అగ్రిమెంట్‌కు ముందుకు రావడం లేదన్న ప్రచారం ఉంది. అధికారులు 2014 డిసెంబర్-20న మరోసారి టెండర్లను పిలిచారు.

ఇందులో 13 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆయా పనులకు టెండర్లు వేసేందుకు రాగా కొందరు ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు ఇవ్వాలని నిర్మొహమాటంగా డిమాండ్ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆ పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం లేదు. ముచ్చటగా మూడో దఫా జనవరి 19న టెండర్లు పిలవగా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ పనుల్లో ప్రజాప్రతినిధులు భారీగా పర్సంటేజీలు డిమాండ్ చేయడంతో ఉన్నఫలంగా కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారంటున్నారు.
 
నాలుగోసారి స్పందిస్తారా..
మిషన్‌కాకతీయ, ఆర్‌అండ్‌బీ పనుల్లో సైతం కొందరు ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం కాంట్ట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఇదివరకే ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ మట్టిరోడ్లను బీటీ చేసేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో రూ.27.73 కోట్లు మంజూరు చేస్తే.. ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాల్సి ఉండగా మూడు నెలలుగా ‘పర్సెంటేజీ’ల పేరిట కాలయాపన జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
 
ఓ డివిజన్‌లో ప్రజాప్రతినిధి టెండర్ వేసే ముందు నన్ను కలువాలంటున్నారని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్తుండటం గమనార్హం. మరో ప్రజాప్రతినిధి అడుగు ముందుకేసి సంబంధిత పనులకు టెండర్ వేసేకంటే ముందుగానే పర్సంటేజీలు ముట్టజెప్పాలని హుకుం జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది.  ఇంకో ప్రజాప్రతినిధి అయితే తనతో సత్సంబంధాలున్న కాంట్రాక్టర్లను టెండర్ల కోసం ఆహ్వానిస్తుండటంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా వుండగా... రూ.27.73 కోట్ల విలువ చేసే 378 పనులకు నాలుగోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారైనా ఆ పనులకు టెండర్లు ఖరారవుతాయా? అన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement