1,524 గ్రామీణ రోడ్లు ధ్వంసం
370 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టండి... పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో జూపల్లి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1,524 పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దాదాపు 1,700ల కి.మీ.మేర పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ రహదారుల స్థితిగతులపై ఆ విభాగ ఉన్నతాధికారులతో గురువారం సచివాల యంలో మంత్రి జూపల్లి సమీక్షించారు.
కోతకు గురైన 530 రహదారులకు మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పాడైన అన్ని రోడ్లకు కలిపి తాత్కాలిక మరమ్మతులకు రూ.49.61 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.318.58 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లాల్లో 73 ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.
వీటి మరమ్మతుల కోసం రూ.2.89 కోట్లు అవసరమని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. నాలాల ఆక్రమణ, అనుమతులులేని నిర్మాణాలపై పదిరోజుల్లో గా నివేదికను సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖ డెరైక్టర్‌ను, జిల్లా డీపీవోను ఆదేశించారు.