తాత్కాలిక ఉద్యోగులకు హాస్టల్ లైఫే! | temporary employees to the hostel life | Sakshi
Sakshi News home page

తాత్కాలిక ఉద్యోగులకు హాస్టల్ లైఫే!

Published Sat, May 28 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

temporary employees to the hostel life

వసతుల కల్పనలో చేతులెత్తేసిన సర్కారు
దీంతో హాస్టళ్ల వైపు ఉద్యోగుల మొగ్గు
హైదరాబాద్‌లో కుటుంబాలు.. హాస్టల్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులు



విజయవాడ బ్యూరో : తాత్కాలిక సచివాలయ విధులకు రావాల్సిందేనని చెబుతున్న సర్కారు ఉద్యోగులకు వసతి సౌకర్యాల కల్పనలో చేతులెత్తేసింది. విధులకు రాక తప్పని పరిస్థితి, వసతి లేని ఇబ్బందికర పరిస్థితి వెరసి ప్రైవేటు హాస్టళ్ల కాన్సెప్ట్‌కు తెరలేచింది. ముంబయి, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ తరహాలో వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం హాస్టళ్లు తెరుచుకుంటున్నాయి. తాడేపల్లి, ఉండవల్లి, మందడం ప్రాంతాల్లో ఇప్పటికే మూడు హాస్టళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మరో నాలుగు హాస్టళ్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 27 నుంచి తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు తరలిరావాలని ప్రభుత్వం ఇప్పటికే అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ఉద్యోగులు ఇప్పటికే వచ్చి రాజధాని ప్రాంతాన్ని చూసుకుని విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె ఇళ్లు చూసుకున్నారు. తొలి దశలో కనీసం రెండు వేల మంది ఉద్యోగులు వస్తారని భావిస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో దశలవారీగా  మొత్తం పదివేల మంది సచివాలయ ఉద్యోగులు వస్తారని చెబుతున్నారు. తొలినాళ్లలో వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యాలు కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం జీతాలతో పాటు హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె అలవెన్సు) ఇస్తుండటంతో ఉద్యోగులు సొంతంగా అద్దె ఇళ్లు సమకూర్చుకోవాల్సిందేనని నిర్దేశించింది.

 
ఇంటి కంటే హాస్టలే పదిలం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు రోజులే పని దినాలుగా ప్రకటించడంతో ఇంటి కంటే హాస్టలే పదిలమని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ప్రైవేటు హాస్టళ్లకు గిరాకీ ఏర్పడింది. సొంత కారు, బస్సు, రైళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడకు సోమవారం ఉదయం చేరుకుని శుక్రవారం వరకు పనిచేసుకుని హైదరాబాద్ వెళ్లేందుకే ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు ఏపీలోను, మరొకరు తెలంగాణ సర్వీసుల్లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం వారికి ఆప్షన్లు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పలువురి పిల్లల ఉన్నత చదువులు మధ్యలో ఉండటంతో వారి కుటుంబాలను అమరావతికి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏదో ఒకలా వారంలో ఐదు రోజులు ఇక్కడే ఫోర్సుడ్ బ్యాచ్‌లర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు హాస్టళ్ల కాన్సెప్ట్‌పై వారు ఆసక్తి చూపుతున్నారు.

 
కొత్త ట్రెండ్..

మెట్రోపాలిటన్ నగరాలు, గ్రేటర్ సిటీలకు పరిమితమైన ఉద్యోగుల హాస్టళ్ల సంస్కృతి అమరావతికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లు నిర్వహించే రాయలసీమకు చెందిన అర్జునరెడ్డి, పి.రామాంజనేయులు, ఆదినారాయణ కలిసి ఈ కొత్త ట్రెండ్‌ను చేపట్టారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లు రెండేళ్లకు కాంట్రాక్టుగా అగ్రిమెంట్ రాయించుకుని ఒక్కో రూమ్‌కు నలుగురు నుంచి ఆరుగురు ఉద్యోగులు ఉండేలా సౌకర్యాలను కల్పిస్తున్నారు. వసతి, టిఫిన్, భోజనం సహా ఒక్కొక్కరి నుంచి నెలకు నాన్ ఏసీ రూమ్‌కు రూ.6 వేలు, ఏసీ రూమ్‌కు రూ.7,500 చొప్పున రుసుం వసూలు చేసేలా నిర్ణయించారు. వారంలో రెండు రోజులు మాంసాహారం పెట్టనున్నారు.

 
డార్మెట్రీ తరహాలోనూ...

నెలవారీగా రూమ్‌లు అద్దెకు ఇవ్వడం, భోజన వసతి కల్పించడమే కాకుండా అంత ఖర్చు అనవసరం అనుకునేవారికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు గాను డార్మెట్రీకి రోజుకు రూ.100, రూ.150 చొప్పున, లాకర్‌కు రూ.30, ఫ్రెషప్ అవడానికి రూ.50 చొప్పున రుసుం వసూలు చేసే ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు.

 
ఇప్పటికే వెలగపూడి సచివాలయ పనుల నిమిత్తం వచ్చిన 25 మంది ఎల్‌అండ్‌టీ ఉద్యోగులు సమీపంలోని మందడం హాస్టల్‌లో ఉంటున్నారు. త్వరలో రానున్న సచివాలయ ఉద్యోగులను ప్రైవేటు హాస్టళ్లకు తీసుకొచ్చేలా జూన్ రెండున హైదరాబాద్‌లో హాస్టల్ రూమ్‌ల బుకింగ్‌ను ప్రారంభించనుండటం విశేషం. మొత్తానికి కొత్త రాజధానిలో సర్కారు తీరుతో ప్రైవేటు హాస్టళ్ల వాత పడక తప్పనిసరి అయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement