సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలో జారీ చేసిన దాదాపు లక్ష సరిఫికెట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదుల్లా నటిస్తూ మభ్యపుచ్చే కథనాలు ప్రచురించే వారిని ఏమనాలి? అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల సంఖ్య ఇదీ! రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సజావుగా జారీ అవుతుంటే అసలు ప్రొఫార్మా సైతం రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలకు చేరలేదంటూ ‘ఈనాడు’ యథావిధిగా తనకు అలవాటైన రీతిలో పచ్చి అబద్ధాలను వండి వార్చింది. సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈడబ్ల్యూఎస్ సదుపాయాన్ని వినియోగించుకోగలమా? అని మథనపడుతున్నట్లు శోకాలు పెట్టింది.
జనవరి నుంచే జారీ
ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చేసిన చట్టానికి అనుగుణంగా వీటిని జారీ చేస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటికోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ వరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోసం 1,04,961 లక్షల మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోగా 93,348 జారీ అయ్యాయి. 7,608 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 4,005 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మరి ప్రొఫార్మాలే రెవెన్యూ కార్యాలయాలకు చేరకుంటే ఇన్ని లక్షల సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయి?
ఇదీ ప్రక్రియ
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళుతుంది. అక్కడి నుంచి వీఆర్వో, ఆర్‌ఐ ద్వారా తహసీల్దార్ వద్దకు చేరుతుంది. ఇందుకోసం రూ.50 సర్వీస్ చార్జీ చెల్లించాలి. దరఖాస్తుతోపాటు నోటరీ అఫిడవిట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జత చేయాలి. దరఖాస్తును 30 రోజుల్లోపు కచ్చితంగా క్లియర్ చేస్తారు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండే అర్హులైన అగ్రవర్ణ పేదలకు నిబంధనల ప్రకారం వీటిని జారీ చేస్తారు. వాస్తవాలు ఇలా ఉండగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవడంలేదని, దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఈనాడు దిగజారుడు కథనాన్ని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment