ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చిత్రాలు
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చిత్రాలు
Published Sat, Dec 17 2016 9:25 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
రచయిత, దర్శకుడు, కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా
తెనాలి : షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక, వివిధ ప్రభుత్వ పథకాలపై దళిత, గిరిజనులు అవగాహన కల్పించుకొని ఆయా కార్యక్రమాలతో అభివృద్ధిని సాధించాలనేది తన అభిమతంగా టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన ఎస్సీ ఉపప్రణాళికలోని వివిధ అంశాలపై తొమ్మిది ప్రచార చిత్రాలను, అన్ని పథకాల్లోని అంశాలు ప్రతిబింబించే విధంగా నృత్యరూపకంతో మరో చిత్రాన్ని ఇటీవలే ఆయన తీశారు. మొత్తం 10 ప్రచార చిత్రాలకు ఆయనే రచన, దర్శకత్వం వహించారు. డబ్బింగ్, మిక్సింగ్ తదితర నిర్మాణానంతర కాక్రమాలను పూర్తిచేసుకుని సెన్సారుకు వెళుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇక్కడి క్యాపిటల్ స్టూడియోలో విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్‌సీస్, సిమెంటురోడ్లు/మంచినీరు, అత్యాచార నిరోధక చట్టం, భూమి కొనుగోలు పథకం, అంటరానితనం, కులాంతర వివాహాలు, నైపుణ్య శిక్షణ పేరుతో గల ఈ చిత్రాల్లో అనుభవజ్ఞులైన సినిమా నటులు అన్నపూర్ణ, వినోద్, నరసింహరాజు, బాలాజీ ఇతర టీవీ నటీనటులే కాకుండా స్థానిక ఔత్సాహిక, వర్ధమాన నటులతో తెనాలి, పరిసరాల్లోనే చిత్రీకరించినట్టు దిలీప్‌రాజా చెప్పారు. చిత్రాల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నిరకాల సాంకేతిక హంగులను చేర్చినట్టు తెలిపారు. సెన్సారు అయిన అనంతరం వీటిని ప్రచారానికి వినియోగించే నిమిత్తం ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వివరించారు. సమావేశంలో నిర్మాత ఆలూరి సుందరరామయ్య, షబ్బీర్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement