government corporations
-
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన టీఆర్ఎస్ నేతలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని టీఎస్ఎండీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిషాంక్, అసెంబ్లీ ఎదురుగా ఉన్న హాకా భవన్లో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. మన్నె క్రిషాంక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరై అభినందించారు. నూతన టీఎస్టీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పాటిమీది జగన్మోహన్రావును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. అనంతరం బేవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా గజ్జెల నాగేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరై అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. -
రాజధానిలో ఐదు రోజులే పనిదినాలు
- తరలింపునకు ఇక 35 రోజులే గడువు - ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు - ఏడాదిపాటు అమలు.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి వెళ్లి పనిచేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక 35 రోజులే గడువు ఉంది. జూన్ 27వ తేదీన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లి ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రాజధాని ప్రాంతంలో పనిచేయనున్న ఉద్యోగులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను తొలుత ఏడాది పాటు అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సోమవారం జీవో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదు రోజుల పనిదినాలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కు వర్తిస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లి పనిచేయడం వల్ల కుటుంబాలు ఒత్తిడికి గురవుతాయని, ఈ నేపథ్యంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా సంస్థలు, జిల్లా, ప్రాంతీయ, స్థానిక సంస్థల, జ్యుడీషియల్ ఇన్స్టిట్యూషన్స్కు ఐదు రోజులు పనిదినాలు వర్తించవని స్పష్టం చేశారు. ఐదు రోజుల పనిదినాలు, పని వేళలు అమలు ఎప్పటి నుంచి అనేది తరువాత నోటిఫై చేస్తామని తెలిపారు. దీంతో సచివాలయ ఉద్యోగులు నూతన రాజధాని ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూసుకోవడం, పిల్లలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లను చూసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. సీఎస్ టక్కర్ కూడా జూన్ 27న వెలగపూడికి సీఎస్ కార్యాలయాన్ని తరలించాలని పేషీలోని సిబ్బందికి ఆదేశించారు. -
‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ
పట్టణాలు, నగరాల్లో ఇళ్ల కొరత తీర్చడానికి కేంద్రం నిర్ణయం బిల్డర్ల బహుళ అంతస్తుల భవనాల్లో ప్రత్యేకంగా ఫ్లాట్లు వెనుకబడిన తరగతులు, కనిష్ట ఆదాయ గ్రూపులకు వర్తింపు ఒక్కో యూనిట్‌కు 75 వేల సబ్సిడీ అందజేస్తామని వెల్లడి బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలు.. నిబంధనల్లోనూ సడలింపు ప్రభుత్వ ప్రమేయంతోనే ధరలు, కేటాయింపుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం, ప్రభుత్వ కార్పొరేషన్లు నిర్మించే భవన సముదాయాల్లోనే కాదు.. ఇక నుంచి ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్ల కోసం కూడా పేదలకు సబ్సిడీ అందనుంది. దేశంలో మురికివాడలను నిర్మూలించే ఉద్దేశంతో ‘రాజీవ్ ఆవాస్ యోజన’ కింద ఈ సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రైవేట్ బిల్డర్లు తాము నిర్మించే భవనాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యుఎస్), కనిష్ట ఆదాయ గ్రూపు(ఎల్ఐజీ) వారికి ఫ్లాట్లు నిర్మించి.. వారికి అందిస్తే ఒక్కో ఫ్లాట్‌పై రూ. 75 వేలు సబ్సిడీ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధమైన సబ్సిడీని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే నిర్మించి అందజేసేవి. తాజాగా ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకూ వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ‘రాజీవ్ ఆవాస్ యోజన’లోని ఈ మార్గదర్శకాలు 2013-22 మధ్యకాలం వరకు వర్తిస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రైవేట్ బిల్డర్లు నిర్మించే హెచ్ఐజీ (అధికాదాయ వర్గాలు), ఎంఐజీ (మధ్య తరగతి వర్గాలు) పరిధితోపాటు ఈ ఇళ్లను కూడా కలగలిపి నిర్మించాలని... ఒక్కో వెంచర్లో కనీసం 250 ఫ్లాట్లు/యూనిట్లు ఉంటేనే ఈ సబ్సిడీ వర్తింపజేస్తామని కేంద్రం వెల్లడించింది. పేదలకు తక్కువ ధరలో ఇళ్లు/ఫ్లాట్లు లభించాలంటే ఇది తప్పనిసరని కేంద్రం పేర్కొంది. తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైతే ప్రైవేటు బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలిచ్చి పేదల కోసం ఇళ్లు నిర్మించేలా ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు నగరాలు, పట్టణాల్లో ల్యాండ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. రాజస్థాన్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రైవేటు సంస్థలు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు.. వారికి భూ వినియోగ మార్పిడితో పాటు నిర్మాణంలో కొన్ని రాయితీలను కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎల్ఐజీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు ఇళ్ల నిర్మాణాల కోసం అభివృద్ధి నియంత్రణలను సరళతరం చేయాలని.. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను ఎక్కువగా అనుమతించాలని, పార్కింగ్ కోసం నియమాలను సరళతరం చేయాలని పేర్కొంది. అలాంటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులను 60 రోజుల్లోగా ఇచ్చేలా నిబంధనలు ఉండాలని తెలిపింది. వారికి స్టాంపు డ్యూటీ రాయితీలు కల్పించాలని కోరింది. కేంద్రం ఇచ్చే రూ. 75 వేల సబ్సిడీని ప్రాజెక్టుల పురోగతి ఆధారంగా ప్రభుత్వం 40:40:20 లెక్కన మూడు దశల్లో విడుదల చేస్తుందని వెల్లడించింది. కేటాయింపుల్లో ప్రాధాన్యతా క్రమం.. ఈ తరహా ఫ్లాట్లు/ఇళ్ల కేటాయింపును పారదర్శకంగా ప్రభుత్వాలే చేపట్టాలని... మొదట వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్స్, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర అల్పాదాయ వర్గాలకు ప్రాధాన్యతా క్రమంలో అందజేయాలని కేంద్రం సూచించింది. ఒక్కో ఫ్లాట్/ఇల్లు కార్పెట్ ఏరియా (గోడల మధ్య ఉండే స్థలం) కనీసం 21-40 చదరపు మీటర్లు ఉండాలని నిర్ధారించింది. ఈడబ్ల్యుఎస్ కింద ఇల్లు/ఫ్లాట్ పొందేవారి వార్షికాదాయం రూ. లక్ష లోపు, ఎల్ఐజీ వారికి రూ. రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేసింది. 250 యూనిట్ల వెంచర్లో కనీసం 35 శాతాన్ని.. ఈడబ్ల్యుఎస్‌కు 21-27 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతంగా, ఎల్ఐజీ-ఏకి 28-40 చదరపు మీటర్లు, ఎల్ఐజీ-బీకి 41-60 చదరపు మీటర్లలోపు కార్పెట్ ప్రాంతంగా ఉంచాలని పేర్కొంది. ఈ ఇళ్లు/ఫ్లాట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.