వివాదానికి ఆ జీవోనే కారణం.. మీ వైఖరి చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ మూడు వారాలకు వాయిదా
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వినర్ కోటా కింద జనరల్ కేటగిరీలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం ఆర్థి కంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఈ మొత్తం వివాదానికి ఆ జీవోనే కారణమని తేల్చి చెప్పింది. ప్రభుత్వమే దానిని ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయంది. దీనిపై వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో 94 అమలును నిలిపేసిన హైకోర్టు
సీట్ల సంఖ్యను పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఆ జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జీవో 94తో పాటు ప్రస్తుతం జనరల్ కేటగిరిలో ఉన్న 50 శాతం సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా సర్దుబాటు చేయాలంటూ ఎన్‌ఎంసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యంపైనా సీజే ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ రెండు వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు యరగొర్ల ఠాగూర్ యాదవ్, ఎం.కె.రాజ్ కుమార్ తెలిపారు. అయితే ఈ వివరాలన్నింటినీ రికార్డ్ చేస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది.
అసలు జీవో 94నే ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి కదా అని ధర్మాసనం ప్రశి్నంచింది. మెరుగైన మౌలిక సౌకర్యాలు ఉంటే ప్రైవేటు కాలేజీల్లో అదనపు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చెప్పిన నేపథ్యంలో జీవో 94ను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ‘బెయిల్’పై నేడు తీర్పు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్ర«ధాన కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. వాస్తవానికి హైకోర్టు మంగళవారమే తీర్పు వెలువరిస్తామని గతంలోనే స్పష్టం చేసింది. కానీ మంగళవారం ఆ కేసులేవీ విచారణ జాబితాలో లేకపోవడంతో వాటి గురించి వైఎస్సార్‌సీపీ నేతల తరఫు న్యాయవాది ప్రస్తావించారు.
దీంతో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ స్పందిస్తూ.. బుధవారం తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ
సాక్షి, అమరావతి : విజయవాడ, అమరావతిలో భారీ వరద నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో కేసుల విచారణ హైబ్రిడ్ (ఆన్‌లైన్, భౌతిక) విధానంలో జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో సహా సగం మంది న్యాయమూర్తులు హైకోర్టుకొచ్చి కేసుల విచారణ చేపట్టారు. సీజే ధర్మాసనం ముందు అత్యధిక న్యాయవాదులు ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించగా, అతి కొద్ది మంది కోర్టుకొచ్చి వాదనలు వినిపించారు.
మిగిలిన సగం మంది న్యాయమూర్తులు వారి ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో కేసులను విచారించారు. 95 శాతం కేసులు వాయిదా పడ్డాయి. భోజన విరామ సమయానికికల్లా న్యాయమూర్తులు కేసుల విచారణ పూర్తి చేశారు. కోర్టు సిబ్బంది యథాతథంగా హైకోర్టుకొచ్చి విధులు నిర్వర్తించారు. బుధవారమూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
విజయవాడలో భారీ వరద, కరకట్ట వద్ద ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్ విధానంలో కేసుల విచారణ చేపట్టాలంటూ హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం మంగళ, బుధవారాల్లో కేసుల విచారణ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలంటూ ప్రధాన న్యాయమూర్తి పాలనాపరమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment