తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కారం శివాజీ
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
Published Tue, Sep 20 2016 11:32 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
తిరుపతి మంగళం: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, పోలీస్, అటవీ శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దళితులపై దాడులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. చంద్రన్న బీమా పథకంలో కార్మికులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే రూ.5లక్షల బీమా సౌకర్యం పొందవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటి పట్టాల సమస్య ఉందని, స్పెషల్ డ్రైవ్ పెట్టి స్థలాల మంజూరుకు కృషి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు చట్ట ప్రకారం భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాపవినాశనం వద్ద నక్కల జాతుల వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో పురోగతిని వివరించారు.
Advertisement