రాజధానిలో ఐదు రోజులే పనిదినాలు
- తరలింపునకు ఇక 35 రోజులే గడువు
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు
- ఏడాదిపాటు అమలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక 35 రోజులే గడువు ఉంది. జూన్ 27వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లి ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని ప్రాంతంలో పనిచేయనున్న ఉద్యోగులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను తొలుత ఏడాది పాటు అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం జీవో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదు రోజుల పనిదినాలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషన్స్‌కు వర్తిస్తాయన్నారు.
హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లి పనిచేయడం వల్ల కుటుంబాలు ఒత్తిడికి గురవుతాయని, ఈ నేపథ్యంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా సంస్థలు, జిల్లా, ప్రాంతీయ, స్థానిక సంస్థల, జ్యుడీషియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఐదు రోజులు పనిదినాలు వర్తించవని స్పష్టం చేశారు. ఐదు రోజుల పనిదినాలు, పని వేళలు అమలు ఎప్పటి నుంచి అనేది తరువాత నోటిఫై చేస్తామని తెలిపారు. దీంతో సచివాలయ ఉద్యోగులు నూతన రాజధాని ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూసుకోవడం, పిల్లలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లను చూసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. సీఎస్ టక్కర్ కూడా జూన్ 27న వెలగపూడికి సీఎస్ కార్యాలయాన్ని తరలించాలని పేషీలోని సిబ్బందికి ఆదేశించారు.