
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అమరావతిలో రైతుల ఉద్యమమే లేదు. అక్కడ ఉన్నది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వారంతా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఆయన బినామీలే. అమరావతిలో చంద్రబాబు డ్రామానే నడుస్తోంది. అదంతా కృత్రిమ ఉద్యమమే. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని’’ ఆయన దుయ్యబట్టారు. (చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు)
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకుందన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఐదేళ్లలో ఒక్క నిరుపేదకు కూడా గత టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని’’ అంజాద్ బాషా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment