తాండూరు, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధిక మొత్తంలో నిధులు మంజూరైనా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం ఈ ఏడాది జూలై 2న పంచాయతీరాజ్ శాఖకు రూ.4.70కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ ఈ నిధులతో ఇప్పటివరకు ఏ అభివృద్ధి పనీ చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పనులుచేపట్టకపోతే నిధులు దారిమళ్లే అవకాశం ఉంది. ఈ నిధులు మంజూరైనప్పటి నుంచి ఆరు మాసాల్లో పనులు చేపట్టి వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నిధులు మంజూరై నాలుగు నెలలు దాటింది. ఉపాధి హామీ పథకం కింద తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని మొత్తం 90పంచాయతీలకుగాను 86 పంచాయతీలకు సుమారు రూ.4.70కోట్ల నిధులు మంజూరయ్యాయి.
యాలాల మండలంలోని రాస్నం, నాగసముందర్, పెద్దేముల్ మండలంలో జనగాం, అడ్కిచెర్ల, బషీరాబాద్ మండలంలో నవల్గ, నీళ్లపల్లి, తాండూరు మండలంలో గోనూర్, ఉద్ధండపూర్ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10లక్షలు, మిగతా 78 పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.4.70కోట్లు మంజూ రయ్యాయి. ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలి. టెండర్లు, అగ్రిమెంట్ అవసరం లేకుండానే పంచాయతీలు ఆయా పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఉపాధి పథకంతోపాటు పంచాయతీ పేరు మీద సర్పంచ్, కార్యదర్శులు జాయింట్‌గా బ్యాంకు ఖాతా తీయాలి. ఈ ఖాతా ద్వారానే నిధులు డ్రా చేస్తూ పనులు చేపట్టాలి. కానీ చాలా పంచాయతీల్లో సర్పంచ్‌లు ఇంకా ఇందుకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తీయలేదు. ఎన్నికైన సర్పంచ్‌ల్లో చాలా మంది కొత్తవారే ఉన్నారు. వారికి ఈ పనులపై పూర్తిగా అవగాహన లేదు. ఈ కారణాల వల్ల పనులకు మోక్షం కలగడం లేదు. మిగిలి ఉన్న రెండు నెలల గడువులో కొన్ని పనులైనా చేపడితే నిధులు వెనక్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి అందుబాటులో నిధులు
Published Thu, Nov 7 2013 1:30 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement