సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
29,304 కేంద్రాల్లో పోలింగ్..
రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్..
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు..
పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్‌చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు.
సర్పంచ్.. మలి పంచ్ నేడే
Published Sat, Feb 13 2021 3:55 AM | Last Updated on Sat, Feb 13 2021 3:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment