‘పంచాయతీ’ పరోక్షమే! | Subcommittee intrested to choose the sarpanch indirectly | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ’ పరోక్షమే!

Published Sun, Jan 14 2018 2:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

Subcommittee intrested to choose the sarpanch indirectly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్పంచ్‌ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపింది. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ పరిధిలో కార్యనిర్వాహక అధికారాలన్నీ సర్పంచులకే అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది. పంచాయతీకి ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులను నామినేట్‌ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నివేదికను శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేసింది. 

తుది మెరుగులు దిద్ది.. 
పంచాయతీరాజ్‌ చట్టంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రులు కె.తారక రామారావు, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ఉప సంఘం శనివారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్‌ చట్టంలో చేర్చాల్సిన, తొలగించాల్సిన అంశాలపై మరోసారి చర్చించి నివేదికకు తుదిరూపు ఇచ్చింది. అనంతరం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి నివేదికను అందజేసింది. దీనిపై ఈ నెల 22న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించే అవకాశముంది. అనంతరం ఒకటి రెండు రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 

‘పంచాయతీ’సమస్యలపై ట్రిబ్యునల్‌
ప్రస్తుతం సర్పంచులపై అనర్హత వేటు వేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంది. సర్పంచులు కలెక్టర్‌ నిర్ణయంపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి అప్పీలు చేసుకునేందుకు అవకాశముంది. పంచాయతీరాజ్‌ మంత్రిదే తుది నిర్ణయంగా అమలవుతోంది. అయితే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి ఉన్న జ్యుడీషియల్‌ అధికారాలను తొలగించి.. సర్పంచుల అప్పీలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో సూచించింది. 

ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులు 
గ్రామ పంచాయతీల్లో ముగ్గురు కో–ఆప్షన్‌ సభ్యులను నామినేట్‌ చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ఇందులో... గ్రామ స్వయం సహాయక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు ఒక కో–ఆప్షన్‌ సభ్యురాలిగా ఉంటారు. గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి లేదా ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసిన వారిలో ఒకరు రెండో కో–ఆప్షన్‌ సభ్యులుగా... గ్రామ పరిపాలన, అభివృద్ధి, చట్టాల్లో నైపుణ్యం, సేవాభావం కలిగిన సీనియర్‌ పౌరులెవరినైనా మూడో కో–ఆప్షన్‌ సభ్యులుగా నామినేట్‌ చేయాలని సూచించింది. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో వీరికి ఓటు వేసే అధికారం ఇవ్వాలా, వద్దా అన్న దానిపై ఉప సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లా, మండల పరిషత్‌లలో కో–ఆప్షన్‌ సభ్యులకు ఓటు అధికారం లేదని, ఇక్కడా అదే విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. వీటితోపాటు మరిన్ని సూచనలను నివేదికలో పొందుపరిచింది. అయితే ఉప సంఘం ఏ సూచన చేసినా.. చివరికి ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమంగా అమలవుతుందని, సర్పంచ్‌ ఎన్నిక అంశం కూడా సీఎం అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని మంత్రివర్గ సభ్యుడొకరు పేర్కొన్నారు.

వార్డు సభ్యుల నుంచే సర్పంచ్‌ ఎన్నిక
సర్పంచ్‌ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించడానికే మంత్రివర్గ ఉపసంఘం మొగ్గు చూపించింది. ప్రస్తుతం గ్రామ ఓటర్లంతా నేరుగా సర్పంచ్‌ను ఎన్నుకునే పద్ధతి అమల్లో ఉంది. ఒకసారి ఎన్నికైతే నాలుగేళ్ల దాకా సర్పంచ్‌ను దింపేయడానికి అవకాశం లేదు. దాంతో సర్పంచుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అందువల్ల వార్డు సభ్యుల నుంచే సర్పంచును ఎన్నుకునేలా చట్ట సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఇక పంచాయ తీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకే కార్యనిర్వహణ అధికారాలు ఉండగా.. వాటిని సర్పంచులకే అప్పగించాలని సూచించింది. సర్పంచులకు ప్రస్తుతం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని గ్రామ కార్యదర్శి ద్వారా అమలు చేయించే అధికారం మాత్రమే ఉంది. దీనివల్ల గ్రామ కార్యదర్శికి, సర్పంచుకు మధ్య సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నట్టు ఉప సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలోని నిర్ణయాలను తీసుకునే అధికారం, జరిమానాలను విధించే అధికారం వంటివాటిని సర్పంచులకే అప్పగించాలని నివేదికలో పేర్కొంది.

‘పెట్టుబడి సాయం’పై సీఎంకు నివేదిక
రైతులకు పంట పెట్టుబడి సాయం పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం సీఎం కేసీఆర్‌కు తమ నివేదికను అందజేసింది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప సంఘం సభ్యులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు తమ సిఫార్సులను అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement