‘బురద’ సౌకర్యాలు!
- తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ బురదమయం
- వసతులు కల్పించాకే కార్యాలయాల తరలింపు
- ఉన్నతాధికారుల స్పష్టీకరణ
సాక్షి, అమరావతి/హైదరాబాద్: పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో పని చేయబోయే ఉద్యోగులకు భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి ప్రాథమిక, అత్యవసర సౌకర్యాలు కూడా కల్పించకుండానే ఉద్యోగులను సర్కారు హడావుడిగా తరలించి కొబ్బరికాయ కొట్టి ‘మమ’ అనిపించింది. కార్యాలయాలేవీ సిద్ధం చేయకుండానే అన్నీ సగం పనులు చేసి ఆర్భాటం ప్రదర్శిస్తోంది.
తాత్కాలిక సచివాలయానికి వెళ్లే రోడ్లన్నీ బురదమయంగా దర్శనమిస్తున్నాయని, సౌకర్యాలు లేకుండా కార్యాలయాలు అమరావతికి తరలించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఎక్కడికెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు అద్దె భవనాల్లోకి పలు శాఖలను తరలించారు. ఆ భవనాలూ పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధంగా లేవు. తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాక్‌లో రెండు గదులను తాత్కాలికంగా సిద్ధం చేశారు. ఐదో బ్లాక్‌కు దారి తీసే రోడ్లన్నీ బురదమయం. ఇంకో ఐదు నెలలు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాగునీరు, టాయిలెట్లు లేవు..: ఉద్యోగులకు తాగునీరూ కరువే. ఉద్యోగులు తాగునీటి సీసాలు కొనుక్కోవడానికి కూడా బురదలో నడుచుకుంటూ బయటకు రావాల్సిందే. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే.. అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం తప్ప మరో మార్గం లేదు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకుండా.. తరలింపు ప్రక్రియను కానిచ్చేశారు. ‘కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే అక్కడికి వెళతాం. ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదు’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు.