సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 20,093 కోట్లు, పంచాయతీరాజ్ విభాగం కింద రూ. 10,716 కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రభుత్వాన్ని కోరగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధికి రూ. 5,358 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 4,221 కోట్లను సర్కారు ప్రతిపాదించింది. 2018–19 బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 15,562 కోట్లు (పీఆర్ విభాగానికి రూ. 8,929 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 6,633 కోట్లు) కేటాయించింది. మరోవైపు గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్ల కింద రూ. 5,388 కోట్లు కేటాయించగా దానికంటే రెండింతలు అధికంగా తాజా బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ. 12,067 కోట్లకు ప్రభుత్వం పెంచింది.
ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథకు ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా కనిపించలేదు. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 1,803 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం స్పష్టమైన కేటాయింపులు చేసినట్లు కనబడలేదు. అయితే పీఆర్, ఆర్‌డీకి సంబంధించి వివిధ రంగాలు, పథకాల కింద పలు రూపాల్లో కేటాయింపులు చేసినందున వాటిలోంచి మిషన్ భగీరథకు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకున్న దశలో బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017–18 బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. కాగా, అటవీ, పర్యావరణ, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్య శాఖకు రూ. 342 కోట్లు కేటాయించాలని అధికారులు కోరగా ప్రభుత్వం మాత్రం రూ. 171 కోట్లకే బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది.
‘డబుల్’ స్పీడ్
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.2,643 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు 80 వేల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈ సారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2019–20 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌లో రూ.4,709.5 కోట్లు కేటాయించింది. దీంతో ఈ సారి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగనుంది. 2019 జనవరి వరకు మొత్తం 19,195 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. వీటికి ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పెళ్లికి సాయం
పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ పథకాలకు 2019–20 బడ్జెట్‌లో రూ. 1,450 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1.433 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు రూ. 1,400 కోట్లు కేటాయించింది. కాగా, ఈ పథకాలకు ఈ నెల 20 నాటికి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జనవరి నెలాఖరు నాటికి 1,29,742 మందికి ఆర్థిక సాయం అందించారు. 2014–15లో కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అమలు చేయగా.. 2016–17 వార్షిక సంవత్సరం నుంచి బీసీ, ఈబీసీలకూ అందిస్తోంది.
ఆర్టీసీకి నిరాశే..
రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న అప్పులు, వాటి వడ్డీలతో సంస్థపై ఆర్థికభారం పెరిగిపోతోంది. అయితే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో సైతం ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.630 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో వివిధ బస్సుపాస్‌లు ఇతర రాయితీల కింద రూ.520 కోట్లు వివిధ రీయింబర్స్‌ల కింద పోను, మిగిలిన రూ.110 కోట్లను రుణాల కోసం కేటాయించారు. కొత్త బస్సుల కొనుగోలుకు ఇందులోనే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బడ్జెట్‌లో ప్రకటించిన మొత్తాన్ని ఏనాడూ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాది రూ.975 కోట్లు కేటాయించిన సర్కారు ఈ సారి ఏకంగా రూ.345 కోట్ల కోత విధించింది.
Comments
Please login to add a commentAdd a comment