కుంగిన భవనం.. వెలగపూడిలో కలకలం
సచివాలయానికి కూతవేటు దూరంలో నేలలోకి దిగబడిన మూడంతస్తుల భవనం
సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుంగిపోవడం కలకలం రేపింది. మందడంలో ఆదినేని గోపిరాజు అనే వ్యక్తి గతంలో నిర్మించిన భవనం(గ్రౌండ్ ఫ్లోర్)పై ఇటీవల కొత్తగా రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం పూర్తయ్యే దశలో పది రోజుల నుంచి భూమిలోకి కుంగిపోతున్న విషయాన్ని గమనించారు. ఆ భవనం రెండు అడుగులు మేర నేలలోకి దిగబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన భవన యజమాని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి జె అండ్ జె కంపెనీకి చెందిన నిపుణులను రప్పించారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన సామాగ్రితో టెక్నాలజీ ఉపయోగించి ఆ భవనాన్ని జాకీలతో పైకిలేపారు. ఈ ప్రాంతంలో నేల స్వభావం మెతకగా ఉండటం వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
బహుళ అంతస్తులకు పనికొచ్చేనా?
రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో నేల స్వభావం మెతక అనే విషయం గత సర్వేల్లో తేలింది. ఇక్కడి నేల బహుళ అంతస్తులకు పనికిరాదని అప్పట్లోనే సర్వే సంస్థలు నిర్ధారించాయి. తాజాగా తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడి ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలోనే మూడు అంతస్తుల భవనం కుంగిపోవడం తీవ్ర చర్చకు తావిచ్చింది.