‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ | Subsidy to Poor People in Private Ventures | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ

Published Mon, Dec 23 2013 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ

‘ప్రైవేటు’ఇళ్లలోనూ పేదలకు సబ్సిడీ

 పట్టణాలు, నగరాల్లో ఇళ్ల కొరత తీర్చడానికి కేంద్రం నిర్ణయం
 బిల్డర్ల బహుళ అంతస్తుల భవనాల్లో ప్రత్యేకంగా ఫ్లాట్లు
 వెనుకబడిన తరగతులు, కనిష్ట ఆదాయ గ్రూపులకు వర్తింపు
 ఒక్కో యూనిట్‌కు 75 వేల సబ్సిడీ అందజేస్తామని వెల్లడి
 బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలు.. నిబంధనల్లోనూ సడలింపు
 ప్రభుత్వ ప్రమేయంతోనే ధరలు, కేటాయింపుల నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం, ప్రభుత్వ కార్పొరేషన్లు నిర్మించే భవన సముదాయాల్లోనే కాదు.. ఇక నుంచి ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్ల కోసం కూడా పేదలకు సబ్సిడీ అందనుంది. దేశంలో మురికివాడలను నిర్మూలించే ఉద్దేశంతో ‘రాజీవ్ ఆవాస్ యోజన’ కింద ఈ సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రైవేట్ బిల్డర్లు తాము నిర్మించే భవనాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యుఎస్), కనిష్ట ఆదాయ గ్రూపు(ఎల్‌ఐజీ) వారికి ఫ్లాట్లు నిర్మించి.. వారికి అందిస్తే ఒక్కో ఫ్లాట్‌పై రూ. 75 వేలు సబ్సిడీ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధమైన సబ్సిడీని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే నిర్మించి అందజేసేవి. తాజాగా ప్రైవేటు బిల్డర్లు నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకూ వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ‘రాజీవ్ ఆవాస్ యోజన’లోని ఈ మార్గదర్శకాలు 2013-22 మధ్యకాలం వరకు వర్తిస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రైవేట్ బిల్డర్లు నిర్మించే హెచ్‌ఐజీ (అధికాదాయ వర్గాలు), ఎంఐజీ (మధ్య తరగతి వర్గాలు) పరిధితోపాటు ఈ ఇళ్లను కూడా కలగలిపి నిర్మించాలని... ఒక్కో వెంచర్‌లో కనీసం 250 ఫ్లాట్లు/యూనిట్లు ఉంటేనే ఈ సబ్సిడీ వర్తింపజేస్తామని కేంద్రం వెల్లడించింది. పేదలకు తక్కువ ధరలో ఇళ్లు/ఫ్లాట్లు లభించాలంటే ఇది తప్పనిసరని కేంద్రం పేర్కొంది.

తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలి..
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైతే ప్రైవేటు బిల్డర్లకు తక్కువ ధరకు స్థలాలిచ్చి పేదల కోసం ఇళ్లు నిర్మించేలా ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు నగరాలు, పట్టణాల్లో ల్యాండ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. రాజస్థాన్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విధానాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రైవేటు సంస్థలు ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు.. వారికి భూ వినియోగ మార్పిడితో పాటు నిర్మాణంలో కొన్ని రాయితీలను కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఎల్‌ఐజీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు ఇళ్ల నిర్మాణాల కోసం అభివృద్ధి నియంత్రణలను సరళతరం చేయాలని.. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌ను ఎక్కువగా అనుమతించాలని, పార్కింగ్ కోసం నియమాలను సరళతరం చేయాలని పేర్కొంది. అలాంటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులను 60 రోజుల్లోగా ఇచ్చేలా నిబంధనలు ఉండాలని తెలిపింది. వారికి స్టాంపు డ్యూటీ రాయితీలు కల్పించాలని కోరింది. కేంద్రం ఇచ్చే రూ. 75 వేల సబ్సిడీని ప్రాజెక్టుల పురోగతి ఆధారంగా ప్రభుత్వం 40:40:20 లెక్కన మూడు దశల్లో విడుదల చేస్తుందని వెల్లడించింది.

కేటాయింపుల్లో ప్రాధాన్యతా క్రమం..
ఈ తరహా ఫ్లాట్లు/ఇళ్ల కేటాయింపును పారదర్శకంగా ప్రభుత్వాలే చేపట్టాలని... మొదట వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్స్, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర అల్పాదాయ వర్గాలకు ప్రాధాన్యతా క్రమంలో అందజేయాలని కేంద్రం సూచించింది. ఒక్కో ఫ్లాట్/ఇల్లు కార్పెట్ ఏరియా (గోడల మధ్య ఉండే స్థలం) కనీసం 21-40 చదరపు మీటర్లు ఉండాలని నిర్ధారించింది. ఈడబ్ల్యుఎస్ కింద ఇల్లు/ఫ్లాట్ పొందేవారి వార్షికాదాయం రూ. లక్ష లోపు, ఎల్‌ఐజీ వారికి రూ. రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేసింది. 250 యూనిట్ల వెంచర్‌లో కనీసం 35 శాతాన్ని.. ఈడబ్ల్యుఎస్‌కు 21-27 చదరపు మీటర్ల కార్పెట్ ప్రాంతంగా, ఎల్‌ఐజీ-ఏకి 28-40 చదరపు మీటర్లు, ఎల్‌ఐజీ-బీకి 41-60 చదరపు మీటర్లలోపు కార్పెట్ ప్రాంతంగా ఉంచాలని పేర్కొంది. ఈ ఇళ్లు/ఫ్లాట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement