జవాబుదారీ తనం ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం పాములపర్తి సదాశివరావు మెమోరియాల్ ఫౌండేషన్...
నయీంనగర్ : జవాబుదారీ తనం ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం పాములపర్తి సదాశివరావు మెమోరియాల్ ఫౌండేషన్, వాగ్దేవి కాలేజీల ఆధ్వర్యంలో హన్మకొండ వాగ్దేవి కళాశాల సెమినార్ హాల్‌లో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక ప్రథమ సభ నిర్వహించారు. కోవెల సుప్రసన్నాచార్యుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందుర్తి ప్రభాకర్‌రావు రచించిన ‘సురవరం ప్రతాప్‌రెడ్డి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన’ పుస్తకాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యావ్యాప్తి దార్వానే సమాజంలోని అసమానతలను తొలగించవచ్చని, ఇందుకోసం ప్రతాప్‌రెడ్డి కృషి చేశారన్నారు. నవ తెలంగాణలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య ఉన్న అగాంధాన్ని పాలక వర్గాలు తొలగించినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. శాసనసభలో ప్రజలకు జవాబుదారీగా ఉండే కార్యక్రమాలను రూపొందించే నాయకత్వం ఉండాలని చెప్పారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రధానమని, ఆచరించనపుడే సమస్య లు తలెత్తుతాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు హైకోర్టు వంటి ప్రత్యేక వ్యవస్థలు దోహదపడుతాయని తెలిపారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు చైతన్యవంతమవుతాడని వివరించారు.
సభలో రచయితలు ప్రొఫెసర్లు బన్న ఐలయ్య, రవ్యాశ్రీహరి, పర్మాజీ, అంపశయ్య నవీన్, ఎంవీ.రంగారావు, దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు.


