ఒక్కరోజు ముచ్చటేనా? | Is it was a single day fun? | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు ముచ్చటేనా?

Published Fri, Jul 1 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఒక్కరోజు ముచ్చటేనా?

ఒక్కరోజు ముచ్చటేనా?

టెంకాయ కొట్టి వెళ్లిపోయారు
- రాజధానికి తరలింపు అంతా తూతూ మంత్రం
- ప్రారంభం కోసం వెలగపూడిలో తొలిరోజు హడావుడి
- శాఖాధిపతులు, ఉద్యోగులూ హైదరాబాద్‌లోనే
- కనీస సౌకర్యాలు, రహదారి లేదంటున్న ఉద్యోగులు
- పూర్తిస్థాయి తరలింపునకు మరో నెలరోజులు
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది. జూన్ 27వ తేదీకల్లా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు శాఖాధిపతుల కార్యాలయాలు తరలివెళ్లాల్సిందేనని సర్కారు ఆదేశించడంతో ఆ తరలింపులు తూతూ మంత్రంగా ముగిశాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దెకు భవనాలను తీసుకుని అక్కడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి మరుసటి రోజు ఉదయమే ఉద్యోగులు హైదరాబాద్ వచ్చేశారు. అద్దెకు కార్యాలయాలు తీసుకున్నప్పటికీ ఆ భవనాల్లో పనిచేసేందుకు వీలుగా మార్పులు, చేర్పులు చేయడానికి చాలా సమయం పడుతుందని శాఖాధిపతులు చెబుతున్నారు.

అక్కడ పనిచేసే వాతావరణమే లేకుండా ఎలాపనిచేస్తామని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం హడావిడిగా తేదీలను ప్రకటించడంతోనే ఈ తంటాలు వచ్చాయనేది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది.  వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముహూర్తం పేరుతో బుధవారం(జూన్ 29) వెలగపూడి వెళ్లిన ఉద్యోగులు గురువారం ఉదయానికి హైదరాబాద్ వచ్చేశారు. అక్కడ పనిచేయడానికి మరో నెల  పడుతుంది.

 మరో నెలరోజులు హైదరాబాద్‌లోనే...
 ప్రధాన భూ పరిపాలన కార్యాలయం కోసం గొల్లపూడిలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. సీసీఎల్‌ఎ మరికొందరు అధికారులు కలసి బుధవారం ఆ భవనంలోకి ప్రవేశించి కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. అక్కడ ఆఫీసుగా మార్పులు చేయడానికి నెల పడుతుంది. దీంతో ఇద్దరు ఉద్యోగులను  అక్కడ ఉంచి మిగతా వారు హైదరాబాద్‌లో సీసీఎల్‌ఏ ఆఫీసులోనే ఉంటున్నారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానిదీ ఇదే పరిస్థితి. అధికారులు ఈడుపుగల్లులోని భవనాన్ని ప్రారంభించి హైదరాబాద్ వచ్చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ వ్యవహారాలుండాలి. ఈ మార్పుల కోసం మరో నెల రోజులు అవసరం.
డెరైక్టర్ ఆఫ్  మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం కోసం విజయవాడలోని పాత బో ధనాసుపత్రిలో రోగులుంటే రెండు వార్డులను ఖాళీచేయిస్తున్నారు. రోగుల వార్డుల ను ఖాళీ చేయించడంతో పాటు మార్పులు చేర్పులు చేయడానికి సమయం పడుతుం ది. అయితే గత నెల 24న కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.
జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, కమిషనరేట్ కార్యాలయాల కోసం గొల్లపూడిలో ప్రైవేట్ భవనం అద్దెకు తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆ భవనం సిద్ధం కాలేదు. దీంతో వెయ్యి మంది ఉద్యోగుల్లో విజయవాడకు వెళ్లింది నలుగురే.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యాలయాల కోసం విజయవాడలోని సూర్యారావుపేటలో ఒక పాత ఆసుప్రతి భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడా అదే స్థితి.    గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో 115 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా విజయవాడలో ఇద్దరు ఉద్యోగులను ఉంచి, మిగతా వారందరూ హైదరాబాద్ వచ్చేశారు. పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
గ్రామీణ మంచినీటి సరఫరా కార్యాలయం కోసం గొల్లపూడిలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మొత్తం 80 మంది ఉద్యోగులకు గాను పది మందే గొల్లపూడిలో ఉండగా మిగతా వారు హైదరాబాద్‌లో ఉన్నారు.
వాణిజ్య పన్నుల కార్యాలయంకోసం ఈడ్పుగల్లులో అద్దెకు తీసుకున్న భవనం ఆఫీసులా తయారు కావడానికి నెల సమ యం పడుతుంది. స ఒక్క వ్యవసాయ, సహకార, రహదారులు-భవనాల ఇంజనీరింగ్, ఆర్టీసీ, ఎక్సైజ్ కార్యాలయాలు మా త్రం పూర్తి స్థాయిలో విజయవాడ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఆ కార్యాలయాల ఉద్యోగులూ అక్కడే పనిచేస్తున్నారు.
 
 ప్రారంభం కోసమే హడావుడి
 సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి రెండో రోజు ఉద్యోగులెవరూ రాలేదు. పాలనాపరమైన కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. సచివాలయం దగ్గరకు వెళ్లడానికి కనీస రహదారి సౌకర్యం కూడా లేదని, మంచినీటి, డ్రైనేజీ, టాయిలెట్ల సౌకర్యం కూడా కల్పించలేదని, ఇవన్నీ కల్పించడానికి మరో నెల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఆ తర్వాతే ఇక్కడినుంచి పని చేయగలమని తెలిపారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని బుధవారం రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభ వేడుకలకు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఐదు ప్రత్యేక బస్సుల్లో వెలగపూడి తీసుకొచ్చారు.

ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లు బుధవారం నుంచే పాలనాపరమైన కార్యక్రమాలు తాత్కాలిక సచివాలయం నుంచే నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ముహూర్తం పేరుతో బుధవారం వచ్చిన ఉద్యోగులు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ వెంటనే ఐదో భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూలీలు యథావిధిగా పనులు చేపట్టడం కనిపించింది. అనుకున్న ముహూర్తానికి ప్రారంభించి  మాట నిలబెట్టుకున్నామని చెప్పుకునేందుకు హడావుడి చేశారనే ప్రచారం జరుగుతోంది. గురువారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణాలను పరిశీలించేందుకు రాగా... ద్వితీయ విఘ్నం ఉండకూడదని గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తన చాంబర్‌లో కూర్చొని వెళ్లారు. హైదరాబాద్ నుంచి సైకిల్‌పై పయనమైన ఏసీటీవో పద్మాచౌదరి గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement